ఎంతటి వారైనా సరే, సమకాలీనాన్ని సరిగా నడుపుకోవాలి. భవిష్యత్తుకు దారులు వేసుకోవాలి. అంతేగాని, గతాన్ని అంటే చరిత్రను మార్చడం ఎవరి వల్లా కాదు. ఎవరో కాదంటే విశాల భారత దేశాన్ని పరిపాలించిన రాజుల జాబితా లోంచి అక్బరు, షాజహాన్, ఔరంగ జేబులు మాయమైపోతారా? హిందువులతో బంధుత్వం కలుపుకొని, పరమత సహనం పాటించిన అక్బర్ ‘ద గ్రేట్’ కాకుండా పోతాడా? ఇప్పటి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మారుస్తామంటే మారుతుందా? పాఠ్య పుస్తకాలు మార్చి, కొత్త సిలబస్ పెట్టి పిల్లల మెదళ్ళలో విషం నింపొచ్చు కాని, వందల, వేల సంవత్సరాల చరిత్ర మారదు. ఒక పెద్ద ఊరేగింపు వాయిద్యాలతో వస్తుందనుకో నీకు నచ్చకపోతే ఇంటి తలుపులు బిగించుకొని కూర్చో. అంతేగాని, ఊరేగింపును ఆపే శక్తి నీకు వుండదు.
నీ చేతిలో వున్న నీ కాలాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అంతేగాని, కాల ప్రవాహాన్ని ఆపడం నీ వల్ల కాదు. ఎవరి వల్లా కాదు. చరిత్ర ప్రవాహం లాంటిది. అది అలా ప్రవహిస్తూనే వుంటుంది. చరిత్ర ఊరేగింపు లాంటిది. అది అలా సాగిపోతూనే వుంటుంది. నువ్వు అభివృద్ధికి పని చేసినా, వినాశనానికి పని చేసినా చరిత్రలో భాగమైపోతూనే వుంటావు. నువ్వు చేసే పని మీద ఆధారపడి చరిత్ర నిన్ను భావిష్యత్తు తరాలకు పరిచయం చేస్తుంది. హిట్లర్ ఎలా పతన మయ్యాడన్నది చరిత్ర నమోదు చేసింది. ఇటీవల శ్రీలంకలో మంత్రుల గుడ్డలిప్పి రోడ్డు మీద పడేసిన సంఘటనల్ని కూడా చరిత్ర నమోదు చేసింది. చరిత్రను మార్చే శక్తి ఎవరికీ లేదు. ప్రజా రంజకుడివా, ప్రజా ద్రోహివా అన్నది నీ ప్రమేయం లేకుండానే చరిత్రలో నిర్ణయమై పోతుంది. చారిత్రిక చిహ్నాలు మార్చుకుంటావా? మార్చుకో! పోయేదేమీ లేదు. అయితే చరిత్ర మారదు. గడచిపోయిన కాలం ముందుకు రాదు. ముందుకు పోయిన ప్రవాహం వెనక్కి రాదు. కాలంలో నిక్షిప్తమై వున్న డిఎన్‌ఎ చరిత్ర ! చరిత్రను విశ్లేషిస్తే గాని, కాలపు (వి) లక్షణాలు బయటపడవు.
వివాదాస్పదమై ఇప్పుడు చర్చల్లో వున్న ‘జ్ఞానవాపి’ మసీదు గూర్చి ఆలోచించే ముందు బాబ్రీ మసీదు గూర్చి కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి! పార్లమెంటులో చర్చించిన తర్వాత 1991లో ప్రార్థనా స్థలాలకు సంబంధించి ఒక చట్టం అమలులోకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత మత కేంద్రాలు యధావిధిగా కొనసాగాలని ఎలాంటి మార్పులు జరగగూడదని దాని సారాంశం. చట్టాల్ని, రాజ్యాంగాల్ని గౌరవించుకోవడం మన దేశంలో కొందరికి ఇష్టం వుండదు కదా? అందుకే ఏళ్ళకేళ్ళుగా బాబ్రీ మసీదును వివాదాస్పదం చేశారు. చివరకు కూలగొట్టారు. ఇప్పుడు అక్కడ రామాలయం కడుతున్నారు. దాని వల్ల ఏం సాధించినట్టూ? ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అక్కడ ఆసుపత్రి, విద్యా సంస్థ, గ్రంథాలయం లాంటిది ఏదైనా కట్టాలని ఇంగిత జ్ఞానం వున్నవారు ఎంతో మంది ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.
