Sunday, December 22, 2024

టీమిండియాకు షాక్.. వరల్డ్‌కప్‌కు బుమ్రా దూరం?

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పితో బాధపడుతున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచకప్‌కు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమైన బుమ్రా ప్రపంచకప్‌లో ఆడడం కూడా ప్రశ్నార్థకంగా మారింది. రవీంద్ర జడేజా కూడా గాయంతో వరల్డ్‌కప్‌కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా బుమ్రా కూడా జట్టుకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇక బుమ్రా పొట్టి ప్రపంచకప్‌లో ఆడడం కష్టమేనని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. బుమ్రా దూరమైతే మాత్రం దాని ప్రభావం టీమిండియాపై బాగానే పడే అవకాశం ఉంది. బౌన్స్‌కు సహకరించే ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రాపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ తదితరులు చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో బుమ్రా సేవలు జట్టుకు కీలకంగా మారాయి. కానీ వెన్నునొప్పి బాధతో సతమతమవుతున్న బుమ్రా వరల్డ్‌కప్‌లో ఆడడం సందేహంగా మారింది. అదే జరిగితే బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం టీమిండియాకు తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న బుమ్రా కనీసం ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని బిసిసిఐ వర్గాలే వెల్లడించాయి. కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20కు ముందు బుమ్రా గాయం తిరగబడింది. మ్యాచ్ ఆరంభానికి ముందు గాయం సమస్యను బుమ్రా జట్టు యాజమాన్యం ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అతన్ని తొలి మ్యాచ్‌కు దూరంగా ఉంచారు. అంతేగాక సౌతాఫ్రికాతో జరిగే మిగతా మ్యాచ్‌లకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇక తాజాగా వరల్డ్‌కప్‌కు కూడా బుమ్రా దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది.
షమీ, సిరాజ్‌లకు ఛాన్స్?
మరోవైపు బుమ్రా దూరమైతే అతని స్థానంలో ఎవరినీ జట్టులోకి తీసుకోవాలనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక దీపక్ చాహర్ కూడా రేసులో ఉన్నాడు. అయితే సీమర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై సిరాజ్ లేదా షహీ ఉంటేనే బాగుంటుందని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇక యువ ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, ఉమ్రాన్ మాలిక్‌లను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. కానీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం సిరాజ్, షమీలకే ఛాన్స్ దొరికే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

Bumrah ruled out of ICC T20 World Cup?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News