Friday, December 27, 2024

బౌద్ధం వెల్లివిరిసిన నేల

- Advertisement -
- Advertisement -

Buddha Purnima 2020

పాశిగామలో జరిపిన త్రవ్వకాలలో ఒక స్థూప చైత్య, చైత్య గృహ ఆనవాళ్ళు బయట పడ్డాయి. ఇక్కడ లభించిన ఒక శిలాఫలకంపై ఎదురెదురుగా నిల్చొని వున్న సింహాలు, మధ్యలో తామర పూవు చెక్కి వున్నాయి. ఈ ఫలకాన్ని బౌద్ధ స్థూపంపై అమర్చినట్టుగా రుజువయింది. అంతేగాక యిక్కడ ఒక నాగ శిల్పం బుద్ధ పాదం బయట పడ్డాయి. ఇక్కడి చైత్య గృహం తూర్పు ముఖంగా గజ పుష్పాకారంలో వున్నది. ఇది ఒక బౌద్ధ స్థావరమని రుజువయింది. అంతేగాక బౌద్ధ బిక్షువులు నివసించడానికి గదులు కూడా వుండేవని తెలుస్తున్నది. చైత్యం రెండు వరుసల యిటిక రాళ్ళతో పేర్చబడి వుంది. పాశిగామకు సమిపంలోని స్థంభం పల్లిలో ఆయక స్తంభాలతో నిర్మించబడ్డ ఒక నిర్మాణం వుండేదని అందువల్లనే దానికి స్థంభంపల్లి అన్న పేరు వచ్చిందని చరిత్ర కారుల అభిప్రాయం.

 

