కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
బెంగళూరు: దేశంలోని కొన్ని ప్రాంతాలు ఎదుర్కొంటున్న నీటి కొరతను తన మంత్రిత్వశాఖ తీర్చగలదని కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం భారత్ మాలా కింద నిర్వహించిన మంథన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆజాది కా అమృత్ మహోత్సవలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రారంభించిన మిషన్ అమృత్ సరోవర్ పథకంతో నీటి ఎద్దడిని నివారించవచ్చని తెలిపారు. ఈ పధకం లక్షం దేశంలోని ప్రతి జిల్లాలో 75 నీటి కుంటల నిర్మాణం లేదా చెరవుల పునరుజ్జీవం కల్పించడమని ఆయన తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి మట్టి అవసరం ఉంటుందని, సమీప గ్రామాల నుంచి ఈ మట్టిని సేకరించడం వల్ల కొత్త నీటి కుంటలు ఏర్పడతాయని ఆయన వివరించారు.
దీని వల్ల రోడ్డు నిర్మాణ అవసరాలు తీరడమే కాక గ్రామీణ ప్రాంతాలలో కొత్త చెరువులు ఏర్పడతాయని ఆయన చెప్పారు. ఇది భూగర్భ జలాల పెంపునకు దోహదపడగలదని కూడా ఆయన పేర్కొన్నారు. అనేక ప్రాంతాలలో నీటి కొరత ఉందని, అయితే మన దేశంలో నీటి లభ్యతకు కొరతలేనప్పటికీ నిర్వహణలోనే సమస్యంతా ఉందని ఆయన చెప్పారు. కొత్త చెరువుల నిర్మాణానికి మన జాతీయ రహదారులను ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. జాతీయ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన ఒక ప్రాజెక్టు కారణంగా ఒక యూనివర్సిటీకి 36 చెరువులు లభించగా సమీప గ్రామాలకు 22 నీటి బావులు అందుబాటులోకి వచ్చాయని గడ్కరీ వివరించారు.