ఇంఫాల్: మణిపూర్‌లోని సెరోవ్ ప్రాంతంలోమంగళవారం తెల్లవారుజామున కుకీ తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ఒక బిఎస్‌ఎఫ్ జవాను మరణించగా ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు గాయపడ్డారు. కక్చింగ్ జిల్లాలోని సుగ్నుకు చెందిన సెరోవ్ ప్రాంతంలోని ఒక స్కూలులో రెండు పక్షాల మధ్య కాల్పుల పోరుజరిగినట్లు అధికారులు తెలిపారు.
సెరోవ్ ప్రాక్టికల్ హైస్కూలులో మోహరించిన బిఎస్‌ఎఫ్ జవాన్లను లక్షంగా చేసుకుని తెల్లవారుజామున 4.15 గంటలకు కుకీ తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు బిఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. తీవ్రవాదుల కాల్పులలో రంజిత్ యాదవ్ అనే కానిస్టేబుల్ గాయపడ్డారని, వెంటనే ఆయనను కక్చింగ్‌లోని జీవన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని ఆయన తెలిపారు.
గాయపడిన అస్సాం రైఫిల్స్ జవాన్లు ఇద్దరినీ మంత్రిపుఖ్రికి హెలికాప్టర్‌లో తరలించారని, తీవ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని దిమాపూర్ నుంచి భారతీయ సైన్యం ట్వీట్ చేసింది.
====================