Wednesday, January 22, 2025

గూడ్సు రైళ్ల కోసం 3 ప్రత్యేక కారిడార్లు

- Advertisement -
- Advertisement -

వందే భారత్ స్థాయికి 40,000 సాధారణ బోగీలు
ఆర్థిక మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు ప్రధాన ఆర్థిక రైల్వే కారిడార్లను ఏర్పాటు చేయడంతోపాటు 40,000 సాధారణ రైల్వే బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె రైల్వేలకు సంబంధించి చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. కొత్త కారిడార్ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో రద్దీని తగ్గించడంతోపాటు ప్రయాణికులకు సంబంధించిన రైళ్ల సేవలను మరింత మెరుగుపరచవచ్చని ఆమె వివరించారు.

కొత్త ఆర్థిక కారిడార్ల వల్ల సరకు రవాణా సర్వీసుల సామర్ధం పెరగడంతోపాటు ఖర్చు తగ్గుతుందని ఆమె తెలిపారు. సాధారణ రైలు బోగీలను వందే భారత్ బోగీల స్థాయికి పెంచడం వల్ల పాసింజర్ రైలు సర్వీసుల కార్యకలాపాలు మెరుగుపడడంతోపాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని ఆమె తెలిపారు. మూడు ప్రధాన ఆర్థిక రైల్వే కారిడార్ కార్యక్రమాలను వివరిస్తూ వీటిని ఇంధన, ఖనిజ, సిమెంట్ కారిడార్లు, పోర్టు అనుసంధాన కారిడార్లు, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లుగా అమలు చేస్తామని మంతి ప్రకటించారు.

మల్టీ మోడల్ కనెక్టివిటీని అమలు చేసేందుకు వీలుగా వీటిని పిఎం గతి శక్తి కింద గుర్తించినట్లు ఆమె వెల్లడించారు. ఈ కారిడార్లు సరకు రవాణా సర్వీసుల సామర్ధాన్ని పెంపొందించడంతోపాటు రవాణా ఖర్చును తగ్గించగలవని ఆమె తెలిపారు. కొత్తగా అమలు చేయనున్న మూడు ఆర్థిక కారిడార్ కార్యక్రమాల ద్వారా జిడిపి పెరుగుదలతోపాటు రవాణా వ్యయాన్ని తగ్గించవచ్చని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News