Monday, January 20, 2025

‘బుల్డోజర్ న్యాయం’.. ప్రజాస్వామ్యానికి గాయం

- Advertisement -
- Advertisement -

బుల్డోజర్ న్యాయం పేరిట కొన్ని రాష్టాలలో ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారులే జడ్జిలుగా మారి నిందితులుగా ఆరోపించబడిన లేదా ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారి స్థిరాస్తులను కూల్చివేసే పని గత కొన్ని ఏళ్లుగా మన దేశంలో విస్తృతంగా జరుగుతూ ఉంది. జమీయత్ – ఉల్మ్ ఎ- హింద్, అలాగే కొందరు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు కూడా సుప్రీం కోర్టులో ఈ బుల్డోజర్ న్యాయాన్ని ప్రశ్నిస్తూ అనేక వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఇవన్నీ కలిపి విచారిస్తూ 13 నవంబర్, 2024 నాడు జస్టిస్ బి. ఆర్. గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం ఒక తీర్పు వెలువరించింది. 95 పేజీల వారి తీర్పులో సుప్రీం కోర్టు న్యాయాధీశులు అనేక అంశాలను ప్రస్తావించారు.

అనుమతి లేని, సరైన పత్రాలు లేని అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సివిల్ కేసులు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉంటాయి. అనేక ఏళ్లపాటు ఈ సివిల్ తగాదాలు రకరకాల కోర్టుల్లో మగ్గి, చివరికి వాటిపైన తీర్పులు వెలువడిన అనంతరమే అధికారులు వాటిపై తగిన చర్యలు తీసుకోవడం చట్టబద్ధంగా ఉండేది మొన్న మొన్నటి వరకు. ఆ ఆస్తి యజమానులు కూడా వివిధ కోర్టు ద్వారా ప్రభుత్వాధికారులు వారి ఆస్తులను కూలగొట్టకుండా నియంత్రించే, యథాతథ స్థితిని కొనసాగించే ఉత్తర్వులను కూడా తెచ్చుకునేవాళ్ళు. ఇది సర్వసాధారణంగా అన్ని చోట్లా అమలవుతూ వచ్చిన, మనకందరికీ తెలిసిన చట్టపర పద్ధతి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా తమ రాజకీయ ప్రత్యర్థులను, నిందితుల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు బుల్డోజర్‌లను ఉపయోగించి, వారి ఆస్తులను విధ్వంసం చేయడం కొన్ని రాష్ట్రాలలో తరచుగా జరుగుతూ వస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 15 సంవత్సరాల అనంతరం 2017న బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ మాటని ఆయన చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. 2022లో ఆయన మరో దఫా గెలిచినప్పుడు కూడా ఈ తక్షణ బుల్డోజర్ న్యాయం అమలుపరచడం వల్లనే ఆ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తూ వుందని, శాంతిభద్రలతో వుందని ఆయన పదే పదే అన్నాడు. ఆయన అన్న మాటలో వాస్తవం ఎంత అనేది వేరే విషయం. హిందూ మతపరిరక్షణ, గో సంరక్షణ, లవ్ జిహాద్‌ని వ్యతిరేకించటం ఇట్లా అనేక అంశాలని చెబుతూ, హిందువులను, న్యాయాన్ని కాపాడటానికి, నిందితుల్ని శిక్షించడానికి కనుగొన్న ఒక మహా అస్త్రంగా బుల్డోజర్‌ను ఆయన పార్టీవారు ఎంతో ఘనంగా కీర్తించారు. అంతే కాదు అంతటా క్రమంగా బుల్డోజర్‌ను శక్తివంతమైన పాలనకు పర్యాయపదంగా ఉపయోగించటం మొదలైంది. యోగి ఆదిత్యనాథ్‌ను ఎంతో ప్రేమగా ‘బుల్డోజర్ బాబా గా’ ఆయన అనుయాయులు పిలవడం మొదలుపెట్టారు.
2022 శాసనసభ ఎన్నికల ఫలితాల సమయంలో లఖనవ్ లోని బిజెపి కార్యాలయం ముందు బుల్డోజర్ బొమ్మలు పట్టుకొని బిజెపి కార్యకర్తలు డాన్సులు కూడా చేశారు. ఈ సంస్కృతి గొప్పతనాని కీర్తిస్తూ ఉత్తరాది రాష్ట్రాల్లో పాప్ సాంగ్స్ కూడా వచ్చాయి. బుల్డోజర్ బాబా, బుల్డోజర్ మాము, బుల్డోజర్ న్యాయం వంటి మాటలను, అలాగే మాస్ మసాలా బుల్డోజర్ పాటలను సాధారణ జనంలోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. ఎన్నికల సమయంలో ఊరూరా ఈ పాటలు మారుమోగాయి. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న ఇలాంటి చర్యలు సరైనవే అన్న సంస్కృతిని సాధారణ ప్రజలలోకి ప్రవేశపెట్టాక జరిగేది ఏమిటంటే రూల్ ఆఫ్ లా మాయమై బలవంతుల బలప్రయోగాలే అసలైన న్యాయంగా చలామణి అవుతాయి. ఈ పాపులర్ కల్చర్ వంటపట్టించుకున్న జనం ఇదే నిజమైన న్యాయం ప్రత్యర్థుల్ని అణచివేసేందుకు అని నమ్ముతూ ఈ చర్యలకు, మాటలకు సాధికారతను ఇవ్వడం మొదలు పెట్టారు.

