Wednesday, January 22, 2025

దమ రైల్వేకు రూ.14,232.84 కోట్ల బడ్జెట్ కేటాయింపు

- Advertisement -
- Advertisement -

దమ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముందుకు
2024 – -25లో ద.మ. రైల్వేకు గరిష్ట స్థాయిలో కేటాయింపులు
గత ఏడాది బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈ సారి అత్యధిక బడ్జెట్ కేటాయింపు
రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలపై జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 14,232.84 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. గత ఏడాది బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈ సారి అత్యధిక బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర కేటాయింపులపై శుక్రవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేకి 2024 – 2025 సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన ముఖ్యాంశాలను తెలియజేశారు. రైల్వేతో కూడిన 2024 – 2025 సంయుక్త కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో సమర్పించారన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయన్నారు.

దక్షిణ మధ్య రైల్వే 2024 -25 సంవత్సరానికి గణనీయమైన బడ్జెట్ కేటాయింపులు పొందిందని, దక్షిణ మధ్య రైల్వేకు 2024- 25 సంవత్సరానికి గాను మునుపెన్నడూలేని విధంగా బడ్జెట్ మొత్తం రూ. 14,232.84 కోట్లు కేటాయించారన్నారు. ఇది 2023 – 24 సంవత్సరంలో కేటాయించిన రూ 13,786.19 కోట్లతో పోలిస్తే ఇది అధికం అన్నారు. గత సంవత్సరం పింక్ బుక్‌తో పోలిస్తే, రెండు నూతన డబ్లింగ్ ప్రాజెక్టులు, వివిధ స్టేషన్లకు బైపాస్ లైన్లు మంజూరు చేశారన్నారు. వాటి వివరాలు క్రింది విధముగా ఉన్నాయన్నారు. రూ. 770.12 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం రోడ్డు – డోర్నకల్ మధ్య 54.65 కిలోమీటర్ల మేర డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు అయిందన్నారు. ఔరంగాబాద్ – అంకై మధ్య రూ.960.64 కోట్ల అంచనా వ్యయంతో 98.25 కిలోమీటర్ల మేర డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు చేసిందన్నారు. రూ.46.95 కోట్ల అంచనా వ్యయంతో లాతూర్ రోడ్ వద్ద బైపాస్ లైన్ మంజూరు చేసిందన్నారు. నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుల కోసం రూ. 1,184.14 కోట్ల కేటాయింపు జరిగిందన్నారు. ఈ కేటాయింపు గత ఏడాది కేటాయింపు రూ. 819.5 కోట్ల కంటే 44 శాతం ఎక్కువ అన్నారు. డబ్లింగ్, మూడవ రైల్వే లైన్లు బైపాస్ లైన్ పనుల కోసం క్యాపిటల్ అవుట్లే మొత్తం కేటాయింపు రూ.2,905.91 కోట్లు చేశారన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో మిగిలిన విద్యుదీకరించని విభాగాలను పూర్తి చేయడానికి, బడ్జెట్ గ్రాంట్ రూ. 224.59 కోట్లు కేటాయించారన్నారు. ఇవి కాకుండా వినియోగదార్ల సౌకర్యాల కోసం బడ్జెట్ గ్రాంట్ రూ. 790 కోట్లు కేటాయించినట్లు అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. సిగ్నల్ టెలికమ్యూనికేషన్ పనుల కోసం, రూ. 302.68 కోట్ల బడ్జెట్ గ్రాంట్ కేటాయించారని, ఇది గత ఏడాది రూ. 174.02 కోట్లతో పోలిస్తే 74 శాతం అధికం అని వెల్లడించారు. భద్రతకు సంబంధించిన కొన్ని కీలకమైన పనులకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్నారు. రోడ్డు భద్రత పనుల కోసం రూ. 891.4 కోట్లు (లెవల్ క్రాసింగ్లు, వంతెనలు ఆర్ ఓ బి /ఆర్‌యూబీ కేటాయింపులు కలుపుకుని ) కేటాయించారన్నారు. ఇక కవచ్ వ్యవస్థ అమలు కోసం రూ.41.94 కోట్లు కేటాయించారన్నారు.
పురోగతిలో ఉన్న ముఖ్యమైన నూతన ప్రాజెక్టులకు కేటాయింపులు :
మనోహరాబాద్-  కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టు కోసం రూ. 350 కోట్ల కేటాయింపులు జరిగాయి. 151 కి.మీ.ల మేర ఈ ప్రాజెక్టు 2006 – 07 సంవత్సరంలో రూ. 1,160 కోట్లతో మంజూరు చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు అని వెల్లడించారు. ఇందుకుగాను 1/3వ వంతు నిధులు , అవసరమగు భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo ఉచితంగా ఇస్తుందన్నారు. మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య 76 కిలోమీటర్ల మేర సెక్షన్‌ను పూర్తి చేసి ప్రారంభించగా మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

