బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం వివిధ పేర్లతో సీనియర్లు, తొలినుండి పార్టీలో వ్యవహారాలు నడుపుతున్న వారిని పక్కకు పెడుతున్నారు. అకస్మాత్తుగా ‘75 సంవత్సరాల వయస్సు’ అనే ఒక అనధికార నిబంధనను తీసుకొచ్చి పార్టీలో అగ్రనేతలు అనేక మందిని ఇంటికి పరిమితం చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన ఫిరాయింపుదారులకు, ఎటువంటి రాజకీయ నేపథ్యంలేని మాజీ ప్రభుత్వ అధికారులకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. ‘యువతకు ప్రోత్సాహం’ పేరుతో ముఖ్యమంతులుగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా, ఇతర కీలక పదవులలో సామాజికంగా బలం లేని వారిని, రాజకీయంగా సామర్ధ్యం లేని వారిని, ప్రజాకర్షణ లేనివారిని ప్రోత్సహిస్తున్నారు.
నేడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి విధానాలనే అనుసరిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు ఒక కుటుంబం లేదా ఒకరిద్దరు నేతల ఆధిపత్యంలో ఉంటూ ఉండడంతో సమర్ధత కలిగిన వారిని అందలం ఎక్కిస్తే తమకే ఎసరు పెడతారనే భయంతో వ్యవహరిస్తున్నారు. బిజెపిలో సహితం రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు అదను దొరికితే ఆధిపత్యం వహించాలని ఎదురు చూస్తున్నా సొంతంగా ‘తిరుగుబాటు’ చేసే సాహసం చేసే పరిస్థితులలో లేరు. అయితే ఒక వంక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరోవంక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప మాత్రం వారికి మింగుడు పడటం లేదు. ఇద్దరు విశేషంగా ప్రజాదరణ ఉన్న నాయకులు కావడం, సొంతంగా ప్రజలను సమీకరించగల శక్తీ కలిగిన వారు కావడంతో వారిద్దరి పట్ల కొంచెం అప్రమత్తంగా వ్యవహరించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. వారిద్దరూ ధిక్కార ధోరణి ప్రదర్శించకపోయినా, వారి ఉనికే ఢిల్లీలోని పెద్దలను ఇరకాటంలో పడవేస్తున్నది.
దేశం మొత్తంలో బిజెపిలో సొంతంగా ప్రజాకర్షణ కలిగి, ఓటర్లపై ఒక విధమైన ప్రభావం చూపగల నాయకులు వీరిద్దరే కావడం గమనార్హం. 2011లో ముఖ్యమంత్రి పదవి నుండి ‘కుట్ర పూరితంగా’ యడ్యూరప్పను ఢిల్లీ పెద్దలు తొలగించిన సమయంలో, పార్టీపై తిరుగుబాటు చేసి, సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని కర్ణాటకలో 10 శాతం ఓట్లు తెచ్చుకోవడమే కాకుం డా, బిజెపిని అధికారంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. అంతటి సామర్ధ్యం గల నేతలు నేడు బిజెపిలో ఇతరులెవ్వరు లేరని చెప్పవచ్చు.
అందుకనే తనను పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఖరారు చేయగానే, నరేంద్ర మోడీ సొంతంగా చొరవ తీసుకొని, యడ్యూరప్పను తిరిగి బిజెపిలోకి వచ్చేటట్లు చేశారు. గత ఏడేళ్లుగా ఆయన ప్రధాని మోడీకి కర్ణాటక నుండి ఘనమైన మద్దతు అందిస్తూనే ఉన్నారు. అందుకనే ప్రధానికి ఆయనపట్ల ఒకరకమైన సానుభూతి ఉంది. 75 ఏళ్ళు దాటినా, 76 లో ప్రవేశించినా, రాష్ట్రంలోని ఇతర కీలక బిజెపి నేతలు అడ్డుచెబుతున్నా, ఆయనను రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా చేశారు.
