ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారు నలుగురు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బుల్లి బాయ్ ’ యాప్ కేసులో యాప్ సృష్టికర్త , ఇంజినీరింగ్ విద్యార్థి అయిన 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు అసోం లోని జొర్హాట్‌లో గురువారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో నలుగురు అరెస్టు అయ్యారు. ఈ నలుగురిలో ముగ్గురు 21 ఏళ్లవారు కాగా, ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఇద్దరు ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. ముంబై సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురిలో ఇద్దరు నిందితులు ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన నీరజ్ గిట్‌హబ్ ప్లాటఫాం లో ఈ యాప్ రూపొందించినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. మహిళలకు సంబంధించిన అభ్యంతరకర చిత్రాలు అతడి ఖాతా నుంచే వచ్చాయని పోలీసులు చెప్పారు. జొర్హాట్ కు చెందిన నీరజ్ భోపాల్‌లో వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఈ యాప్‌ను రూపొందించినట్టు ఆయన ఒప్పుకున్నాడని, ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఒ) విభాగం నిందితుడిని అరెస్టు చేసిందని ఐఎష్‌ఎస్‌ఒ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కెపిఎస్ మల్హోత్రా వెల్లడించారు. అతని లాప్‌టాప్‌లో యాప్ అవశేషాలు కనిపించాయని, ఢిల్లీ కోర్టులో హాజరు పరిచేందుకు ఆయనను ఢిల్లీకి తీసుకురావడమైందని చెప్పారు. సాంకేతిక విశ్లేషణ, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డిటైల్ రికార్డులు, ఇతర మార్గాల ద్వారా ఐఎఫ్‌ఎస్‌ఒ ఈ కేసును చేపట్టిందని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేయడానికి 12 గంటల ఆపరేషన్ పట్టిందని, ఢిల్లీ పోలీసులు సమాచారం అందించిన కొన్ని గంటల్లోనే అరెస్టు జరిగిందని అసోం పోలీస్ అధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన కొందరు మహిళల ఫోటోలను మార్చి దుండగులు బుల్లీ బయ్ యాప్‌లో ఉంచడం, వర్చువల్ వేలం కోసం వారి అనుమతి లేకుండానే పోటోలు ఆ యాప్‌లో అప్‌లోడ్ కావడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.