Monday, March 10, 2025

ఆ చరిత్ర ప్రతిఘాత విప్లవానికి ప్రతిరూపం

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో బౌద్ధం ఒక విప్లవాత్మక జీవన విధానాన్ని పాదుకొల్పింది. అప్పటి వరకు ఉన్న ఎన్నో రుగ్మతలను రూపుమాపేందుకు బౌద్ధులు కృషి చేశారు. దానితో వ్యవసాయం, వస్తూత్పత్తి, వృత్తులు, వ్యాపారం, వాణిజ్యంతో పాటు ప్రజల సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చాయి. అయితే అది కొంతకాలం కొనసాగింది. అయితే మరో రూపంలో సామాజిక అసమానతలు కేంద్ర బిందువుగా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థలను చాలా చాకచక్యంగా ముందుకు తీసుకు వచ్చారు. ఇందులో బ్రాహ్మణీయ పూజారి వ్యవస్థ తన జ్ఞాన అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ సరిగ్గా దానినే ప్రతిఘాత విప్లవం అన్నారు. అంటే బౌద్ధం ఒక విప్లవమైతే తదనంతర వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థల విజృంభణ ప్రతిఘాత విప్లవంగా ఆయన ఆధ్యయన సారంతో సాధికారికంగా ప్రకటించారు.

సరిగ్గా ఇది ఒక చారిత్రక ఉదాహరణలతో నేను తమిళనాడులోని కాంచిపురంలో చూశాను. ప్రముఖ చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ తన డైరీలో పొందుపరిచిన విషయాలను పరిశీలిస్తే, మనకు చరిత్ర గమనం అర్థం కాగలదు. క్రీ.శ 642 లో హుయాన్ త్సాంగ్ కాంచిపురం సందర్శించారు. ఆయన జ్ఞాపకార్థం కాంచిపురంలోని వైకుంఠ పెరుమాళ్ దేవాలయానికి ఆగ్నేయ దిశలో ఆయన శిల్పాన్ని చెక్కించారు. ఇప్పటికీ మనం దానిని చూడవచ్చు. ఆయన సందర్శన సమయంలో వందలాది బౌద్ధ విహారాలు, 10 వేల మంది బిక్కులు ఉన్నట్టు హుయాన్ త్సాంగ్ తన డైరీలో పేర్కొన్నారు. కాంచిపురంలో దాదాపు ఆయన కొన్ని నెలల పాటు ఉన్నట్టు ఆయన రాసుకున్నారు. ఆ సమయంలో బౌద్ధ విశ్వవిద్యాలయం ఉన్నట్టు కూడా ఆయన డైరీలో పేర్కొన్నారు. అంతేకాకుండా జైనులు, జైన మందిరాలు కూడా ఉన్నట్టు డైరీ ద్వారా తెలుస్తున్నది.

కొన్ని హిందూ దేవాలయాలు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. అదే విధంగా బౌద్ధ తాత్వికులు వసుబంధు, దిన్నాగుడు తదితరులు ఈ నగరంలో ఉండి బోధనలు చేసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అంటే 7వ శతాబ్దానికి ఈ ప్రాంతంలో బౌద్ధం, జైనం ప్రధాన మతాలుగా, సాంప్రదాయాలుగా ఉన్నాయి. అంటే కులవ్యవస్థ అంత బలంగా లేదని అర్థం చేసుకోవాలి. ఇది పల్లవుల పాలనా కాలం. పల్లవులు సంపూర్ణంగా బౌద్ధులు కాకపోయినప్పటికీ, బౌద్ధం పట్ల చాలా గౌరవంగా ఉన్నట్టు మనకు అర్థమవుతోంది.