పాశిగామగా స్థానికంగా పిలువబడే ఒక చిన్నపల్లె తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలోని ఒక మండల కేంద్రమైన వెలగటూర్‌కు 3 కి.మీ. దూరంలోనే వున్నది. అయితే ప్రభుత్వ రికార్డుల్లో యిది పాషాయిగాం గా గుర్తించబడింది. పాశిగామ గురించి ప్రస్తావించినప్పుడు ఈ రోజున ఎవరి దృష్టినీ అంతగా ఆకర్షించని యీ పల్లె ఒకనాడు బౌద్ధ బిక్షువుల పాదస్పర్శలతో పులకరించి, బుద్ధుని శాంతి సందేశాన్ని నేల నలుచెరుగులా చాటింది. అంతేకాదు జిజ్ఞానుడు నడయాడిన నేలగా సుప్రసిద్ధ చరిత్రకారుడు డా. వి.వి క్రిష్ణ శాస్త్రిచే గుర్తించబడింది. జిజ్ఞానుడు ఓ సుప్రసిద్ధ బౌద్ధ తార్కికుడు. తమిళనాడుకు చెందిన కాంచీ పుర సమీపంలోని సింహవక్త నగరానికి చెందినవాడు. ఆయన జీవిత కాలాన్ని గురించి భిన్నాభి ప్రాయాలు వున్నాయి. ఆయన కాళిదాసు కాలానికి చెందిన వాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాదు కాళిదాసుతో విభేదించేవాడని కూడా చెబుతారు. ఇక తమిళనాడులో ఆయన ప్రతిపాదించిన తర్కవాద సిద్ధాంతాలకు ఆదరణ లభించకపోవడంతో ఆ ప్రాంతాన్ని వదిలి ఇప్పటి మన తెలంగాణలోని ఒక చిన్న పల్లె పాశిగామలో స్థిరపడ్డాడని చరిత్రకారుల అభిప్రాయం.
ఆయన రచించిన గ్రంథాలు, ప్రమాణ సముచ్చయ, హేతుచక్ర, ఆలంబన పరీక్ష, అభిధర్మకోశ మర్మ ప్రదీపిక, త్రికాల పరీక్ష, న్యాయ ముఖ. ఇవన్నీ విశేష ప్రజాదరణ పొందాయి. ఇందులో ముఖ్యంగా ప్రమాణ సముచ్చయ అన్న గ్రంథం అయన తార్కిక సిద్ధాంతాన్ని విశదంగా వివరిస్తుంది. ఇక బౌద్ధ సాహిత్యంలో పేర్కొనబడి, బుద్ధునితో సంభాషించిన పాయసికి, పాశిగామతో సంబంధం వుండవచ్చని, అంతేగాక ఆయన గ్రామం పాశిగామ కావచ్చుననే అభిప్రాయాన్ని డా. మలయశ్రీ వెలిబుచ్చారు. ఇక త్రవ్వకాల విషయాలను పరిశీలి స్తే, శాతవాహన చక్రవర్తుల తొలి రాజధానిగా గుర్తించబడిన కోటిలింగాల పుణ్యక్షేత్రానికి అతి చేరువలో నున్నందు వల్ల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ వారు కోటి లింగాలతో పాటు యిక్కడ చేబట్టిన త్రవ్వకాలతో పాశిగామ చారిత్రిక విశిష్టత ప్రపంచానికి తెలియవచ్చింది.
ఈ త్రవ్వకాలు రెండు దశల్లో జరిగాయి. మొదటి దశ త్రవ్వకాలు (1979-1983) వరకు జరుగగా, రెండవ దశ త్రవ్వకాలు 2009లో జరిగాయి. ఈ త్రవ్వకాలకు ముందు ఆంధ్రుల చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమయిందని చరిత్రకారులు భావిం చేవారు. అయితే యీ త్రవ్వకాలలో వెలుగులోకి వచ్చిన ఆధారాలతో ఆంధ్రుల చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభం కాలేదని అది యెంతో ప్రాచీనమైనదని తెలియవచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే యీ త్రవ్వకాలు ఆంధ్రుల చరిత్రను ఒక మలుపు తిప్పాయి. మొదటి దశ త్రవ్వకాలకు సారథ్యం వహించిన వ్యక్తి డా. వి.వి.క్రిష్ణ శాస్త్రి, ఇక రెండవ దశ త్రవ్వకాలు ఎన్.ఎస్. రామచంద్ర మూర్తి పర్యవేక్షణలో డా. పి.వి. పరబ్రహ్మ శాస్త్రి మార్గదర్శనంలో జరిగాయి