ఇప్పుడు ఆయనను గద్దెదింపవలసి వచ్చినా సగౌరవంగా సాగనంపారు. బహుశా మరే నాయకుడి పట్ల గద్దె దింపే సమయంలో అంత గౌరవంగా ఏ పార్టీ కూడా వ్యవహరించి ఉండదు. తాను కోరుకున్న రోజున, తన రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత రాజీనామా చేసే సౌలభ్యం కలిగించారు. అంతేకాదు ఆయన మద్దతుదారులను కేంద్ర మంత్రువర్గంలోకి తీసుకున్నారు. ఆయన సూచించిన వ్యక్తిని ఆయన వారసుడిగా ఎన్నుకున్నారు. ఎందుకంటె దక్షిణాదిన బిజెపికి ప్రాబల్యం గల రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. అక్కడ యడ్యూరప్ప తిరగపడితే పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. అయితే 2011లో వలే కాకుండా, ఇప్పుడు వయస్సు మీద పడడంతో ఆయన కూడా సామరస్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. పార్టీ నాయకత్వం పట్ల సానుకూలంగా ఉంటూ, తన కుమారుల రాజకీయ భవిష్యత్‌కు మంచి మార్గం చూపాలనే ఆలోచనలలో ఉన్నట్లున్నారు.
గత రెండేళ్ల తన పదవీకాలం తనకు ప్రతి రోజు ఒక ‘అగ్ని పరీక్ష’ వలే సాగిన్నటు రాజీనామా సందర్భంగా చెప్పడం ద్వారా పార్టీలోని తన ప్రత్యర్థులపై తన ఆక్రోశం ఆయన వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే నెల రోజుల వరకు తనను మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసుకోనీయకుండా, వరదలు, దుర్భిక్ష పరిస్థితులలో ఒంటరిగా పోరాడవలసి వచ్చినదని గుర్తు చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా తా ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో కలసి రాజ్యసభ ఎన్నికల సమయంలో, ఇతర సందర్భాలలో పంపుతున్న జాబితాలను ఢిల్లీలో చెత్తబుట్టలో పారవేస్తూ, రాజకీయంగా ప్రాముఖ్యత లేని వారిని నామినేట్ చేస్తూ నిరంతరం తనను అవమాన పాలు చేసిన వారి పట్ల ఆయన సామరస్యంగా ఉండే ధోరణి ప్రదర్శించడంలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా తాను రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని ప్రకటించడం ద్వారా తన ప్రత్యర్థులకు ఒక విధమైన హెచ్చరిక చేశారు.
ఆంధ్రప్రదేశ్ లేదా బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలకు గవర్నర్‌గా పంపుతామని చేసిన ప్రతిపాదనలను ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనలో పోరాట స్ఫూర్తి ఇంకా తగ్గిపోలేదని స్పష్టం అవుతుంది. కేవలం ఆయన లింగాయత్ కావడంతో, 17 శాతంగా ఉన్న ఆ సామాజిక వర్గం వారితో ఆయన పెద్ద ప్రజానాయకుడిగా ఎదిగారని ఎవరైనా అంచనా వేస్తే పొరపాటు కాగలదు. దాని వెనుక 50 ఏళ్ళ ఆయన కష్టపడిన ప్రజా జీవనం ఉన్నదని గుర్తుంచుకోవాలి. మరో లింగాయత్‌ను ముఖ్యమంత్రిగా చేసి, ఆయన ప్రాధాన్యత తగ్గించాలని గతంలో జగదీశ్ షెట్టార్‌ను ముఖ్యమంత్రిగా చేశారు. అయన ప్రజలపై, ప్రభుత్వంపై ఎటువంటి ప్రాధాన్యత చూపలేకపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహితం రాజకీయ వారసత్వం, పార్టీలు మారడం ద్వారా దీర్ఘకాలంగా పదవులలో ఉంటూ వస్తున్నారు గాని యడ్యూరప్ప వలే ‘ప్రజా నాయకుడు’ కాదని గ్రహించాలి.
ఇక, యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి వేరు. 2014 లో ఆయన ఆరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయినా ప్రధాని మోడీ ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. రాజకీయంగా ప్రాధాన్యత లేని అనేక మందిని చేర్చుకున్నారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థుల విజయం కోసం సగం రాష్ట్రంలో విశేషంగా ప్రచారం చేశారు. అయినా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన కూడా పదవి కోసం ఎవ్వరి వెంట పడలేదు. రాజకీయంగా అంతగా ప్రాధాన్యతలేని నాటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హాను ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. లక్నోలో పార్టీ ఎంఎల్‌ఎలు సమావేశం అవుతున్న రోజున ఆయన అక్కడకు బయలుదేరి ముందుగా వారణాసి వెళ్లి విశ్వేశ్వరుడికి పూజలు జరిపారు. ఈలోగా యుపి ఎన్నికల ఇన్ చార్జ్ గా వ్యవహరించిన అమిత్ షా ఆ రాష్ట్రంలో పలువురు బిజెపి నేతలు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతూ ఉండడం గమనించారు.
