వనపర్తి : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో స్త్రీ పురుషుల నిష్పత్తి సమానంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీకి జెడ్పి చైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన వాతావరణ పరిస్థితుల్లో అత్యధిక ప్రాధాన్యం ఆరోగ్యంపై ఉందని, ఎక్కడికెళ్లిన ముందుగా చర్చించుకునే అంశాలు ఆరోగ్యానికి సంబంధించినవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేసి తల్లి గర్భం దాల్చినప్పటి నుండి శిశువు పుట్టి పెద్దయ్యే వరకు ప్రభుత్వం ఆరోగ్య పరంగా తల్లి, బిడ్డలకు వైద్య సంరక్షణ కల్పిస్తుందన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా పుడుతారని, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే జనాభా నియంత్రణ ఎంతో అవసరమని తెలిపారు. జిల్లా వైద్య శాఖలో అనేక మంది వైద్యులు, ఆయుష్ డాక్టర్లు నియమించబడ్డారని జిల్లా ప్రజలు వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్, వైస్ చైర్మ ్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ రవిశంకర్, డాక్టర్లు, ఆయుష్ డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.