పాశిగామలో జరిపిన త్రవ్వకాలలో ఒక స్థూప చైత్య, చైత్య గృహ ఆనవాళ్ళు బయట పడ్డాయి. ఇక్కడ లభించిన ఒక శిలాఫలకంపై ఎదురెదురుగా నిల్చొని వున్న సింహాలు, మధ్యలో తామర పూవు చెక్కి వున్నాయి. ఈ ఫలకాన్ని బౌద్ధ స్థూపంపై అమర్చినట్టుగా రుజువయింది. అంతేగాక యిక్కడ ఒక నాగ శిల్పం బుద్ధ పాదం బయట పడ్డాయి. ఇక్కడి చైత్య గృహం తూర్పు ముఖంగా గజ పుష్పాకారoలో వున్నది. ఇది ఒక బౌద్ధ స్థావరమని రుజువయింది. అంతేగాక బౌద్ధ బిక్షువులు నివసించడానికి గదులు కూడా వుండేవని తెలుస్తున్నది. చైత్యం రెండు వరుసల యిటిక రాళ్ళతో పేర్చబడి వుంది. పాశిగామకు సమిపంలోని స్థంభం పల్లిలో ఆయక స్తంభాలతో నిర్మించబడ్డ ఒక నిర్మాణం వుండేదని అందువల్లనే దానికి స్థంభంపల్లి అన్న పేరు వచ్చిందని చరిత్ర కారుల అభిప్రాయం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమంటే చరిత్రపుటల్లో అద్భుతమైన యీ మలుపు వెనకాల ఒక సామా న్యుడి కృషి దాగి వుందని చాలా మందికి తెలియదు. ఆ సామాన్యుడే ధర్మపురి పుణ్యక్షేత్రానికి చెందిన కీ.శే. సంగనభట్ల నరహరి. వాస్తవంగా ఆయన ఒక చరిత్రకారుడు కాదు,- పట్టా పొందిన పండితుడు అంతకన్నా కాదు. వృత్తి రీత్యా ఆయన ఒక సామాన్య పోస్ట్ మాస్టర్. అయితే నాణేల సేకరణ వాటిపై పరిశోధన ఆయనకు హాబీ. ఉద్యోగ రీత్యా ఆయన కొంతకాలం కోటి లింగాలకు సమీపంలోని కప్పార్రావుపేటలో వుండేవాడు. వీలు దొరికినపుడల్లా కోటి లింగాల ప్రాంతంలోని నాణేలను సేకరించేవాడు.
అయితే ఒక రోజు ఆయనకు లభించిన నాణేలను పరిశోధిస్తున్న ప్పుడు అవి చిముక చక్రవర్తికి చెందిన నాణేలుగా ఆయన గుర్తించడం జరిగింది. చరిత్రకారుల దృష్టిలో అదొక అద్భుతం. ఈ విషయం గుర్తించిన నరహరి యేమాత్రం జాగు చేయకుండా కరీంనగర్ వెళ్ళి అప్పటి పురావస్తు శాఖ అధికారులకు ఆ నాణేల ను అందచేశాడు. వాటిని పరిశీలించిన ఆ శాఖ అధికారులు వాటి విశిష్టతను గుర్తించి కోటి లింగాల, పాశిగామ ప్రాంతాలలో త్రవ్వకాలను ప్రారంభించారు. ఫలితంగా కోటి లింగాల ఘన చరిత్ర ఆవిష్కరింపబడడంతో పాటు, పాశిగామ లోని బౌద్ధ ఆనవాళ్ళు బయట పడ్డాయి. కాని దురదృష్టవశాత్తు 1998 ప్రాంతంలో కరీంనగర్ లక్షెట్టిపేట రోడ్ విస్తరణలో భాగంగా రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్య కారణంగా బౌద్ధ స్థూప, చైత్యాల ఆనవాళ్ళు నేలమట్టం అయ్యాయి. ఒకప్పుడు యిక్కడ బౌద్ధం వెల్లివిరిసిందనే దానికి రుజువులు లేకుండా కనుమరుగయ్యా యి.
అయితే ఆ తరువాత కొందరు చరిత్రకారుల, కృషి ఫలితంగా స్థూపచైత్య, చైత్యగృహ నమూనాలు రూపొందిం చబడి అవి కరీంనగర్ మహాత్మా గాంధీ మ్యూజియంలో వుంచడం జరిగింది. ఈ పరిణామ క్రమాలన్నీ పరిశీలిస్తే యిక కొన్ని దశాబ్దాల కాలంలో పాశిగామ గత వైభవం చరిత్ర పుటల్లో మరుగున పడిపోతుందనే దానికి సందేహం లేదు. ఇక్కడ ఒకప్పుడు బౌద్ధం వెల్లివిరిసిందని చెప్పినా యెవరూ నమ్మలేక పోవచ్చు.
అందువల్ల బౌద్ధానికీ, పాశిగామకూ గల అనుబంధాన్ని మన భవిష్యత్ తరాల వాళ్ళు మరువకుండా వుండేందుకు, బౌద్ధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, బౌద్ధ మతాభిమానులు, చరిత్ర కారులు చొరవ తీసుకొని ప్రభుత్వ సహకారంతో యిక్కడ త్వరలో ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని రోడ్డు అభిముఖంగా స్థాపించ గలిగితే యిక్కడి పవిత్ర నేలకు కొంత న్యాయం చేసినట్టవుతుంది. ఇక ఆ బుద్ధ విగ్రహ దర్శనంతో కలిగే పవిత్ర అనుభూతి, ఆయన శాంతి సందేశ సౌరభాన్ని నేల నాలుగు చెరుగులా వ్యాప్తి చేస్తుందనడంలో యెట్టి సందేహముండదు. ఆ మంచి రోజు త్వరలో రావాలని, వస్తుందని ఆశిద్దాం.

* బసవరాజు నరేందర్ రావు
9908516549

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News