ప్రభుత్వ మేధావులకు అవి చెవి కెక్కలేదు. దాని వల్ల ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు పెరిగేవి. కాని, ఏలిన వారు అలా చేయలేదు. ఒక కల్పిత పాత్రకు భారీ ఎత్తున ఆలయ నిర్మాణానికి పూనుకొన్నారు. మనువాదాన్ని నిలబెడుతూ దేశాన్ని వేల ఏళ్ళు వెనక్కి నడిపించాలని నిర్ణయించారు. బాబ్రీ మసీదు కూలగొట్టిన విషయంలో సుప్రీంకోర్టు కొన్ని విషయాలు స్పష్టం చేసింది. 1. రామ్‌లల్లా విగ్రహాలు తెచ్చి కావాలని మసీదులో పెట్టడం అపరాధం. 2. అక్కడ గతంలో రామాలయం వుందని అనడానికి ఏ ఆధారమూ లేదు. 3. రాముడి జన్మస్థం అదే అని నిర్ధారించడానికి ఆధారాలే లేవు. 4. ధర్మం పేరుతో రాజకీయాలు చేయడం మానెయ్యాలి వంటి విషయాలు నాటి సుప్రీంకోర్టు తీర్పులో వున్నాయి. బాబ్రీ మసీదు కూలగొట్టిన తర్వాత, అడుగున నేల పొరల్లో దొరికిన వన్నీ బౌద్దారామాల చిహ్నాలు మాత్రమే! హిందువుల ఆలయ నిర్మాణాలు ఏవీ బయటపడలేదు.
కాశీ విశ్వనాధుని ఆలయం కూలగొట్టి, మొగల్ చక్రవర్తి ఔరంగజేబు జ్ఞానవాపి మసీదు కట్టించాడని అంటున్నారు. అవును! అది ఔరంగజేబు కూలగొట్టాడన్నది నిజమే ఈ విషయాన్ని చరిత్రకారులు, రచయితలు వారి రచనల్లో నమోదు చేశారు. ఇంతకూ ఔరంగజేబు ఎందుకు కూలగొట్టాడూ? అంటే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు కుట్ర చేస్తున్నారని, వారు కాశీ ఆలయంలో సమావేశమవుతున్నారని తెలుసుకొని ఆయన దాన్ని 1669లో కూలగొట్టించాడు. అది విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందన్న సమాచారంతో అలా చేశాడు. అది హిందూ దేవాలయం కాబట్టి, అక్కడికి ముస్లిం చక్రవర్తి గూఢచారులు, అనుచరులు రారని ఆ కుట్రదారులు బహుశా ఆ స్థలాన్ని ఎంపిక చేసుకొని వుంటారు. అయినా, కుట్రలు బయటపడకుండా వుంటాయా? ఇవి నేను కల్పించి చెపుతున్న విషయాలు కావు. కె.యన్. ఫణిక్కర్ తన గ్రంథంలో పొందుపరిచిన విషయాలు.