బుల్డోజర్ న్యాయాన్ని తీసుకురావడం అంటే సమాజంలో నియంతృత్వ పాలనని ప్రవేశపెట్టడమే అని ప్రజాస్వామిక వాదులు, మేధావులు హితవు చెప్పారు. ఇలాంటి న్యాయం సమాజంలో జీవిస్తున్న మనుషుల రక్షణకు, వాళ్ళ జీవితాలకు ప్రమాదకరమే కాకుండా వ్యక్తి గత స్వేచ్ఛకు కూడా భంగకరం. నిజానికి అది ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమైనది. అధికార యంత్రాంగంలోని కొందరికి ప్రభుత్వమే ఇలాంటి హక్కుల్ని ఇవ్వడం జరిగినప్పుడు బాధితులు ఏం చేయగలుగుతారు? ఇక మిగిలిన ఒకే ఒక ప్రత్యామ్నాయం తమ నిరసనను తెలపడం, న్యాయ వ్యవస్థను సంప్రదించడం. బిజెపి పాలిత ఇతర రాష్ట్రాల్లో కూడా మెల్లిగా ఈ విధానాలు అమలులోకి వచ్చాయి.

ఈ బుల్డోజర్ న్యాయం అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ ఇట్లా చాలా చోట్లకి పాకింది. ప్రయాగ్ రా, సహరాన్ పూర్, కాన్పూర్ వంటి జిల్లాల్లో, ఇంకా అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు అంటూ అధికారులే కమర్షియల్ కాంప్లెక్స్‌లను, భవనాలను కూల్చేశారు. వాటి యజమానులకి నిరసనకారులతో లేదా సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఈ కూల్చివేతలను జరిపాము అని బాహాటంగానే ప్రకటించారు. ఇది అన్యాయం కదా, అని ఎవరైనా అన్నప్పుడు ఆ కట్టడాలకి అనుమతులు లేవు, అవి అక్రమ కట్టడాలు అని మాట్లాడటం కూడా మొదలుపెట్టారు. మాఫియా ముఠాలను, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డ వాళ్ళు ఇళ్లను, అలాగే మత కల్లోలాలకు పాల్పడ్డ వాళ్ళు ఇళ్ళను కూడా కూల్చివేస్తున్నామని చెప్పడం మొదలుపెట్టారు. ఈ బుల్డోజర్లు ఆ ప్రాంతాల్లో ఎప్పుడూ ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా, వాళ్ళ ఇళ్ళను కూల్చడం కోసమే ఎందుకు వెళ్తున్నాయి అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు.