ఆయన వెంటనే ప్రధానిని కలసి 300కు పైగా ఎంఎల్‌ఎలున్న ఆ రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత లేని వారిని ముఖ్యమంత్రిగా చేస్తే పార్టీలో తిరుగుబాటు వస్తుందని, ప్రభుత్వం పూర్తికాలం సాగదని వారించారు. దానితో గోరఖపూర్‌లో ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ను ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రప్పించి, ఆయనను ముఖ్యమంత్రిగా ఉండమని కోరారు. అపవాదులు లేని ప్రజా జీవనం, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతుదారులు ఉన్న ఆయన కేవలం తన సొంత ఇమేజ్‌తో ముఖ్యమంత్రిగా నెట్టుకు వస్తున్నారని తెలుసుకోవాలి. ఆయనకు పరిపాలనపై పట్టులేదు. సిఎం కార్యాలయంలో కీలక పదవులు అన్నింటికీ ప్రధాని కార్యాలయం నుండే ఎంపిక జరుగుతుంది. ఇక బిజెపి వ్యవహారాలు అన్ని ఉప ముఖ్యమంత్రి కేశవ్ వర్మ, ఇతర నేతలు చూస్తుంటారు. ఆయన కేవలం తన నిజాయితీ, ఆర్భాటం లేని జీవనం, ప్రజలతో గల సంబంధాలతో నెగ్గుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపట్ల ప్రజలలో కొంత మేర వ్యతిరేకత ఏర్పడుతున్నా, వ్యక్తిగతంగా ఆయన పట్ల వ్యతిరేకత లేకపోవడం గమనార్హం.
చట్టబద్ధ పాలన దీర్ఘకాలం ఎరుగని ఆ రాష్ట్రంలో నేరస్థులపట్ల కఠినంగా వ్యవహరించడం, మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున పెంపొందించడం, విశేషంగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆయన అభివృద్ధిలో యుపిని ముందుకు తీసుకువెళ్లారు. అటువంటి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగితే 2025లో ప్రధాని మోడీ ‘75 ఏళ్ళ వయస్సు’ పూర్తి చేసుకోబోతున్న దృష్ట్యా ఆ పదవికి ఎక్కడ పోటీ పడగలరో అనే భయం ఢిల్లీ పెద్దలలో నెలకొంది.
అందుకనే కరోనా రెండో వేవ్ కట్టడిలో యుపి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిన్నట్లు ఢిల్లీ నుండే కథనాలు వ్యాప్తి చెందాయి. ఆయనను సిఎంగా మార్చడమో, లేదా ఆయన అధికారాన్ని కట్టడి చేయడమో చేయాలనీ తొందరపడ్డారు. ప్రధానికి నమ్మకస్థుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎకె శర్మను ఎంఎల్‌సిగా చేసి, ఆయనను హోమ్ శాఖతో ఉపముఖ్యమంత్రిగా చేయాలనీ ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయి. అయితే ప్రజలతో సంబంధంలేని వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకొనే ప్రసక్తి లేదని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. బిజెపిలో ఢిల్లీ ఆదేశాలను ఆ విధంగా ప్రతిఘటించిన నేత మరొకరులేరు. దానితో ఒక వంక ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు, మరోవంక బిజెపి అగ్రనేతలు లక్నో ప్రయాణం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మార్పులు చేయబోతున్నట్లు సంకేతం ఇచ్చారు.
అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత యోగి లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి గల్లంతు అవుతుందని గ్రహించారు. దానితో యోగిని కట్టడి చేయడానికి వచ్చిన వారంతా ఆయన పరిపాలన అద్భుతంగా ఉన్నదంటూ ప్రకటనలు ఇచ్చి వెనుదిరిగారు. దానితో ఢిల్లీ పెద్దలకు సంధి చేసికొనక తప్పలేదు. ఇప్పుడు ప్రధాని మోడీ, యోగి తరచూ పరస్పరం ప్రశంసలతో ముంచెత్తుకోవడం చూస్తున్నాము. ఎల్ కె అద్వా నీ, మురళీమనోహర్ జోషి వంటి నేతలను రెప్పపాటుతో పక్కన పెట్టిన ఢిల్లీ పెద్దలకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్, యడ్యూరప్ప వంటి నేతలు మింగు డు పడటం లేదు. వారిద్దరితో సామరస్యంగా వ్యవహరించడం మినహా కఠినంగా వ్యవహరిస్తే పరిస్థితులు తిరగబడతాయని గ్రహించినట్లున్నారు.