Sunday, December 22, 2024

బుల్డోజర్ న్యాయం.. సామూహిక శిక్ష!

- Advertisement -
- Advertisement -

హర్యానాలోని ‘ను’లో ఇటీవల హింస చెలరేగింది. స్థానిక పాలనా యంత్రాంగం వెంటనే ఆ ప్రాంతంలో నివసిస్తున్న లెక్కలేనంత మంది ఇళ్ళను బుల్డోజర్‌లతో ధ్వంసం చేసింది. పనిలో పనిగా ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఇతరుల ఇళ్ళను కూడా ధ్వంసం చేసేసింది. వీరంతా నిందితులని కొందరు అధికారులు, రాజకీయ నాయకులు ప్రకటించారు. ‘ను’లో జరిగిన ఈ విధ్వంసాన్ని తాజాగా తిరిగి జరిగిన ‘బుల్డోజర్ న్యాయం’ గా భావించవచ్చు. ఇళ్ళ విధ్వంసం మధ్యప్రదేశ్‌లోని కార్గొన్‌లో, గుజరాత్‌లోని కంభాట్‌లో, ఢిల్లీలోని జహంగిర్‌పురిలో, అసోంలోని నాగోన్‌లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఏడాదిగా జరుగుతోంది. రాజకీయ హింసకు ప్రతిస్పందనగా ఈ ‘సరిహద్దు న్యాయం’ పాలనా వ్యవస్థ లక్షణంగా తయారైంది. ఇళ్ళ విధ్వంసం చేపట్టిన సందర్భంగా ప్రభుత్వం కానీ, దాని అధికారులు కానీ ఒక విద్వేషంతో మాట్లాడుతున్నారు. ఈ ఇళ్ళ విధ్వంసాన్ని ‘దురాక్రమణలను’ తొలగించడంగా, ‘అక్రమ నిర్మాణాలను’ తొలగించడంగా ప్రభుత్వాధికారులు సమర్థించుకుంటున్నారు.

Also Read: లవ్ జిహాద్ పేరిట దారుణం: ముంబైలో ముస్లిం యువకుడిపై దాడి(వైరల్ వీడియో)

మున్సిపల్ చట్టాలననుసరించి అనధికార నిర్మాణాలను తొలగించడమనే చట్టపరమైన ముసుగును కప్పుకుంటూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వీటిని న్యాయస్థానాల్లో సవాలు చేసినప్పుడు తమ చర్యలను సమర్థించుకోవడానికి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది. ఏదేమైన్నప్పటికీ అల్లర్లు సృష్టించే వారికి ‘గుణపాఠం నేర్పాలనే’ ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని అధికారులు అంటున్న మాటలు రికార్డు అవుతున్నాయి.

అన్నిటికంటే గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకోవడంలో విఫలమవుతోం ది. ‘అనధికార నిర్మాణాలు’ అని చెపుతూ తమ విధ్వంసక చర్యలను మర్యాదగా ఏళ్ళ తరబడి దాటవేస్తున్నారన్న విషయాన్ని న్యాయస్థానాలు గమనిస్తున్నాయి. వీరు ధ్వంసం చేసే ఇళ్ళన్నీ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న ఆర్థికంగా నిరుపేదలైన వారి నివాసాలు. పౌరులందరికీ నివాసాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదైనప్పటికీ వీరంతా నివాసాలు దక్కని నిర్భాగ్యులు. ఇళ్ళను ధ్వంసం చేసేటప్పుడు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం వంటి కనీస మౌలిక చర్యలు చేపట్టాలి.

ఇళ్ళను ధ్వంసం చేసేముందు ఆ ఇళ్ళలో నివసించే వారు పునరావాసానికి అర్హులా, కాదా అన్న సర్వే నిర్వహించాలని న్యాయస్థానాలు కూడా చెపుతున్నాయి. ఇళ్ళ విధ్వంసాని కంటే ముందు వారికి పునరావాసం కల్చించి తీరాలి. పునరావాసం అంటే ఇళ్ళు కోల్పోయే వారిని కేవలం పట్టణంలో ఒకప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళి ఏదో సామాను పడేసినట్టు పడేయడంకాదు. వారి జీవితాలు విధ్వంసం కాకుం డా, చెప్పుకోదగ్గ విధంగా ఉండేలా చూడాలి. తన పౌరులను తల దాచుకునే ఇళ్ళులేని వాళ్ళుగా, నిరాశ్రయులుగా చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. అలా చేయడమనేది అనాగరిక సమాజం చేసేపని.

