Monday, December 23, 2024

బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు మొండిచేయి

- Advertisement -
- Advertisement -

బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు
పెండింగ్ పనులు మోక్షం ఇవ్వలేదు
ఉద్యోగ సంఘాల ధ్వజం 

మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ 2024- 25 బడ్జెట్ తెలంగాణకు రూ.5 వేల పైచిలుకు కోట్లను మాత్రమే కేటాయించిందని దీంతోపాటు ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఈసారి కూడా దక్షిణమధ్య రైల్వేకు అనుకున్న విధంగా కేటాయింపులు జరగలేదని రైల్వే ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లను కేంద్రం కేటాయించగా ఎపికి రూ.9,138 కోట్లను, తెలంగాణకు రూ.5,071 కోట్ల కేటాయించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా రైల్వే శాఖ దక్షిణమధ్య రైల్వేకు మొండిచేయి చూపిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలాసార్లు దక్షిణమధ్య రైల్వేకు బడ్జెట్‌ను కేటాయించినట్టుగా కేంద్రం పేర్కొంటున్నా ఇప్పటివరకు వాటికి అరకొరగా నిధులు కేటాయించడం తప్ప పెద్దగా ప్రయోజనం లేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే గత బడ్జెట్‌లో తెలంగాణకు -రూ.4,418 కోట్లు, ఎపికి రూ.8,406 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది.
18 నెలల డిఏ ఎక్కడ?
ఉద్యోగులకు చెల్లించాల్సిన 18 నెలల డిఏ, డిఆర్‌లపై ఎలాంటి ప్రకటన చేయలేదని, కొత్త పే కమిషన్ గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదని, కొత్త లైన్‌లకు ఎలాంటి ప్రకటన చేయకపోగా కొత్త పోస్టుల గురించి కేంద్రం వెల్లడించకపోవడం దారుణమని వారు ఆరోపిస్తున్నారు. కార్మికులు, ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వీటితో పాటు కొత్త లైన్‌ల నిర్మాణంపై కూడా ప్రకటన చేయకపోవడం దారుణమని వారు తెలిపారు.
ఓల్డ్ పెన్షన్ గురించి పట్టించుకోలేదు
ఓల్డ్ పెన్షన్‌ను పునరుద్ధరించే విషయమై ఎన్నికలకు ముందు అమల్లోకి తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చినా ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి హామీని ఇవ్వకపోవడం దారుణంగా వారు అభివర్ణించారు. కోవిడ్ 19 ఉన్న సమయంలో కీలకమైన సరకు రవాణాలో రైల్వే శాఖనే ముందుకొచ్చి దేశవ్యాప్తంగా పలుచోట్లకు సరుకులను రవాణా చేసింది. సామాన్యుడి ఇబ్బందులు కలగకుండా సరుకు రవాణా చేసి అందరి మన్ననలు అందుకుంది. ఈ సమయంలో కొందరు రైల్వే ఉద్యోగులు, అధికారులు కోవిడ్ 19తో మృతిచెందారు. వారి మృతికి సంబంధించి ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోగా వారి కుటుంబాన్ని ఆదుకునే చర్యలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రకటించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వహిస్తూ మృత్యువాత పడ్డ ఉద్యోగుల కుటుంబాలకు సైతం కేంద్రం ఎలాంటి భరోసా కల్పించలేదని వారు ఆరోపించారు. మహిళా ఉద్యోగినులకు పుట్టిన పిల్లల సంరక్షణకు సంబంధించి రెండో సంవత్సరం ఇవ్వాల్సిన లీవ్‌లకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే రూపాయి లాభంతోనే ఖర్చులు, జీతాలు
రైల్వేకు వచ్చే రూపాయి లాభంతోనే రైల్వే ఉద్యోగుల జీతాలు, వారి పెన్షన్లు, మెయింటెన్స్‌లన్నీ ఇందులో నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుందని, కేంద్రం ప్రభుత్వం కొత్తగా రైల్వే శాఖకు నిధులు సపరేటుగా కేటాయించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన లాభాలతోనే ఈ బడ్జెట్ కేటాయింపులు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో అసలు రైల్వే ఉద్యోగులు ఎలాంటి సంక్షేమాలు చేపడుతున్నారో కూడా కనీసం ప్రకటించలేదని వారు ఆరోపించడం గమనార్హం. రైల్వే శాఖ అభివృద్ధి గురించి కూడా ఈ బడ్జెట్‌లో ఊసెత్తలేదని వారు వాపోయారు.
స్వల్ప బడ్జెట్ కేటాయింపులతో ప్రాజెక్టులు పెండింగ్
గత బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని చెప్పారని, కనీసం వాటి గురించి కూడా ఈ బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దారుణమని వారు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రైల్వే శాఖను నిర్వీర్యం చేయడంతో పాటు రైల్వే శాఖ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడా నికే కేంద్రం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. దక్షిణమధ్య పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులు నిధులు లేక నీరస్తిస్తున్నాయని, కొత్త మార్గాలను కేంద్రం ప్రకటించి అతి స్వల్ప మొత్తాల్లో నిధులను విడుదల చేయడంలో అనేక ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని వారు పేర్కొంటున్నారు.
ఉద్యోగుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు
(ఎం. భరణి భానుప్రసాద్, జోనల్ సెక్రటరీ, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్
జాయింట్ జనరల్ సెక్రటరీ, సౌత్‌సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్)
కేంద్రం రైల్వే ఉద్యోగుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దక్షిణమధ్య రైల్వేకు పెద్దగా ప్రయోజనం చేకూర్చేలా ఈ బడ్జెట్ లేదు. కోవిడ్ 19 తో మృతిచెందిన ఉద్యోగుల కోసం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించలేదు. వారి కుటుంబసభ్యులకు ఆదుకునే చర్యలను చేపట్టలేదు. ఇది చాలా బాధాకరం.
ఉద్యోగుల పోరాటాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు:  రైల్వే మజ్దూర్ జనరల్ సెక్రటరీ శంకర్‌ రావు
ఈ బడ్జెట్‌తో ప్రజలకు, రైల్వే ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు. భద్రాచలం నుంచి కొవ్వూరు లైన్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. స్థానిక అభ్యర్థుల ద్వారా గ్రూప్ సి గ్రేడ్ పోస్టులను భరీ చేయాలి. ట్రాక్‌మెన్‌గా పనిచేసే మహిళా ఉద్యోగుల కేటగిరిని మార్చాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయించాలి. ఇలా చాలా సమస్యలపై తాము కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News