Saturday, January 11, 2025

నూహ్‌లో కొనసాగుతున్న కూల్చివేతలు

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: అల్లర్లతో ఇటీవల రణరంగంగా మారిన హర్యానాలోని నూహ్ జిల్లాలో మూడు రోజులుగా బుల్‌డోజర్లు నిరంతరంగా పని చేస్తున్నాయి. అక్రమ కట్టడాలను అధికారులు శరవేగంగా కూల్చివేస్తున్నారు. ఇవన్నీ కూడా అల్లర్లకు కారణమైన వారికి చెందినవేనని తెలుస్తోంది. శుక్రవారం తావ్‌డూ పట్టణంలో అక్రమంగా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250కి పైగా గుడిసెలను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం నల్హార్ ప్రాంతంలోని మెడికల్ కాలేజి వద్ద ఉన్న అక్రమ కట్టడాలపైకి బుల్‌డోజర్లను పంపించారు.

ఆస్పత్రి వద్ద ఉన్నమెడికల్ షాపులు, ఇతర దుకాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు. దీంతో పాటుగా ఇతర ప్రాంతాల్లోను అక్రమ కట్టడాలను బుల్డోజర్ల సాయంతో తొలగిస్తున్నారు. ఈ ఒక్క రోజే 50నుంచి 60 దాకా నిర్మాణాలను పడగొట్టినట్లు అధికారులు చెప్పారు. అరెస్టులకు భయపడి ఈ దుకాణదారులు పారిపోయినట్లు చెబుతున్నారు. నూహ్‌లో ఇటీవల విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ఊరేగింపును అపడానికి ప్రయత్నించడంతో ఘర్షణలు చెలరేగి తీవ్రఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా అధికారులు అక్రమ కట్టడాల తొలగింపును చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల అల్లర్లకు పాల్పడిన నిందితులను సిసి టీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారని, వారు అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లనే ఇప్పుడు నేలమట్టం చేశారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. ఇవన్నీ అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలేనని, వీటిని తొలగించాలని ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందని వారు చెప్పారు. అల్లర్లకు, ఈ కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు. అయితే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదేశాల మేరకే ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించామని, వారి అక్రమ కట్టడాలనే తొలగిస్తున్నామని అధికారులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కాగా స్థానిక ఎంఎల్‌ఎ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉప నాయకుడు అయిన అఫ్తాబ్ అహ్మద్ ఈ కూల్చివేతలను తీవ్రంగా ఖండించారు.‘ నూహ్‌లో పేదల ఇళ్లను మాత్రమేకాదు, సామాన్య ప్రజల నమ్మకాన్ని కూడా కూల్చివేస్తున్నారు. నెల రోజుల కింది పాత తేదీతో నోటీసులు ఇచ్చి, ఇళ్లు, షాపులను కూల్చివేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం తప్పుడు చర్యలు తీసుకొంటోంది. ఇది అణచివేత విధానం’ అని ఆయన అన్నారు.

ముందస్తు కుట్రే: విజ్
కాగా నూహ్ అల్లర్లు ముందస్తు కుట్రేనని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆరోపించారు.ఈ విధ్వంసంలో పాల్గొన్న దుండగులు కొండలపైనుంచి కాల్పులు జరిపినట్లు తెలిపారు. కొన్ని భవనాల టెర్రస్‌లపైన రాళ్లను గుర్తించామని చెప్పారు. ఇదంతా చూస్తే హింస ఓ భారీ ‘గేమ్‌ప్లాన్’గా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు102 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. దాదాపు 200 మందిని అరెస్టు చేశారు. మరో 80 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News