Tuesday, January 21, 2025

ఎన్నికల బడ్జెట్!

- Advertisement -
- Advertisement -

అసత్యాల, అర్ధసత్యాల గత గొప్పలు చెప్పుకోడమే గాని భావిభారతాన్ని జనహితదారుల్లో పరుగెత్తించే దిశగా ఒక్కటైనా గట్టి సంకల్పాన్ని ప్రకటించే అలవాటు లేని భారతీయ జనతా పార్టీ పాలకుల నుంచి తాత్కాలిక బడ్జెట్‌లో ఆశించగలిగేది శూన్యమే. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు ప్రతిపాదించిన మధ్యంతర బడ్జెట్‌కు స్పష్టమైన దిశ అంటూ లేకపోడం విచిత్రం ఎంతమాత్రం కాదు. మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు చేసుకోడానికి అలవాటుపడిన పార్టీ నుంచి ప్రజలకు వాస్తవ మేలు కలిగించే నిర్ణయాలను ఆశించలేము. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు కోటలు దాటిపోయాయి. 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆమె చెప్పుకొన్నారు. అందుకోసం సామాజిక న్యాయ నినాదాన్ని ఆశ్రయించారు. నిరంతరం కార్పొరేట్ల కొమ్ముకాసే ప్రభుత్వానికి సామాజిక న్యాయాన్ని ఆవిష్కరించడం ఎలా సాధ్యమో అర్ధం కాని విషయం.

వ్యవస్థాగతమైన అసమానతలను సవరించడంపై దృష్టి పెట్టామని చెప్పుకొన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులను నాలుగు కులాలుగా తాము పరిగణిస్తున్నామని ఆమె ప్రకటించడంలోని ఉద్దేశాన్ని పట్టుకోడం కష్టతరమైనదేమీ కాదు. ప్రతిపక్ష కూటమి దేశ జనాభాలోని అధిక సంఖ్యాక అణగారిన కులాల జనగణనను చేపట్టడం ద్వారా పేదరికం అసలు మూలాలను నిర్మూలించే వ్యూహాన్ని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ముందుంచి వారి మద్దతును అర్థించదలచిన సంగతి తెలిసిందే. అందుకు విరుగుడుగా ఈ కొత్త కులాలను నిర్మలా సీతారామన్ ముందుకు తీసుకు వచ్చారు. పోనీ ఆ విధంగానైనా పేదరికాన్ని తరిమి కొట్టడానికి ఈ బడ్జెట్‌లో ఆమె ప్రవేశపెట్టిన పథకాలు ఏమీ లేవు. ప్రభుత్వ పెట్టుబడి వ్యయాన్ని స్థూల దేశీయోత్పత్తిలో 3.4 శాతానికి (11. 11లక్షల కోట్లు) పెంచినట్టు చెప్పారు. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వారి స్థితిగతుల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నామని చెప్పుకొన్నారు.తొమ్మిది కోట్ల మంది సభ్యులు గల 83 లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా వారికి సాధికారతను, స్వావలంబనను కలిగిస్తున్నామని దీనితో గ్రామీణ ప్రాంతాల స్వరూపమే మారిపోతుందన్నారు.

ఈ సంఘాల విజయం వల్ల దాదాపు కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారని ప్రకటించారు. దేశమంతటా గ్రామాలు అందులోని అధిక సంఖ్యాకులైన ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు, వారి మహిళలు ఎంత అధ్వాన స్థితిలో వున్నారో వివరించనక్కర లేదు. ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కింది కులాలవారు ఎటువంటి సాంఘిక, ఆర్ధిక అణచివేతకు గురి అవుతున్నారో తెలిసిందే. ఈ దుస్థితితో పోలిస్తే నిర్మలా సీతారామన్ గారు చెప్పిన స్వయం సహాయక సంఘాల ఉద్యమం సాధించింది సముద్రంలో నీటి బిందువంత. ఆమె చెప్పిన సామాజిక న్యాయసాధన ఇదే అయితే అది ప్రజల చెవిలో కమలాలను దూర్చడమే అవుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పనను అందరు ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపచేయాలని తీసుకొన్న నిర్ణయం హర్షించదగిందే. అయితే అది కూడా పేదరికం అంచులను మాత్రమే తాకుతుంది గాని దాని అంతు చూసే శక్తి సామర్ధ్యాలున్నది కాదు. అద్దె ఇళ్లలో, మురికివాడల్లో, అనుమతులు లేని కాలనీల్లో నివసిస్తున్న అర్హులైన మధ్యతరగతి వారు సొంత ఇల్లు కొనుక్కోడానికో, కట్టుకోడానికో తోడ్పడే పథకాన్ని ప్రకటించారు. వివరాలు లేవు.

ఇది కూడా గురికి ఆమడ దూరంలో పడి లక్ష్యాన్ని ఛేదించబోదు. కొత్త చైతన్యంతో, కొత్త తీర్మానాలతో జాతి అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, చెప్పనలవి నూతన సుసాధ్యాలు, అవకాశాలు తెరుచుకోబోతాయని ప్రధాని నరేంద్ర మోడీ రిపబ్లిక్ డే 75వ ఉత్సవాల సందర్భంగా ప్రకటించారని, అటు వైపుగా అడుగులు పడనున్న కర్తవ్య కాలంలో అడుగు పెట్టామని నిర్మలా సీతారామన్ ప్రకటించడం బాగానే ఉంది గాని అందుకు తగిన వ్యూహ రచన కనిపించడం లేదు. రైతుల ఆదాయం రెట్టింపు వాగ్దానం ఏమైందో తెలీదు. వారి చారిత్రాత్మక ఉద్యమం వల్ల రద్దయిన మూడు ముష్కర చట్టాల్లోని ఒక పార్శ్వాన్ని అమల్లోకి తెచ్చే ఉద్దేశం పంట కోతల అనంతర వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడి ప్రవేశానికి అనుమతించదలచిన ప్రతిపాదనలో కనిపిస్తున్నది. దేశ యువతను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టివేసిన నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ప్రధాని మోడీ పదేళ్ల పాలన ఘోరంగా విఫలమైంది.

మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు చతికిలబడ్డాయి. కొత్తగా ఈ తాత్కాలిక బడ్జెట్ దేశ ప్రజల్లో కల్పిస్తున్న ఆశలేమీలేవు. యథావిధిగా సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ఆదాయపు పన్ను శ్లాబులను మార్పులేకుండా కొనసాగించదలచింది. ఇది మధ్యతరగతి ఆశలపై నీళ్లు చల్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News