ఖేడ: తనమైనర్ కుమార్తెకు చెందిన అభ్యంతరకర వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ప్రశ్నించేందుకు వెళ్లిన ఒక 42 ఏళ్ల బిఎస్‌ఎఫ్ జవానును ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు హత్యచేశారు. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఆదివారం రాత్రి ఈ దారుణం జరగగా అదే రోజు రాత్రి ఆ కుటుంబానికి చెందిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
తన మైనర్ కుమార్తెకు చెందిన అభ్యంతరకర వీడియోను సోషల మీడియాలో పోస్ట్ చేసిన ఒకవ్యక్తిని ప్రశ్నించేందుకు బిఎస్‌ఎఫ్ జవాన్ మేవాజీ వాఘేలా, ఆయన భార్య, కుమారుడు కలసి నదిలాద్ తాలూకాలోని చక్లాసీ గ్రామానికి చెందిన దినేష్ జాదవ్ ఇంటికి వెళ్లగా జాదవ్, అతని కుటుంబ సభ్యులు వారితో తీవ్రంగా గొడవపడ్డారు. జాదవ్, అతని కుటుంబ సభ్యులు కర్రలు, పదునైన ఆయుధాలతో వాఘేలాపై దాడి చేశారు.
తలకు, శరీరంలోని ఇతర అవయవాలకు బలమైన గాయాలు తగలడంతో వాఘేలా అక్కడికక్కడే మరణించారు. ఆయన కుమారుడు నవదీప్‌కు కూడా తలకు బలమైన గాయాలు తగిలాయి. వాఘేలా భార్య కూడా ఈ దాడిలో గాయపడినట్లు పోలీసులు తెలిపారు. జాదవ్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసునమోదు చేసి అరెస్టు చేశారు.