Monday, November 18, 2024

ఆర్థికశాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు

- Advertisement -
- Advertisement -

Budget proposals to the Ministry of Finance

త్వరలో శాఖలవారీగా మంత్రి హరీశ్ సమీక్ష
కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్ర బడ్జెట్‌పై స్పష్టత

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని 210 శాఖాధిపతుల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్ధికశాఖకు చేరాయి. 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తయారు చేసేందుకు ఆర్ధికశాఖ జారీ చేసిన షెడ్యూలు ప్రకారం దాదాపు అన్ని విభాగాల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్ధికశాఖకు చేరాయి. దీంతో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు బడ్జెట్ కసరత్తులు మొదలుపెట్టారు. శాఖల వారీగా నిధుల అవసరాలు, రానున్న ఆర్ధిక సంవత్సరంలో పెరగనున్న ఖర్చులు, ఆ ఖర్చుల మేరకు నిధులను కేటాయించే ప్రక్రియపై ముందుగా ఆర్ధికశాఖా మంత్రి టి.హరీష్‌రావు శాఖల వారీగా విడివిడిగా సమీక్షలు జరుపుతారని, అలా అన్ని శాఖలతో సమీక్షలు పూర్తయిన తర్వాత మంత్రిత్వశాఖల వారీగా, అభివృధ్ధి, సంక్షేమ పథకాల వారీగా నిధులను కేటాయిస్తూ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. అధ్యక్షతన జరగబోయే సమీక్షలోనే బడ్జెట్‌లో కేటాయింపుల ప్రక్రియ పూర్తవుతుందని ఆర్ధికశాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్ధికశాఖ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని, దాంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎలాంటి కేటాయింపులు ఉన్నాయో చూసుకొని ఆ తర్వాతనే తుదిదశ కేటాయింపులు జరుపుతూ బడ్జెట్‌కు తుదిరూపు ఇస్తారని వివరించారు.

కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధుల పరిమాణం ఎంత ఉందో తెలుస్తుందని, వాటిని పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను సిద్దంచేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు వివరించాయి. ఈ సమాచారం మొత్తాన్ని క్రోడీకరించుకొన్న తర్వాత మొదటగా ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు శాఖల వారీగా సమీక్షలు జరిపి వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పెరగనున్న వ్యయం, వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రాధమిక కేటాయింపులు జరుపుతారు. ఈ ప్రాధమిక కేటాయింపుల ముసాయిదా నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి తుది దశ కేటాయింపులు జరుపుతారు. ఆ తర్వాత ఈ బడ్జెట్‌ను మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టి కేబినేట్ ఆమోదం పొందిన తర్వాతనే అసెంబ్లీ, శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే రానున్న మార్చి నెలాఖరు వరకూ ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కూడా స్పష్టంగా అంచనాలు వేసుకొని వచ్చే ఏడాది బడ్జెట్‌ను రూపొందిస్తారు. ఇప్పటికే అంచనాలకు తగినట్లుగా గడచిన నవంబర్ నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 60 శాతం నిధులు ఆదాయం వచ్చిందని, మార్చి నెలాఖరు నాటికి ఆదాయంపై తమకున్న అంచనాలకు చేరుకుంటామని ఆర్ధికశాఖ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

అంతేగాక చివరి త్రైమాసికంలో పన్నుల రాబడి మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో సవరణలు, మిగిలి ఉన్న చెల్లింపులు, వాటికి అవసరమయ్యే నిధుల వివరాలతోపాటు వచ్చే ఆర్ధిక సంవత్సరం కోసం కూడా అన్ని విభాగాల నుంచి ఆర్ధికశాఖ అంచనాలను తీసుకొంది. ఈ మొత్తం ప్రక్రియను ఫిబ్రవరి మూడో వారం నాటికి పూర్తవుతుందని అధికారవర్గాలు వివరించాయి. ఇప్పటి వరకైతే అంచనాలకు తగినట్లుగానే ఖజానాకు ఆదాయం వస్తుందని, నవంబర్ నెలాఖరు నాటికి ఏకంగా 60 శాతం రెవెన్యూ రాబడులను సాధించామని, నవంబర్ నెలాఖరు నాటికి ఏకంగా 64 వేల కోట్ల రూపాయల పన్నుల ఆదాయం వచ్చిందని, ఒక్క నవంబర్ నెలలోనే ఖజానాకు 10 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆ అధికారులు వివరించారు. దీనికి తగినట్లుగానే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని మొదటి ఎనిమిది నెలల్లోనే రికార్డుస్థాయిలో ఒక లక్షా 14 వేల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆ అధికారులు తెలిపారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి 7,028 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. పన్నేతర రంగాల నుంచి 4,395 కోట్ల రూపాయలు, జీఎస్టీ రూపంలో 20వేల 859 కోట్లరూపాయలు వచ్చాయి.

ఒక్క ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్ విభాగాల నుంచే ఏకంగా 64 శాతం నిధులు ఖజానాకు వచ్చాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. పైగా వచ్చే ఆర్ధిక సంవత్సరం (2022-23)లో దళితబంధు, రైతు బంధు, భారీగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించడం వంటి అనేక అభివృధ్ధి, సంక్షేమ పథకాలకు భారీగా బడ్జెట్‌లో నిధులను కూడా కేటాయించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News