Monday, December 23, 2024

టాప్‌లోనే విలియమ్సన్, బుమ్రా

- Advertisement -
- Advertisement -

యశస్వి ర్యాంక్ మెరుగు, రెండో స్థానంలో అశ్విన్, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌లో కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), బౌలింగ్ విభాగంలో జస్‌ప్రిత్ బుమ్రా (భారత్) టాప్ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ తాజా ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి దూసుకెళ్లాడు. యశస్వి కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఒక్కడే టాప్10లో చోటు సంపాదించాడు. కోహ్లి ప్రస్తుతం ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక న్యూజిలాండ్ స్టార్ విలియమ్సన్ తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో వరుస శతకాలతో చెలరేగిన కేన్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ప్రస్తుతం 893 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (818) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న జోరూట్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు. కాగా, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా ఆరో, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఏడో ర్యాంక్‌లో నిలిచారు. కరుణతర్నె (శ్రీలంక), హారి బ్రూక్ (ఇంగ్లండ్), లబుషేన్ (ఆస్ట్రేలియా) తర్వాతి ర్యాంకింగ్స్‌లో నిలిచారు. కాగా, టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఏకంగా 14 స్థానాలను మెరుగుపరుచుకుని 15వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

బుమ్రా అగ్రస్థానం పదిలం..

బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో బుమ్రా అత్యంత నిలకడైన బౌలింగ్‌ను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 876 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత్‌కే చెందిని మరో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ ప్రస్తుతం 839 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న కగిసొ రబడా (సౌతాఫ్రికా) మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ నాలుగో, ఐదో ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుని ఆరో స్థానానికి చేరుకున్నాడు. ప్రభాత్ జయసూర్య (శ్రీలంక), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా), కైల్ జేమిసన్ (న్యూజిలాండ్) టాప్10 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News