Wednesday, January 8, 2025

త్వరలో బుల్లెట్‌ రైలు

- Advertisement -
- Advertisement -

తీరనున్న దేశ ప్రజల కల
కనెక్టివిటికి అత్యంత ప్రాధాన్యం
రైల్వేల ఆధునికీకరణతో మారనున్న
దేశ ముఖచిత్రం చర్లపల్లి రైల్వే
టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన
అనంతరం ప్రధాని మోడీ
ఎంఎంటిఎస్‌కు రాష్ట్రం నిధులు
ఇవ్వకపోయినా..యాదగిరిగుట్ట
వరకు పొడిగించాం : కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డి రైల్వే నెట్‌వర్క్‌లో
రాష్ట్రం రాజస్థాన్ కన్నా దారుణం:
మంత్రి శ్రీధర్‌బాబు

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని ప్రధా ని నరేంద్ర మోడీ అన్నారు. మెట్రో నెట్‌వర్క్ వె య్యి కిలోమీటర్లకు పైగా విస్తరించిందన్నారు. కోట్లాది మంది ప్రజలకు మెట్రో సేవలు అందిస్తోందన్నారు. త్వరలోనే భారత్‌కు బుల్లెట్ రైలు సాకారం అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని మోడీ సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. ఢిల్లీ నుం చి ప్రధాని మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వర్చువల్‌గా పాల్గొనగా చర్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎంపి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో రూ. 413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించగా దీనిని గత డిసెంబర్ 28న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే. టెర్మినల్‌ను పర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్నామని, నాలుగు విభాగాల్లో రైల్వేను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మౌలిక వసతులు, ప్రయాణికుల సదుపాయాలు, మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ, ఉపాధి కల్పన కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జమ్ముకశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాటు జరిగాయని, భారత రైల్వేకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నామని, కోట్లాది మందిని వందే భారత్ రైళ్లు గమ్యం చేరుస్తున్నాయన్నారు. 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రయిల్ రన్ నడిచిందన్నారు.

సోలార్ స్టేషన్ గా చర్లపల్లి టర్మినల్ ను అభివృద్ధి చేశారని, ఔటర్ రింగ్ రోడ్డుకు ఇది సమీపంలో ఉందని ప్రధాని వివరించారు. తెలంగాణ ప్రగతిలో చర్లపల్లి రైల్వే టర్మినల్ అత్యంత కీలకంగా మారబోతోందని ప్రధాని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చర్లపల్లి లాంటి స్టేషన్లు అవసరమని ఆయనన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో హై స్పీడ్ రైళ్ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతుందని, ప్రాధాన్యత ఆధారంగా ఒక్కోక్కటి నిర్మిస్తూ వస్తున్నామని అన్నారు. దేశంలో ఇప్పటికే 35 శాతం విద్యుదీకరణ పూర్తి అయిందని గుర్తు చేశారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో తయారైన వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు తీసుకొచ్చామని, వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెచ్చామని ప్రధాని మోడీ అన్నారు. దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే కొత్త రూపు సంతరించుకుందని అన్నారు. అత్యంత వేగంగా జరుగుతున్న రైల్వేల ఆధునికీకరణతో దేశ ముఖచిత్రం మారిపోతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రైల్వే శాఖలో సంస్కరణలు తెచ్చాం :కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం భారత రైల్వే శాఖలో అనేక సంస్కరణలు తెచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.413 కోట్లతో ఎయిర్‌పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో 100 శాతం లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని అన్నారు. హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని 32 జిల్లలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. ఎంఎంటిఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్ల ఇంకా రావాల్సింది ఉందని, వారు ఇవ్వకపోయినా తెలంగాణ, తిరుపతి, యాదగిరి గుట్ట వరకు ఎంఎంటిఎస్ సౌకర్యం కల్పించామన్నారు. కొమురవెల్లి లో కూడా రైల్వే స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు ప్రాధాన్యతనివ్వాలి : మంత్రి శ్రీధర్ బాబు
భౌగోళికంగా ఉత్తర, దక్షణ ప్రాంతాలను కలుపుతున్న తెలంగాణా రాష్ట్రం రైల్వే కనెక్టివిటీలో మాత్రం పదో స్థానంలో ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జిల్లాలు, గ్రామాలను కలుపుతూ నెట్ వర్క్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం చొరవ చూపాలని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ‘చర్లపల్లి రైల్వే టెర్మినల్’ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన హాజరై ప్రసంగించారు. వెనకబడిన రాజస్థాన్ రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడి నెట్ వర్క్ అందులో సగం మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ‘అభివృద్ధి, తలసరి ఆదాయంలో తెలంగాణ వేగంగా దూసుకెళ్తుందని, కాని రైల్వే నెట్ వర్క్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉందన్నారు. ఈ పరిస్థితి మారాలని, కొత్త రైల్వే లైన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రస్తుతమున్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, మల్కాజ్ గిరి ఎంపి ఈటెల రాజేందర్ చొరవ చూపాలని శ్రీధర్ బాబు కోరారు. ‘అత్యాధునిక హంగులతో కూడిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల కంటే చర్లపల్లిలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశముందన్నారు. ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అప్రోచ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని అన్నారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇందుకు ప్రత్యేక గ్రాంట్ ను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో టిజిఐఐసి ఈడి పవన్ కుమార్, సిఈ శ్యాం సుందర్, జోనల్ మేనేజర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News