Wednesday, April 23, 2025

ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించాడనే ఆక్రోశంతో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

తన బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, సస్పెండ్‌కు కారణమైన సాయి ప్రకాశ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ అరెస్టుకు సంబంధించి మంగళవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి 11 గంటల నుండి ములుగు జిల్లా, వెంటాపురం (వాజేడు) ప్రాంతానికి చెందిన చిడెం సాయి ప్రకాశ్ (మృతుడు) హన్మకొండ అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదుపై హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి బంధువులు ఇచ్చిన సమచారంతో పోలీసులు గతంలో అతనితో మనస్పర్థలు ఉన్న ములుగు వెంకటాపురం కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుల్లో ఒకడైన డేవిలీ సాయిని హన్మకొండ బస్తాండ్‌లో అదుపులో తీసుకొని విచారించారు. మిగతా నిందితులు అంతా వరంగల్ కోర్టు వెనుక భాగంలో అటోలో ఉన్నట్లు ఇచ్చిన సమాచారంతో వారిని కూడా అరెస్టు చేశారు.

నిందితుల్లో ఒకరైన మహిళ నిర్మలను హన్మకొండ బస్టాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్ శ్రీనివాస్ 2009లో హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికై పరస్పర బదిలీల్లో భాగంగా హన్మకొండ బదిలీ అయ్యాడు. కొద్దిరోజుల తర్వాత 317 జి.ఓ ప్రకారం ములుగు జిల్లాలోని వాజేడ్ వెంకటాపురం పోలీస్ స్టేషన్ బదిలీ అయ్యాడు. ఇక్కడ విధులు నిర్వహించే సమయంలో ఇదే ప్రాంతంలో నివసించే నిర్మల (నిందితుల్లో ఒకరు) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఆక్రమ సంబంధంగా మారటంతో నిందితురాలి బంధువు వరుసకు కొడుకైన మృతుడు సాయి ప్రకాశ్‌తో పాటు నిందితురాలి భర్త, ఆమె బంధువులు కానిస్టేబుల్ శ్రీనివాస్ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ అధికారులు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. కొద్దికాలం అనంతరం ప్రధాన నిందితుడు శ్రీనివాస్ గత ఏడాది డిసెంబర్‌లో మళ్లీ విధుల్లో చేరాడు. తనపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి తన సస్పెండ్‌కు కారణమైన సాయి ప్రకాశ్‌పై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ తగిన సమయం కోసం ఎదురుచూశాడు.

ఈ నెల 15వ తేదీన నిర్మల తన మామ ఆరోగ్య పరీక్షల కోసం భర్త, సాయి ప్రకాశ్‌తో కలిసి హన్మకొండకు కారులో వచ్చింది. ఈ విషయాన్ని శ్రీనివాస్‌కు ఆమె ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే శ్రీనివాస్ మిగతా నిందితులతో కలసి అదేరోజు రాత్రి సాయి ప్రకాశ్ ఒంటరిగా ప్రయాణిస్తున్న కారును ఆటోలో వెంబడించారు. రాత్రి 11.30 సమయంలో గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డులో బేబి సైనిక్ స్కూల్ వద్ద నిందితులు కారును అడ్డగించి, అందులో ఎక్కి కారును నడుపుతూ సాయి ప్రకాశ్‌ను తీవ్రంగా కొట్టుకుంటూ వెళ్లారు. హసన్‌పర్తి శివారు ప్రాంతంలో కారు ఆపి సాయి ప్రకాశ్‌ను శాలువతో గొంతుని బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు మృతుడి కారులోనే హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెడు గడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావిలో మృతదేహాన్ని పడేసి వేలేరు మీదుగా హన్మకొండ ఏషియన్ మాల్ ప్రాంతంలో కారును పార్క్ చేశారు. మరుసటిరోజు మృతుడి మృతదేహాన్ని గుర్తించి జిల్లెడు గడ్డ తండా గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులు వినియోగించిన కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఎయిర్ పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రస్తుతం ములుగు వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, డేవిలీ సాయి, ఆలోత్ అరుణ్‌కుమార్ ఆలియాస్ పండు, సబావత్ అఖిల్ నాయక్, రాజు, చింతం నిర్మల ఉన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన హన్మకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ సతీష్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. విలేఖరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డిసిపి అంకిత్ కుమార్, ఎఎస్‌పి మనన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News