Saturday, November 23, 2024

విజయవాడ – హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్

- Advertisement -
- Advertisement -

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఎంపి ఉత్తమ్ డిమాండ్

Bullet train Hyderabad to Vijayawada

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల కోసం మరోసారి బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాదవిజయవాడ మధ్య బుల్లెట్ రైలు ప్రవేశపెట్టాలని ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పుడిదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్లమెంటులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ రెండు ప్రధాన నగరాలను బుల్లెట్ ట్రైన్ ద్వారా కలపడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీంతో పాటు హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయి వంటి మెట్రో నగరాలను కలుపుతూ.. బుల్లెట్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీ అయిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచాలన్న ప్రతిపాదన ఇంకా నెరవేరలేదని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, విజయవాడ,. ముంబయి ప్రాంతాలు హైదరాబాద్‌తో కనెక్ట్ చేసే విధంగా బుల్లెట్ రైలు లేదా హైస్పీడ్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఎనిమదేళ్ల క్రితం 2014లో చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’లో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. గతంలో పలుమార్లు లోక్‌సభలో ఈ అంశం గురించి ప్రస్తావించానన్నారు. ప్రధానమంత్రి, రైల్వే మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశానని తెలిపారు. చట్టపరమైన ఆ హామీకి ప్రాధాన్యత, అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో రైల్వే కోచ్‌లు తయారు చేసే అవసరాలను పరిగణనలోనికి తీసుకుంటే, ఖాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ కర్మాగారం అంత లాభదాయకం కాదని గతంలో రైల్వే మంత్రి తెలిపారన్నారు. విభజన చట్టంలో రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చిన ఉద్దేశం ప్రధానంగా తెలంగాణలో అదనంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమేనన్నారు. నూతనంగా 400 వందే భారత్ అధునాతన న్యూజనరేషన్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు కోచ్‌లను తయారు చేయడానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో వందే భారత్ రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేయడం సముచితమన్నారు. ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టం లేకపోతే.. ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో (పిపిపి) రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారన్నారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు, సాధ్యమైనంత త్వరగా ఖాజీపేటలో రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అదే చట్టంలో హైదరాబాద్, విజయవాడల మధ్య రైల్వే, రోడ్డు మార్గాలను మరింతగా అభివృద్ధి చేస్తామనే హామీ కూడా ఉందన్నారు. సూర్యాపేట, కోదాడల గుండా హైదరాబాద్‌విజయవాడకు హైస్పీడ్ రైలుగానీ, బుల్లెట్ రైలుగానీ వేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్‌ముంబై మధ్య ఏర్పాటు చేస్తున్న బుల్లెట్ రైలు కంటే హైదరాబాద్‌విజయవాడకు బుల్లెట్ రైలు ఆర్థికంగా లాబదాయకంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలో చిట్యాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వే లైను వేయడంతో పాటు, ఆ మార్గంలో హైస్పీడు రైళ్లు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లోనే ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న మోటుమర్రిమేళ్లచెరువుమఠంపల్లిజానపాడువిష్ణుపురం రైల్వేలైనులో గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను కూడా నడపాలని రైల్వే మంత్రికి గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేశారన్నారు. అయితే, ప్యాసింజర్ రైళ్లను ఈ మార్గంలో నడిపేందుకు ‘కమిషనర్ ఆఫ్ రైల్వే స్టాఫ్’ అనుమతించలేదని సమాధానం ఇచ్చారు. మేళ్ల చెరువు నుంచి మిర్యాలగూడెం, నల్గొండ గుండా హైదరాబాద్ వరకు ‘షటిల్ రైలు’ను వేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News