కాజీపేట -విజయవాడ 3వ లైన్ ప్రాజెక్ట్ కోసం రూ. 310 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. 220 కి.మీల పొడవుగల మూడవ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు 2012 – 13 సంవత్సరంలో రూ 1953 కోట్ల వ్యయంతో మంజూరు అయ్యిందన్నారు. వరంగల్ – నెక్కొండ సెక్షన్ల మధ్య 32 కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయినాయన్నారు. కాజీపేట – బల్హర్షా మూడవ రైల్వే లైన్ ( రాఘవాపురం – మందమర్రి మినహా) ప్రాజెక్ట్ కోసం కోసం రూ. 300 కోట్లు కేటాయింపు జరిగినట్లు తెలిపారు. భద్రాచలం రోడ్డు – డోర్నకల్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు. 2023 – 24 సంవత్సరంలో రూ.770.12 కోట్ల వ్యయంతో 54.65 కి.మీ.ల డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు చేశారన్నారు.
యాదాద్రి వరకు విస్తరణ ఎమ్.ఎమ్.టి.ఎస్
కాగా ఎమ్.ఎమ్.టి.ఎస్ రెండవ దశ ప్రాజెక్ట్ కోసం రూ.50 కోట్లు కేటాయింపులు జరిగాయని, ఈ ప్రాజెక్ట్ 2012 – 13 సంవత్సరంలో రూ. 817 కోట్ల వ్యయంతో మంజూరు చేశారన్నారు. ఇప్పటి వరకు మల్కాజిగిరి – బోల్లారం మధ్య 14 కిలోమీటర్లు మేర డబుల్ లైన్ విద్యుదీకరణ, తేలాపూర్ – రామచంద్రపురం మధ్య 6 కిలోమీటర్లు , మేడ్చల్ – బోలారం మధ్య డబ్లింగ్ 14 కిలోమీటర్లు , మౌలా అలీ – ఘట్కేసర్ మధ్య 12.2 కిలోమీటర్లు నాలుగు లైన్ లు, మరియు ఫలక్‌నుమా -ఉందాద్ నగర్ మధ్య 13.5 కి.మీ మేర డబ్లింగ్ పనులు పూర్తిఅయినాయి . ప్రస్తుతం, మిగిలిన సెక్షన్లో అంటే సనత్ నగర్ నుండి మౌలాలీ వరకు విద్యుదీకరణతో డబ్లింగ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఎమ్.ఎమ్.టి.ఎస్ రెండవ దశ యాదాద్రి వరకు విస్తరణ ప్రాజెక్ట్ కోసం రూ. 10 కోట్లు కేటాయింపు జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ 33 కిలోమీటర్ల మేర దూరానికి 2016- – 17 సంవత్సరంలో రూ.330 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయబడిందన్నారు. తరువాత ఈ వ్యయం రూ. 430 కోట్లకు సవరించినట్లు జిఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.
జోన్ వ్యాప్తంగా ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులకు …
స్టేషన్ల ప్రధాన పునరాభివృద్ధి సాఫ్ట్ అప్‌గ్రేడియేషన్ కోసం రూ.425 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. స్వర్ణ చతుర్భుజి మార్గాలలో ఆర్‌ఓబి/ఆర్యూబీల నిర్మాణానికి రూ.407 కోట్లు , స్టేషన్లలో పాదచారుల వంతెనలు ఎత్తైన ప్లాట్ పాంల ఏర్పాటు కోసం రూ. 197 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఇవి కాకుండా ట్రాఫిక్ సౌకర్యం పనులకు రూ. 172 కోట్లు , కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం రూ 150 కోట్లు, చర్లపల్లి స్టేషన్‌లోని శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి కోసం రూ.46 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు.

SCR 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News