పుస్తకాలు చదివి సరైన దృక్కోణంలో అర్థం చేసుకొనే వారు ఇలా వివాదాలు సృష్టించరు. ఇదే అంశం మీద స్వాతంత్య్ర సమర యోధుడు పట్టాభి సీతారామయ్య కూడా విపులంగా రాశారు. ఆయన రచించిన ‘ఫెదర్స్ అండ్ స్టోన్స్’ పుస్తకం చారిత్రక పరిశోధన గ్రంథం కాదు కానీ, అందులో రచయిత ఆ నోటా ఆ నోటా విన్నకథలు ఏరి ఒక చోట కూర్చాడు. అందులో జ్ఞానవాపి మసీదు గురించిన ప్రసక్తి కూడా వుంది దర్శనానికి వచ్చిన ఒక రాణిని ఆలయ పూజారులు, సిబ్బంది అల్లరి చేశారని, దోచుకున్నారని ఔరంగజేబుకు తెలిసి, కోప్రోదిక్తుడై ఆలయం కూలగొట్టించాడని రాశాడు. అయితే ఇదే సంఘటనను ఒక లక్నో యూనివర్శిటీ ప్రొఫెసర్ రవికాంత్ చందన్ ఒక టాక్ షోలో చెపితే, కొందరు ఎబివిపి సభ్యులు ఆయన మీద దాడి చేశారు. పైగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. ఇదంతా ఎందుకూ? అంటే ఆ ప్రొఫసర్ దళితుడు. అలాగే ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రతన్ లాల్, శివ లింగం మీద తన ఆలోచనలు ప్రకటించాడని అరెస్టు చేయించారు. భావవ్యక్తీకరణకు ఇంతగా విఘాతం కలగడం ఈ దేశంలో ఇంతకు ముందెప్పుడూ జరగలేదు.
దొరికిన ఆధారాలను బట్టి ఔరంగజేబు కాశీ ఆలయాన్ని కూల్చాడు. అయితే అక్కడ మతం/ ధర్మం కారణాలు కావు. రాజకీయ, సామాజిక కారణాలేవో వుండి వుంటాయన్నది మనం అర్థం చేసుకోవాలి. అది పక్కన పెట్టి ప్రజా భావనల్ని గౌరవిస్తూ ఆయన ఎన్నో హిందూ దేవాలయాలకు భూరి విరాళాలిచ్చాడు. జాగీర్లు ఇచ్చాడు. మరి వాటి గూర్చి ఎందుకు మాట్లాడరూ? ఉదాహరణకు ఉజ్జయినీ మహంకాళీ ఆలయం, అసోంలో కామాఖ్యాదేవి ఆలయం, బృందావన్‌లో శ్రీకృష్ణ మందిరం వంటి వన్నీ ఆ చక్రవర్తి ఇచ్చిన విరాళాలతోనే నిలబడ్డాయి కదా? విశ్వంబర్ నాథ్ పాండే రచన ‘ఫర్మాన్స్ ఆఫ్ కింగ్ ఔరంగజేబ్’ తిరగేయండి. వివరాలన్నీ అందులో వున్నా యి. ఇక్కడ మరొక విషయం తప్పక చెప్పుకోవాలి. ఆలయాలనే కాదు, ఔరంగజేబు ఒక మసీదును కూడా కూలగొట్టించాడు. ఎందుకూ అంటే? గోలకొండ రాజు తానీషా, చక్రవర్తికి కట్టాల్సిన కప్పం మూడేళ్ళు కట్టలేదు. ధనం చాలా మొత్తంలో ఆగిపోయింది. ఔరంగజేబు చూస్తూ ఊరుకోడు కదా? గోలకొండ మసీదు నేల మాళిగలో ధనరాసులు నిలువ వున్నాయని తెలుసుకొన్నాడు.సైన్యాన్ని పంపి, మసీదు కూలగొట్టించి, ధనం తెప్పించుకున్నాడు.
ఇప్పటి ఈ అతి మేధావుల వితండవాదలు పక్కన పెట్టి ఆనాటి స్థితిగతుల గూర్చి ఒకసారి సంయమనంతో, సమ దృష్టితో ఆలోచించగలగాలి. జరిగిన చిన్న పొరపాట్లు భూతద్దంలో చూపడం, పెద్ద ఎత్తున చేసిన మంచిని అసలే గుర్తించకపోవడం కుసంస్కారులకే సాధ్యం! రిచర్డ్ ఈటెన్ అనే ఆర్కియాలజిస్ట్, చరిత్రకారుడు గుళ్ళను ఎవరెవరు ఎందుకు కూలగొట్టారన్నది వివరంగా రాశాడు. సారాంశం ఏమిటంటే వాటిలో బంగారం, వెండి, ధనం వుండేవనీ, వాటిని దోచుకోవడానికే విధ్వంసాలు జరిగాయి తప్పిస్తే అక్కడ మతం కారణం అయ్యేది కాదు. హిందూ రాజులే హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఉదంతాలు అనేకం వున్నాయి. తమ ఆధిపత్యం, పైచేయి నిలుపుకోవడానికి అలా చేసేవారు.
