Saturday, November 23, 2024

ఎస్‌ఐ నియామక స్కాంలో బిఎస్‌ఎఫ్ కమాండెంట్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు(జెకెఎస్‌ఎస్‌బి) నిర్వహించిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామక పరీక్షలో తన కుమారుడి కోసం దళారుల ద్వారా అక్రమంగా ప్రశ్నాపత్రాన్ని సంపాదించారన్న ఆరోపణలపై బిఎస్‌ఎఫ్ కమాండెంట్ (మెడికల్) కర్నేల్ సింగ్‌ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. కర్నేల్ సింగ్‌ను మంగళవారం అరెస్టు చేసిన సిబిఐ అధికారులు బుధవారం సాయంత్రం ఆయనను జమ్మూలోని ప్రత్యేక సిబిఐ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. కొందరు దళారులతో కుమ్మక్కైన కర్నేల్ సింగ్ తన కుమారుడి కోసం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయించుకున్నారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెప్పారు.

ఈ ఏడాది మార్చి 27న సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామక పరీక్ష జరుగగా అదే రోజు తెల్లవారుజామున జమ్మూలోని గంగ్యాల్‌లో ఉన్న ఒక ఇంట్లో ప్రశ్నాపత్రం ఆయన చేతికి వచ్చిందని వారు తెలిపారు. పరీక్షకు కొద్ది గంటల ముందు కర్నేల్ సింగ్ ఇంట్లోనే మరి కొందరు అభ్యర్థులకు కూడా లీకైన ప్రశ్నాపత్రం లభించినట్లు వారు చెప్పారు. ప్రశ్నాపత్రం పొందేందుకు అభ్యర్థుల నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కర్నేల్ సింగ్ తీసుకున్నట్లు కూడా దర్యాప్తులో తేలినట్లు వారు చెప్పారు. జమ్మూ కశ్మీరులోని అఖ్నూరులో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ యజమాని అవినాష్ గుప్తాతోపాటు బెంగళూరుకు చెందిన ఒక కంపెనీని కూడా నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో సిబిఐ చేర్చింది. సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో జులైలో పరీక్షను రద్దు చేసిన జమ్మూ కశ్మీరు ప్రభుత్వం దీనిపై సిబిఐ దర్యాప్తునకు సిఫార్సు చేసింది.

BSF Commandant Arrested in SI Recruitment Scam in JK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News