జమ్ము : అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జార విడువడానికి పాక్ చేసిన యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) విఫలం చేసింది. జమ్మూ లోని ఆర్నియా సెక్టార్‌లో పాక్‌కు చెందిన రెండు డ్రోన్లు ఆయుధాలను మోసుకుని భారత గగన తలం లోకి ప్రవేశించగా భద్రతా దళాలు అప్రమత్తమై వాటిని అడ్డుకున్నాయని బిఎస్‌ఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున 4.304.45 గంటల మధ్య జాబ్బోవాల్, విక్రమ్ సరిహద్దుల వద్ద రెండు డ్రోన్లు ఎగురుతూ కనిపించగా, వాటిని కూల్చి వేయడానికి భద్రతా సిబ్బంది 15 రౌండ్లు కాల్పులు జరపడంతో అవి పాక్ వైపు వెనక్కు మళ్లాయని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణకు సంబంధించి 2003 నాటి ఒప్పందాన్ని పాటించాలని ఫిబ్రవరి 2425 మధ్య రెండు దేశాల మధ్య శాంతియుత ఒప్పందం మళ్లీ కుదిరినా పాక్ డ్రోన్లతో దాడికి పాల్పడడం గమనార్హం.