అంతేకాని గుళ్ళ ధ్వంసం వెనుక మతం లేదు. వక్రీకరించేవారు వక్రీకరిస్తారు. అది వేరే విషయం! అభిరుచి ఉన్నవారు 1995 డిసెంబర్ 1996 జనవరి ఫ్రంట్ లైన్ ఇంగ్లీషు పత్రిక సంచికలు తిరగేయొచ్చు. రిచర్డ్ ఈటెన్ ఈ విషయాలు చాలా విపులంగా రాశారు. ‘వైర్’ పత్రిక కూడా ఆయన వ్యాసాలు ప్రచురించింది. హర్షదేవుని కాలంలో ‘దేవోత్పతన్ నాయక్’ అనే అధికారిని నియమించే వారు. దేవోత్పతన్ అంటే దేవీ దేవతల విగ్రహాలు విరగ్గొట్టి రావడమే అతని విధిగా వుండేది. ఈ విషయం కవి కల్హణ రచన రాగ తరంగిణిలో వున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మరోవైపు శ్రీరంగ పట్నంలో టిప్పుసుల్తాన్ దేవాలయాలు పునరుద్ధరించిన విష యం అతి మేధావులు మరిచారు.
ఇటీవల జరిగిన ఒక దుర్మార్గం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టూరిస్టు స్థలాల, జాబితాలోంచి తాజ్‌మహల్‌ను తొలగించింది. అది అట్లా వుంచితే, మసీదుకు ‘జ్ఞానవాపి’ అనే పేరు వుందేమని చాలా మందికి అనుమానం వస్తుంది. కాని ఆ రోజుల్లో అక్కడ ‘జ్ఞానవాపి’ పేరుతో ఒక బావి వుండేది. దాన్ని ఆనుకొని వున్న మసీదు కాబట్టి దాన్ని జ్ఞానవాపి మసీదు అని అన్నారు. అంతే!! ఇక్కడ భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ నెహ్రూ మాట గుర్తు పెట్టుకవాలి! భాక్రానంగల్ ప్రాజెక్టు ప్రారంభిస్తూ ఆయన ఆధునిక దేవాలయాలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులే నవీన భారత దేశానికి సరికొత్త ‘దేవాలయాల’ని ఆయన అన్నారు.
ఆధునిక సమాజాన్ని పురోగమనం వైపు తీసుకుపోవాలంటే వీటి అవసరమే వుందనీ మతపరమైన ప్రార్థనా స్థలాల అవసరం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ స్థాయిని అందుకోలేని చదువురాని సన్యాసులు లింగాల వెంట పడుతున్నారు. దర్గాల కింద, మసీదుల కింద తమ జీవితాలు నలిగిపోతున్నట్టుగా గగ్గోలు పెడుతున్నారు. ఈ దేశం ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు. ఒక మతం, ఒక ధర్మం పాటించే వారిది కాదు. ఒక భాష మాట్లాడే వారికి కూడా కాదు. పాలు, నీళ్ళు, చక్కెర, టీ పొడి అన్నీ కలుపుకున్న మిశ్రమ పానీయం సోషలిస్టు చాయ్ ఈ దేశ సంస్కృతి! చాయ్ అమ్మానని చెప్పుకు తిరిగే వాడికి కనీసం ఆ కన్సెప్ట్ తెలియకపోతే ఎలా? కాశీ విశ్వనాథుని ఆలయం మెట్ల మీద కూర్చుని హిందూ దేవతలకు మేలు కొల్పుగా ప్రఖ్యాత సంగీతకారుడు బిస్మిల్లా వేకువ జామున షహనాయి వాయిస్తుండే వాడు. అది కదా ఈ దేశ సంస్కృతీ? భారతీయత అన్నదానికి ఇంకా ఏ వ్యాఖ్యానమూ అఖ్ఖర లేదు. మేరా భారత్ మహాన్!
డా. దేవరాజు మహారాజు