హైదరాబాద్ : ‘బుల్డోజర్ న్యాయం’ అనేది సామూహిక శిక్షకు ఒక రూపమని, ఇక్కడ అమాయక కుటుంబ సభ్యులు కూడా శిక్షించబడతారని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. ఇలాంటి చర్యల వల్ల న్యాయం జరగదని.. దీనిని ఎవరూ సమర్థించరని ఓవైసి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘బుల్‌డోజర్ న్యాయం’ కోసం చట్ట పాలనను విడిచిపెట్టడం అనేది నిరంకుశం వైపు మొదటి అడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక వ్యక్తికి భద్రత, జీవితం, స్వేచ్ఛ ఉండదన్నారు. హర్యానాలోని నూహ్‌లో ఇటీవలి హింసాకాండ తర్వాత, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో స్థానిక పరిపాలన సంస్థలు పరిసరాల్లోని అనేక గృహాలను కూల్చివేశారని, ఇవే ఇళ్లు , పరిసరాలు, నిందితులు , అల్లరిమూకలకు చెందినవారని కొందరు అంటున్నారని ఆయన తెలపారు. ‘బుల్‌డోజర్ న్యాయం’ అని పిలవబడే ఈ కూల్చివేతలు ఒక సంవత్సర కాలానికి పైగా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ నుండి, గుజరాత్‌లోని ఖంభాట్ వరకు, ఢిల్లీలోని జహంగీర్‌పురి వరకు, అస్సాంలోని నాగావ్ వరకు, అనేక ఇతర ప్రాంతాలలో గృహాలను కూల్చివేయడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.