2019, 2020 కాలంలో హిందుత్వవాదులు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో సిటిజెన్ షిప్ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన ఒక కమ్యూనిటీకి చెందినవారి ఇళ్లపైన, వారి విద్యాసంస్థలపైన దాడి చేసి వాటిని కూల్చివేశారు. దీనిని అప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ అడ్డుకోలేదు. నేరస్థులను అణచివేసేందుకే మేము బుల్డోజర్‌ని ఉపయోగిస్తామని బాహాటంగా బిజెపి ప్రతి ఎన్నికల సందర్భంలో, తమ ర్యాలీలలో చెప్పడం మొదలు పెట్టింది. నిజానికి ఈ కూల్చివేతల బాధితులలో పేదవాళ్లు, సామాన్యులు, రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఉన్నారు. కాగా, అభివృద్ధి పేరిట జరిగే కూల్చివేతల తీరు మరొక కోవకు చెందినది. దానివల్ల కూడా వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. అది కూడా చర్చించవలసిన అంశమే.
అక్రమ కట్టడాలు అనే పేరుతో ఇళ్ళను కూలుస్తున్నప్పుడు అనేక మంది ఢిల్లీలోనూ, ఇంకా దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలను చేశారు. ఒకే న్యాయం అన్నప్పుడు అన్ని నిబంధనలను ఉల్లంఘించి, రాజకీయ నాయకులు, ధనవంతులు నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు వాటిని ఎందుకు కూల్చడం లేదు అని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను అక్రమంగా అనే పేరుతో కూల్చి వేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పును తీర్పు చెబుతూ అధికారులే న్యాయ నిర్ణీతల్లా వ్యవహరిస్తూ దోషులని ఆరోపణ చేయబడ్డ వ్యక్తుల స్థిరాస్తులను కూల్చివేయడం సరి అయింది కాదని అంది.

కోర్టు ఆదేశాలను, కూల్చివేత ప్రక్రియలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి పనులకు అధికారులు కనుక పాల్పడితే ఆ నష్ట పరిహారాన్ని అధికారుల జీతం నుండి వసూలు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. నేరం చేసిన నిందితుడు ఆ ఇంట్లో వుండే వారిలో ఒక్కరే అయినప్పుడు, అతడి ఇంటిని కూల్చివేసి, అందులో నివసించే మిగిలిన వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎట్లా చేస్తారు అని కూడా కోర్టు నిలదీసింది. రహదారులు, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాలు ఇట్లాంటి చోట్ల కట్టిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించమంటూ మినహాయింపులు కూడా ఇచ్చింది. అక్రమ కట్టడాల తొలగింపు సమయంలో కూడా పాటించాల్సిన నియమ నిబంధనలు ఉంటాయని, దాని కోసం మున్సిపల్ అధికారులు ఒక డిజిటల్ పోర్టల్ సిద్ధం చేయాలని చెబుతూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మొత్తం మీద కొంత ఊరట కలిగించే తీర్పే ఇది. అయినా, ప్రజాస్వామిక విలువలను, రూల్ ఆఫ్ లా ను, రాజ్యాంగాన్ని, పౌర హక్కులను లెక్క చేయకుండా పాపులర్ సంస్కృతిగా, భాషగా, రాజకీయ ఆచరణగా, సమాజంలోకి రాజకీయ పార్టీల, నాయకుల, చివరకు, సాధారణ ప్రజల జీవితాల్లోకి చొచ్చుకుపోయిన ఈ బుల్డోజర్ న్యాయాన్ని వదిలించుకోవడం అంత సులభం ఏమీ కాదు.

(రచయిత్రి సామాజిక కార్యకర్త)

బహుముఖం

విమల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News