Wednesday, January 8, 2025

నారాయణ గురు స్ఫూర్తితో సమానత్వం కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం

- Advertisement -
- Advertisement -

ప్రతి ఒక్కరూ న్యాయంగా జీవించే సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలి
తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య ఆలోచనల్లో సారూప్యత ఉంది
సమగ్ర కుటుంబ సర్వే, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి నారాయణ గురు స్ఫూర్తి
నారాయణ గురు ఓపెన్ యూనివర్సిటీ సెమినార్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : మానవజాతికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అదే మానవత్వం, సమానత్వమని సందేశం ఇచ్చి కేరళ తో పాటు యావత్ భారతదేశాన్ని ప్రభావితం చేసిన శ్రీ నారాయణ గురు స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం కేరళ రాష్ట్రం కొల్లంలోని నారాయణ గురు ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ గురు ఇంటర్నేషనల్ లిటరసీ, కల్చరల్ ఫెస్టివల్‌లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానికంగా నిర్వహించిన సెమినార్లో ముఖ్యఅతిథిగా పాల్గొని డిప్యూటీ సీఎం ప్రసంగించారు.

నారాయణ గురు జీవితాన్ని, బోధనలను స్మరించేందుకు కొల్లంకు చేరుకోవడం తనకు ఒక విలువైన అవకాశం, గొప్ప గౌరవమని డిప్యూటీ సీఎం తెలిపారు. సమానత్వంపై నారాయణ గురుకు ఉన్న ధృఢమైన అభిప్రాయం, మానవత్వం, సమానత్వం అనే సందేశాలు నేటి కాలంలో ప్రధానంగా మారాయని తెలిపారు. నారాయణ గురు ఒక ఆధ్యాత్మిక నాయకునికి మించిన వారని ఒక సంస్కరణ వాది, తత్వవేత్త, విప్లవకారుడని అభివర్ణించారు. కేరళ సమాజంలోని వివిధ కులాల్లో అన్యాయాలను నిర్మూలించడం ద్వారా ఆయన సమాజాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారని వివరించారు. అరువిప్పురం శ్రీ శివాలయం స్థాపన ఆయన చేసిన సాధారణ ఆధ్యాత్మిక చర్య కాదని, అది కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక సాహసోపేతమైన ప్రకటన అని తెలిపారు.

ఈ ప్రకటన కేవలం కేరళనే కాకుండా భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు, నారాయణ గురుల మధ్య పోలికలున్నాయన్నారు. నారాయణ గురును స్మరించుకునే సందర్భంలో మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్మరించుకోవడం సముచితమని తెలిపారు. నారాయణ గురు సమాజంలోని మార్పును స్ఫూర్తి పరచగా, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని స్థిరపరిచారని తెలిపారు. ఇద్దరి వారసత్వాలు మన దేశ చరిత్రలో న్యాయానికి, సమానత్వానికి కొండంత ఆధారంగా నిలిచాయని తెలిపారు. కేరళ రాష్ట్ర సామాజిక పురోగతికి నారాయణ గురు నేతృత్వం ప్రధాన కారణమని అభివర్ణించారు. విద్యనే విముక్తికి మార్గమని కేరళను విద్యావంతమైన, ఆరోగ్యకరమైన, లింగ సమానత్వం కలిగిన ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నారాయణ గురు పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.

తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య ఆలోచనల్లో సారూప్యత ఉందని తెలిపారు. తెలంగాణలో కొమురం భీం, చాకలి ఐలమ్మ నారాయణ గురు తరహాలోని సమానత్వం కోసం తిరుగుబాటు చేశారని వివరించారు. ఈ రెండు ప్రాంతాలు సమానత్వం, న్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. ఆధునిక భారతదేశంలో విభజనలపై నారాయణ గురు సమైక్యత సందేశం మరింత కీలకంగా మారిందన్నారు. ఆయన చూపిన మార్గంలో మనం ముందుకు సాగాలని, సామాజిక, ఆర్థిక సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

నారాయణ గురు కేవలం ఒక కల మాత్రమే కనలేదని, ఆ కలను నిజం చేసేందుకు సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు మన కర్తవ్యం ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం, విభజనలను అధిగమించి ప్రతి ఒక్కరూ న్యాయంగా గౌరవంగా జీవించే సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నారాయణ గురు జీవిత స్ఫూర్తిని మనమంతా స్వీకరించి సమానత్వం, న్యాయం, మానవత్వం కలిగిన సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు. మనం కేవలం ఆయనకు గౌరవం ఇవ్వడమే కాదని, మన భారతదేశానికి ఉన్న ప్రత్యేకతను కూడా ఉజ్వలంగా నిలిపే బాధ్యతను మనందరం నిర్వర్తించినట్లు అవుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News