బిఎస్‌ఎఫ్ జవాన్లపై టిఎంసి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్‌కత: టిఎంసి సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు ఉదయన్ గుహ సరిహద్దు భద్రతా జవాన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాలలో తనిఖీల ముసుగులో బిఎస్‌ఎఫ్ జవాన్లు మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఉదయన్ గుహ ఆరోపించారు. ఈ ఆరోపణలపై బిజెపి తీవ్రంగా స్పందించింది. ఈ రకమైన వ్యాఖ్యలు భద్రతా దళాలను అవమానించడమేనంటూ బిజెపి అభ్యంతరం తెలిపింది. మంగళవారం అసెంబ్లీలో బిఎస్‌ఎఫ్ పరిధిని విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చర్చ సందర్భంగా ఉదయన్ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తునన మహిళల పట్ల బిఎస్‌ఎఫ్ జవాన్లు అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. పొలం నుంచి వచ్చిన తన తల్లిని తనిఖీల పేరుతో బిఎస్‌ఎఫ్ జవాను అనుచితంగా తాకడాన్ని చూసిన బిడ్డ ముందు భారత్ మాతా కీ జై అని ఎన్నిసార్లు నినదించినా ఆ బిడ్డ ఎన్నటికీ దేశభక్తుడు కాలేడని, ఇటువంటి సంఘటనలు సంఘ విద్రోహ శక్తుల పుట్టుకకు దారితీస్తాయని నిండుసభలో ఉదయన్ గుహ వ్యాఖ్యానించారు. కాగా.. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ బిజెపి సభ్యులు పట్టుపట్టగా సభాపతి బీమన్ బెనర్జీ నిరాకరించారు.