Monday, March 10, 2025

రేపు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ పునఃప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ విరామానంతరం సోమవారం తిరిగి ప్రారంభం కానున్నది. ‘వోటర్ ఐడి కార్డు’ (ఎపిక్) వివాదంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఉభయ సభలు సోమవారం నుంచి తిరిగి సమావేశం కానున్నాయి. వోటర్ల జాబితాలో అక్రమాల ఆరోపణలు, మణిపూర్‌లో తాజాగా హింసాకాండ ప్రజ్వలన, ట్రంప్ ప్రభుత్వంతో భారత్ వ్యవహరణ తీరు వంటి సమస్యలను లేవనెత్తాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. అయితే, బడ్జెట్ పద్దులకు పార్లమెంట్ ఆమోదముద్ర పాందడం, బడ్జెట్ సంబంధిత అంశాలను పూర్తి చేయడం, మణిపూర్ బడ్జెట్‌కు, వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందడంపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించబోతున్నది.

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ ఆమోద ముద్ర కోరుతూ చట్టబద్ధమైన తీర్మానాన్ని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మణిపూర్ కోసం బడ్జెట్‌ను సోమవారం పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా తరువాత రాష్ట్రంలో ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నది. డూప్లికేట్ ఎపిక్ సంఖ్యల సమస్యపై ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టనున్నామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ముందుగా ఈ సమస్యను లేవనెత్తింది.

దీనితో దీనిని సరిదిద్దేండుకు తాము మూడు నెలల్లోగా తగు చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ (ఇసి) ప్రకటించింది. అదే సమయంలో కొందరు వోటర్ల ఎపిక్ సంఖ్యలు ‘ఒకే విధంగా ఉండవచ్చు’ కానీ, జనాభా సమాచారం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం వంటి ఇతర వివరాలు భిన్నంగా ఉంటాయని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. టిఎంసి నేతలు సోమవారం ఇసితో సమావేశం కానున్నారు. బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ సమస్యను లేవనెత్తడానికి కాంగ్రెస్, డిఎంకె, శివసేన (యుబిటి) సహా ఇతర ప్రతిపక్షాల మద్దతును వారు సంపాదించారు. అయితే,ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు సత్వర ఆమోద ముద్ర పొందేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

వక్ఫ్ సవరణ బిల్లుకు శీఘ్రంగా ఆమోద ముద్ర పొందాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, ముస్లిం సమాజానికి సంబంధించిన అనేక సమస్యలను అది పరిష్కరిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు క్రితం వారం ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’లో స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంట్ సంయుక్త కమిటీ (జెపిసి) ఆ బిల్లుపై తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. మణిపూర్‌లో తాజా హింసాకాండ, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల బెదరింపు, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ వివాదం పార్లమెంట్‌లో వాడిగా వేడిగా చర్చలకు ఆస్కారం కలిగించవచ్చు. కాగా, వక్ఫ్ బిల్లును ఉమ్మడిగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ‘విస్తృత స్థాయిలో సంప్రదింపులు’ జరపగలరని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తెలియజేశారు.

ఎన్నికల ప్రక్రియలో అక్రమాల సమస్యను కాంగ్రెస్ లేవదీస్తూనే ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఎన్నికలు ‘ఇక ఎంత మాత్రం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా’ జరగడం లేదని, ‘ఒక వ్యూహం ప్రకారం’ జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల బెదరింపుల అంశాన్ని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో కాంగ్రెస్ లేవనెత్తుతుందని ఆయన చెప్పారు. ఆ ముప్పులను ఎదుర్కొనడానికి నిష్పాక్షికంగా సమష్టి నిర్ణయం జరగాలని రమేష్ కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగింది. రెండవ భాగం సోమవారం (10) మొదలై ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News