అప్పటికప్పుడు జరిగే ఇళ్ళ ధ్వంసాన్ని ఏవైతే మనం చూస్తున్నామో, అవి తగిన నిబంధనల మేరకు, వాస్తవిక అవసరాల మేరకు జరిగినవి కావు. గత ఏడాది జరిగిన ఇళ్ళ విధ్వంసంలో ఫిర్యాదు చేయకుండా పాలనాధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ, అవి పాత తేదీలు వేసి ఇచ్చిన నోటీసులు. హర్యానాలోని ‘ను’ లో ఇళ్ళను ధ్వంస చేస్తున్నప్పుడు అదే రోజు, అప్పటికప్పుడే నోటీసులు ఇచ్చారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇళ్ళ విధ్వంసానికి పాలనాధికారులు పాటించిన చట్టబద్ధతను నామమాత్రమైనదే కాకుండా స్వల్పమైన పరిశీలనను జరిపినట్టయింది.

మున్సిపల్ చట్టం ప్రకారం, జోనింగ్ విధానంలో ఆ స్థలాలు వివాదాస్పదం కావని, అనధికార నిర్మాణాలు కావని ఆ రోజు సాయంత్రానికల్లా అందరికీ తెలిసిపోయింది. జరుగుతున్నదంతా గమనిస్తే, ముఖ్యంగా ఒక వర్గాన్ని ధ్యేయంగా చేసుకుని ప్రభుత్వం చేపట్టిన సామూహిక శిక్షగా అంతా భావించారు. చట్టాన్ని, న్యాయ వ్యవస్థను అనుసరించి చర్యలు చేపట్టడానికి బదులు, ప్రభుత్వం సరిహద్దుల్లో ప్రయోగించే న్యాయాన్ని అమలు చేసినట్టు, హింసను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వమే చట్టాన్ని అతిక్రమించింది.

అల్లర్లకు పాల్పడిన వారిని దెబ్బ తీయాలనే ధ్యేయంతో వారి ఇళ్ళను ధ్వంసం చేయడం వారి అసలు ఉద్దేశమని రాజకీయ నాయకులు, పరిపాలనాధికారులు, చివరికి పోలీసులు కూడా చెప్పడం ఇందుకు చక్కని సాక్ష్యం. ధ్వంసం చేస్తున్నప్పుడే హింస కు సంబంధించిన కేసులు అప్పటికప్పుడు పుట్టుకు రావడం మరొక సాక్ష్యం. ఈ వాస్తవాల నుంచి మనకు అర్థమయ్యేదేమిటంటే మన పట్టణ ప్రణాళికలోని జోనల్ విధానం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఢిల్లీలోని సంపన్నులు నివసించే ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ జోనల్ నిబంధనలను అతిక్రమించి నిర్మించినవేనని ప్రజలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఏమైనప్పటికీ సంపన్నులుండే ఈ కాలనీల్లో ఏ ఒక్క ఇంటినీ బుల్డోజర్ల ద్వారా ధ్వంసం చేయలేదు. పేదలు నివసించే ఇళ్ళను మాత్రమే ధ్వంసం చేస్తున్నారు. మత ఘర్షణలు జరిగిన తరువాత ముస్లింలు నివసించే ప్రాంతాల్లోనే చెప్పుకోదగ్గ విధంగా ఇళ్ళను ధ్వంసం చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో అనేక మంది గూండాల ఆస్తులను ధ్వంసం చేశారు. గత ఏడాది జహంగీర్‌పురి హింసను దృష్టిలో పెట్టుకుని కొందరి ఇళ్ళను ధ్వంసం చేశారు. ఏ కారణం లేకుండా ఒక హిందువు షాపును కూడా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం పునరావృతమైందనడానికి ‘ను’ చక్కని ఉదాహరణ. బల్డోజర్లు నేరుగా ముస్లింలు నివసించే ప్రాంతంలోకే వెళ్ళాయి. ఈ ధోరణిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేం. కొన్ని రోజుల క్రితం వ్యతిరేకమైన జాతిని తుడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే ‘ను’లో ఇళ్ళ విధ్వంసం జరిగిందని భావించిన పంజాబ్, హర్యానా హైకోర్టు ఆ విధ్వంసాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘జాతిని తుడిచి వేయడం’ అనే పదం అంత తేలిగ్గా ఎప్పుడూ ఉపయోగించలేదు.