దీనికి తోడు, చైనాలో యుద్ధ విద్యలను నేర్పించి, అందుకోసం ఒక మందిరాన్ని నిర్మించడానికి కారకుడైన బోధి ధర్మ కాంచిపురానికి చెందిన రాజకుమారుడు. పల్లవరాజు రెండవ సింహవర్మన్ మూడో కుమారుడు బోధి ధర్మ. కాంచిపురం సమీపంలోని ఒక మైదానం ఆయన యుద్ధ విద్యలకు కేంద్రం. సినీ హీరో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ చూసేంత వరకు చాలా మందికి బోధి ధర్మ తమిళనాడుకు, తెలుగు రాజులైన పల్లవుల వంశం వాడని తెలియదు. అయితే స్థానికులకు మాత్రం తరతరాలుగా తెలుసు. కాంచిపురంలో చంద్రశేఖర్ అనే యువకుడు ముప్పది అయిదేళ్ల క్రితం బోధి ధర్మ విహారాన్ని నిర్మించుకున్నాడు. సెవెంత్ సెన్స్ విడుదలైంది 2011లో మాత్రమే. అంటే ప్రజల నాలుకల మీద మౌఖికంగా స్థానిక సాహిత్యం లో బోధి ధర్మ సజీవంగా ఉన్నాడు.

ముప్పది అయిదేళ్ల క్రితం నిర్మించిన ఆ బౌద్ధ విహారాన్ని చూసినప్పుడు చరిత్ర ఎక్కడ ఉన్నా తనను తాను తవ్వుకొని బయటకు వస్తుందని అర్థమైంది. అదే విధంగా కాంచిపురం బౌద్ధం ఆనవాళ్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చంద్రశేఖర్ ఇప్పుడు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఆయన తన పదమూడవ ఏట నుంచే బౌద్ధం వైపు ఆకర్షితులయ్యారు. అనేక బౌద్ధ విగ్రహాలను ఆయన కనిపెట్టి రక్షించారు. ఆయన ఇంట్లో బుద్ధుడి విగ్రహం ఒకటి ఉంది. రెండోది ఒక పాఠశాల ఆవరణలో కనిపెట్టి, దానికి ఒక మందిరాన్ని నిర్మించారు. వాటన్నింటితోపాటు, అందరూ ఆశ్చర్యపోయే అంశం ఒకటుంది. చాలా మంది కంచి సందర్శిస్తుంటారు. కంచి కామాక్షి అమ్మన్ దేవాలయం, కంచిపట్టు చీరలు అందరిని అటు వైపు లాక్కెళ్తుంటాయి. కామాక్షి అమ్మన్ దేవాలయంలో అయిదు మందిరాలున్నాయి. నాలుగు దిక్కులు నాలుగు రకాల దేవాలయాలుంటే, మధ్యలో మరొక దేవాలయం ఉంది. ఇది చాలా విశాలమైన ఆవరణ. నేను కామాక్షి అమ్మన్ దేవాలయ సముదాయంలోని మధ్య దేవాలయం చూస్తున్నప్పుడు నన్ను ఒక దృశ్యం ఆశ్చర్యపరిచింది. ఆ దేవాలయం మంటపంలోని ఒక స్తంభానికి బుద్ధుడి ప్రతిమ చెక్కబడి ఉంది. అంటే ఆ దేవాలయం ఒకనాడు బౌద్ధ విహారమై ఉంటుందని విశ్వసించక తప్పదు. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఆ దృశ్యాన్ని చూడవచ్చు. అదే విధంగా అక్కడికి దగ్గరలో వైకుంఠ పెరుమాళ్ దేవాలయం ఉన్నది. ప్రస్తుతం పూజలు చేస్తున్న విగ్రహం విష్ణువుదే. అయితే దాని వెనుక మూసివేసిన మరొక ఆలయం ఉంది. అందులో అన్ని బౌద్ధ శిల్పాలే. ఎటు చూసినా బుద్ధుని ప్రతిమలే. అంటే చాలా చోట్ల ఇటువంటి ఆనవాళ్లు ఉన్నాయి.

