Tuesday, April 1, 2025

నాలుగు చక్రాల బుల్డోజర్ న్యాయం

- Advertisement -
- Advertisement -

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు బుల్డోజర్ న్యాయం నాలుగు చక్రాలపై విచ్చలవిడిగా నడుస్తోంది. దీనికి బ్రేకులు లేవు. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలు అందేలోగా ఈ బుల్డోజర్ అంతా నేలమట్టం చేసి ఎంచక్కా వెళ్లిపోతుంది. దీని చక్రాల కింద శిథిలమైన నివాసాల పునాదులు ఎందరినో నిరాశ్రయులను చేస్తున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి దారుణ సంఘటనలు జరగడం విశేషం. మహారాష్ట్రలో గత వారం రోజుల్లో కొన్ని వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణలు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడానికి దారితీశాయి. కోర్టునుంచి స్టే వచ్చేలోగా కొన్ని గంటల్లోనే ఇళ్లు నేలమట్టం కావడం చర్చనీయాంశం అవుతోంది. కమలనాథుల ఏలుబడిలో కోర్టు ఉత్తర్వులకు కూడా విలువ లేకుండా పోయిందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.

మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో 18వ శతాబ్దానికి చెందిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని ఒక వర్గనుంచి డిమాండ్లు ఎక్కువ కావడం, దానిని మరోవర్గం వ్యతిరేకించడం, ఈలోగా మతపరమైన వస్తువులు దహనం చేసినట్టు కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు వ్యాప్తి చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మైనారిటీ డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు ఫరీమ్ ఖాన్, మరో నిందితుడు యూసఫ్ షేక్ ఈ వదంతులు వ్యాప్తి చేశారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు వారి నిర్మాణాలను కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. దీంతో వీరు ముంబై హైకోర్టును ఆశ్రయించగా కోర్టునుంచి స్టే ఉత్తర్వులు వచ్చేలోపుగానే ఫరీమ్ ఖాన్ ఇళ్ల నిర్మాణాలన్నీ బుల్డోజర్‌తో కూల్చివేశారు. మరో నిందితుడు యూసఫ్ షేక్ ఇళ్లనిర్మాణం మాత్రం కోర్టు ఆదేశాలతో కూల్చకుండా అధికారులు ఆపేశారు. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్ల యజమానులను విచారించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది. కూల్చివేతలు చట్టవిరుద్ధంగా జరిగినట్టు నిరూపణ అయితే జరిగిన నష్టపరిహారం అధికారులు చెల్లించవలసి వస్తుందని హెచ్చరించింది. ఇదే విధంగా మహారాష్ట్ర డిప్యూటీ సిఎం ఏక్‌నాథ్ షిండేను ద్రోహి అని ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా వ్యాఖ్యానించడంతో ఆయన ప్రదర్శన ఇచ్చిన హాబిటాబ్ క్లబ్ నిర్మాణాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ కూల్చివేసింది.

దీన్ని బట్టి పాలకవర్గాలను తీవ్రంగా వ్యతిరేకించే వారి ఇళ్లు బుల్డోజర్లతో నేలమట్టం కాకతప్పదు అన్న ఒక హెచ్చరిక ప్రజలకు అందుతోంది.ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వం లోని ప్రభుత్వం మొదలు పెట్టిన ఈ బుల్డోజర్ న్యాయం ఉత్తరప్రదేశ్‌ను దాటి మధ్యప్రదేశ్‌లోకి తరువాత మహారాష్ట్ర వంటి కమలనాథుల పాలిత రాష్ట్రాల్లోకి కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కావచ్చు లేదా నిందితులు నేరస్థులు కావచ్చు.. అన్నిటికీ బుల్డోజర్ తీర్పు చెప్పడం మన ప్రజాస్వామ్య దేశం లో ఎంతవరకు న్యాయం? 2022లో సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఢిల్లీ జహంగీర్‌పురిలో ఉత్తర ఢిల్లీ నగరపాలక సంస్థ బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం సంచలనం కలిగించింది. ముస్లింలపై విద్వేషకాండే ఈ కూల్చివేతలకు కారణం. లౌజిహాద్, హిజాబ్ వ్యతిరేకత వంటి కుట్రలు, కుయుక్తుల తర్వాత అల్లర్లలో పాల్గొన్నారన్న సాకు చూపించి ముస్లింల నివాసాలను నేలమట్టం చేసేశారు.

మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటనలు దారుణంగా జరిగాయి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దాని వెనుక ఉన్న కారణాలేమిటో, ఎవరి ప్రమేయం ఉందో లోతుగా దర్యాప్తు చేసి నిజాల నిగ్గుతేల్చడం, ఆ తరువాత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను శిరసావహించడం పాలకవర్గాల ప్రథమ కర్తవ్యం. కానీ ఎలాంటి విచారణ లేకుండా కేవలం మతోన్మాదంతో ఆటవిక న్యాయం అనుసరించడం నాగరికుల లక్షణం కాదు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలనీ, విద్వేషాలను రగిలించకూడదనీ, లౌకికవాదం ముఖ్యమని రాజ్యాంగం చెబుతోంది. కానీ కొంతమంది పాలకులకు ఇది తలకెక్కడం లేదు. తమను ఎవరు విమర్శించినా, పాలనలోని లోపాలను ఎత్తిచూపినా తట్టుకోలేకపోతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు తన లోపాలను ఎత్తిచూపే ఆర్‌కె లక్ష్మణ్ కార్టూన్ ఏదైనా ఒకరోజు రాకపోతే ఫోన్ చేసి అడిగేవారట. ఆ కార్టూన్ ద్వారా తమ పాలనలోని లోపాలను సరిదిద్దుకునే వారట. లోపాలను అంగీకరించడం, హాస్యాన్ని, ఆనందంగా ఆస్వాదించడం, వ్యంగ్య వ్యాఖ్యల్లోని భావాలను అర్థం చేసుకోవడం తదితర ఉదాత్త లక్షణాల నాయకులు ఇప్పుడు కనిపిస్తారా? స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా హాస్య ప్రదర్శనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను గద్గార్ (ద్రోహి) అని వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద రాద్ధాంతంగా తయారైంది.

ఆ సెటైర్ అర్థమైంది కానీ దేనికైనా పరిమితి ఉండాలని షిండే వ్యాఖ్యానించారు. ఇది షిండే వ్యాఖ్య వరకు పరిమితం కాలేదు. ఆయన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. దీన్ని బట్టి మనకు అర్థమైనదేంటంటే పాలకుల ఒంటిమీద ఈగ కూడా వాలకూడదు. అలా జరిగితే విధ్వంసం తప్పదు. పైగా ఈ విధ్వంసాన్ని సమర్థించే నాయకులే ఎక్కువగా ఉండడం మరీ చోద్యం. బిజెపి ఎంపి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కునాల్ కామ్రా వేదికను కూల్చడం సరైన చర్యే అని కితాబు ఇచ్చారు. కేవలం రెండు నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయాలా అని విమర్శించారు. గతంలో కంగనా రనౌత్ మూవీ మాఫియా కంటే పోలీస్‌లంటేనే భయంగా ఉందని వ్యాఖ్యానించడం, దానికి ఆమె కార్యాలయంలోని కొంతభాగం కూల్చివేతకు గురికావడం తెలిసిందే. చట్టపరంగా దోషులను శిక్షించాలనే నీతికి నిలువెత్తు సమాధికట్టి బుల్డోజర్ల న్యాయం ఏలుబడి సాగిస్తుంటే ఎవరు ఆపగలరు? దీనికి పరిష్కారం చూపేది ప్రజలే !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News