అల్లర్లకు పాల్పడుతుండగా పట్టుబడిన వారి విషయంలో బుల్డోజర్ విధానం బాధిత ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చవచ్చు. నేరం జరిగినప్పుడు న్యాయం పని చేసే విధానం ఎలా నత్తనడక సాగుతోందో ఏళ్ళ తరబడి గమనించిన వారిని ఈ విధానం సంతృప్తి పరచవచ్చు. నిజానికి చట్ట వ్యతిరేకంగా చంపడం కానీ, ఇళ్ళ విధ్వంసం కానీ న్యాయాన్ని వేగవంతం చేయడంగా భావించవచ్చు. న్యాయ వ్యవస్థ చాలా నిదానంగా పని చేస్తోంది, నిందితులకు బెయిల్ ఇచ్చేస్తోంది, నిర్దోషులుగా విడుదల చేసేయడం సాధ్యమవుతోంది.అందుచేత ప్రజల ఆగ్రహాన్ని ఉపశమింప చేయడానికి ప్రభుత్వం చట్టానికి అతీతంగా ‘న్యాయం’ చేయడానికి ఉపక్రమిస్తోంది.

ఇది చాలా ప్రమాదకరమైన, విధ్వంసకరమైన తర్కం అన్న విషయం అర్థమైపోతోంది. నేరం రుజువైనప్పటికీ నేరస్థుడికి శిక్ష పడనప్పుడు సామూహిక శిక్ష విధించే విధానానికి ‘బుల్డోజర్ న్యాయం’ అనేది ఒక రూపం. అయితే ఈ విధానంలో నేరం చేసిన వ్యక్తికి శిక్ష విధించడంతో పాటు అమాయకులైన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా శిక్షను అనుభవించాల్సి వస్తోంది. ప్రాచుర్యంలోకి వచ్చిన సంతృప్తి ఏస్థాయిలో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యల ద్వారా సంతృప్తినివ్వలేదు. నేరం చేయకుండానే నిరపరాధులకు ప్రభుత్వం తన విచక్షణ ద్వారా శిక్ష విధించినట్టయితే, అది చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది. ఒక దోపిడీ ప్రభుత్వానికి, వ్యక్తుల మౌలికమైన రక్షణకు మధ్య న్యాయం నిలబడుతుంది. సరిహద్దు న్యాయం కోసం చట్టాన్ని, న్యాయాన్ని విడిచిపెట్టినట్టయితే అది ఆధిపత్యవాద సమాజం వైపు తొలి అడుగు వేసినట్టే. అలాంటి ఆధిపత్య సమాజంలో పౌరుల రక్షణ, భౌతికంగా కలిగి ఉండడం, చివరికి స్వేచ్ఛ, జీవితం వంటివన్నీ ప్రభుత్వాధికారుల ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటాయి.
న్యాయ వ్యవస్థ మౌనం

ఇలాంటి సందర్భాలలో చట్టబద్ధ్దతమైన పాలనను, రాజ్యాంగాన్ని అమలు పరచడమనే బాధ్యత న్యాయస్థానాల భుజస్కంధాలపైన ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఒక ఏడాదిగా అనుకోకుండా మౌనం వహిస్తోంది. ‘అనధికార నిర్మాణాల’ను తొలగిస్తున్నామన్నప్పుడు చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ చర్యలనే ఆమోదిస్తోంది. ఇలా చేస్తున్నప్పుడు ‘కళ్ళకు కనిపిస్తున్న, చెవులకు వినిపిస్తున్న సాక్ష్యాలను తిరస్కరించాలి’ అనే జార్జి ఓర్‌వెల్ మాటలను న్యాయస్థానాలు ఉటంకిస్తుంటాయి. ఏ మాత్రం న్యాయం లేని ‘బుల్డోజర్ న్యాయం’ పైన న్యాయ వ్యవస్థ దృష్టి సారించడం అనేది తొలిసారిగా పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలేనని చెప్పవచ్చు. ప్రభుత్వానికున్న శిక్షార్హతకు వ్యతిరేకంగా రాజ్యాంగ సూత్రాలను, విలువలను పునరుద్ధరించడానికి న్యాయ వ్యవస్థ దీంతో ప్రారంభించిందని మనం భావించవచ్చు.

మూలం
గౌతవ్‌ు భాటియా
అనువాదం
రాఘవశర్మ
9493226180
(‘ద హిందూ’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News