అయితే ఎప్పుడైతే పల్లవుల పాలన పోయి, పాండ్య, చోళులు వచ్చారో అప్పటికే వైష్ణవం, శైవం పుంజుకుంటున్నది. దానితో బౌద్ధ, జైన దేవాలయాలన్నీ వైష్ణవ, శైవ దేవాలయాలుగా మారిపోయాయి. ఇది ఊరికే అంటున్న మాటలు కాదు. సజీవంగా ఉన్న సాక్షాలతో రాస్తున్నది. ఆ తర్వాత వచ్చిన రాజులు బౌద్ధం స్థానంలో బ్రాహ్మణీయ కుల వ్యవస్థను పటిష్టం చేసే పనిలో నిమగ్నమయ్యారు. దానికి చోళుల కాలంలో ఇది ఒక నిర్దిష్ట రూపం తీసుకున్నది. చాలా మంది చరిత్రకారులు, సామాజిక వేత్తలు చోళుల కాలాన్ని స్థానిక పాలనకు పునాదిగా చెప్పుకుంటున్నారు. దీని మీద చాలా అధ్యయనాలు వచ్చాయి. దానికి ఆధారం ఉత్తరమేరుర్ శాసనం. ఇది కూడా కాంచిపురంలోనే లభ్యమైంది. చోళుల పాలనలో సభ, నగరం, ఊరు అనే మూడు విభాగాలు చేశారు. ఇందులో సభ అనే స్థానిక పాలన గురించి ఉత్తరమేరు శాసనంలో పేర్కొన్నారు.

నిర్దిష్టమైన ప్రాంతం 33 వార్డులుగా విభజించారు. అయితే ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించేవాళ్లు. బ్యాలెట్ పేపర్‌గా తాటి ఆకులను వాడేవారు. ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వారి పేరును తాటి ఆకుమీద రాసి ఒక కుండలో వేయాలి. అదే విధంగా ఎవరైనా ప్రతినిధిగా తన పనిని సమర్థవంతంగా చేయకపోతే వెనక్కు పిలుచుకునే అవకాశం సభ్యులకు ఉంది. ఇంత వరకు చూస్తే మనకు చాలా ప్రజాస్వామికంగా అనిపిస్తుంటుంది. పదవ శతాబ్దంలో ఈ శాసనం వేశారు. దాదాపు వేయి సంవత్సరాల కిందట ఇటువంటి ప్రజాస్వామిక విధానం అమలులో ఉన్నదని మనం సంతోషిస్తున్నాం. కాని ఇది నాణేనికి ఒక వైపే. రెండో వైపు మరో కోణం ఉన్నది. ఇది కేవలం బ్రాహ్మణుల గ్రామానికి మాత్రమే. అప్పుడు రాజు అగ్రహారాలకు ఇతోదిక దానాలు ఇచ్చి ప్రోత్సహించారు.

బ్రాహ్మణులలో కూడా అందరూ అర్హులు కాదు. వారికి భూమి ఉండాలి, సొంత భూమిలో ఇల్లు ఉండాలి. బోధించే శక్తి ఉండాలి. అంతేకాకుండా పంచ మహా పాతకాలకు దూరంగా ఉండాలి. దీనికి మన విద్యావేత్తలు భారత ప్రజాస్వామ్యానికి గొప్ప ఆదర్శం అని ప్రకటించారు. మరొక వ్యవస్థ నగరం. నగరం అనే పరిపాలన విభాగం కేవలం వ్యాపారులదే. మిగతా వాళ్లకు చోటు లేదు. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటంటే క్షత్రియులైన రాజులు బ్రాహ్మణులను, వైశ్యులను తమ భాగస్వాములను చేసుకొని చాతుర్వర్ణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి వేసిన ఒక పథకం. అంతిమంగా ఇది బౌద్ధ సమత, సమానత్వ విలువలకు విరుద్ధం. ఇందులో శూద్రులు, అంటరాని కులాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. అందుకే భారత దేశ చరిత్ర కనపడుతున్నంత పారదర్శకం కాదు. సత్యం కాదు. ఇది సత్యాన్ని మసిబూసి కనపడకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కాంచిపురం చరిత్ర, సాక్షాలు ప్రతిఘాత విప్లవానికి ప్రతిరూపాలు.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News