ఇంటర్ విద్యార్థులను సమాయత్తం చేయండి
ఉన్నతాధికారులకు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచన
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్ ) విద్యాసంస్థలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ( బి.ఎస్), మాస్టర్ ఆఫ్ సైన్స్ ( ఎం.ఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు గొప్ప అవకాశం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం జాతీయ సైన్స్ డే సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులు, ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్ తో ఆయన మాట్లాడారు. బి.ఎస్, ఎం.ఎస్ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ విద్యార్థులకు సమాయత్తం చేయాలని సూచించారు.
’ఐసర్’ అటానమస్ విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. బెర్హంపూర్, భోపాల్, కోలకత్తా, మొహాలీ, పూణే, తిరువనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ’ఐసర్’ సంస్థలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్ ఎంపిసి, బైపిసి తరువాత ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులు మాత్రమే అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని, అయితే ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉందని వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్) స్థాయిలో ’ఐసర్’ విద్యాసంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించిందని ఆయన తెలిపారు. విదేశాల్లో చదివే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్.
తరహాలో ’ఐసర్’ ద్వారా బిఎస్, ఎంఎస్. కోర్సులు మంచి ప్రాధాన్యతతో కూడుకున్నవని ఆయన తెలిపారు. సైన్స్ రంగంలో బిఎస్, ఎంఎస్. కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. సైన్స్ కోర్సులకు ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయో టెక్నాలజీ కోర్సుల్లో విద్యార్థులకు ప్రావీణ్యతను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.