మన తెలంగాణ/ హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ,కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశముందని కొన్ని టెలివిజన్ ఛానళ్ళలో వచ్చిన వార్తా కథనాల్లో అవాస్తవమన్నారు. బీఎస్పీ,కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన కీలక ప్రకటన చేశారు.
బీఎస్పీ అధినేత్రి బెహన్జీ కుమారి మాయావతి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మే 7న సరూర్ నగర్ స్టేడియంలో చేసిన ప్రకటనే పార్టీకి శిరోధార్యమన్నారు. తెలంగాణలో దొరల గడీల పాలనను అంతమొందించిబహుజన రాజ్య స్థాపనే పార్టీ అంతిమ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. భావసారూప్య పార్టీలేవైనా బీఎస్పీతో కలిసొస్తే ఎన్నికల పొత్తులపై పునరాలోచిస్తామన్నారు.