Saturday, November 23, 2024

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: మాయావతి

- Advertisement -
- Advertisement -

లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం బిఎస్‌పి పూర్తి సన్నద్ధతతో, శక్తితో పోటీ చేసేందుకు ఏర్పాటు చేస్తోందని శనివారం సామాజిక ఎక్స్ వేదికగా ఆమె తెలిపారు. ఎన్నికల పొత్తులు లేదా తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి తమ పార్టీపై వస్తున్న వదంతులను అసత్యాలుగా ఆమె అభివర్ణించారు. ఇటువంటి తప్పుదారి పట్టించే వార్తలను నమ్మవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీడియా కూడా సంయమనం పాటించాలని, తప్పుడు వార్తలను ప్రాధాన్యత ఇవ్వవద్దని ఆమె కోరారు. ప్రజలు అప్పమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రత్యేకంగా ఉత్తర్ ప్రదేశ్‌లో బిఎస్‌పి బలంగా ఉన్నందున ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నట్లు కనపడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నిత్యం వదంతులను వ్యాప్తి చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఏదేమైనప్పటికీ..బ హుజనుల ప్రయోజనాల కోసం రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించామని ఆమె తెలిపారు.

బిఎస్‌పిని ఇండియా కూటమిలో చేర్చడానికి పలువురు నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో తాము కూటమిలో చేరడంపై వస్తున్న వదంతులను మాయావతి గత నెలలో కూడా కొట్టివేశారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా జరిగే ఉమ్మడి పోరాటంలో బిఎస్‌పి కూడా చేరేందుకు ఇండియా కూటమి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే గత నెలలో ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం యుపిలో కుదిరింది. కాంగ్రెస్ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలలో పోటీచేయనున్నది. ఇండియా కూటమిలోని మిగిలిన పక్షాలు 63 స్థానాలలో పోటీ చేయనున్నాయి.

కాగా..రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలో బిఆర్‌ఎస్‌తో బిఎస్‌పి గత మంగళవారం పొత్తు కుదుర్చుకుంది. ఈ విషయాన్ని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే బిఎస్‌పి అధినేత్రి మాయావతితో తాను మాట్లాడతానని కెసిఆర్ చెప్పగా తాను ఇప్పటికే పొత్తు విషయాన్ని మాయావతితో చర్చించినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News