కర్ణాటకలో ఎసిబి అధికారుల దాడులు
బెంగళూరు: కొందరు అధికారులు , రాజకీయనేతలు తాము అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఇంటిగోడల్లోనో, బాత్ రూముల్లోనే దాస్తుండడం మనం చూస్తుంటాం. కానీ కర్ణాటక లోని పీడబ్యుడి జాయింట్ ఇంజినీర్ తన సొమ్మును బ్యాంకు లోనో, బీరువా లోనో కాకుండా తన ఇంటి పైపులైన్‌లో దాచిపెట్టడం ఎసిబి అధికారులకు విస్మయం కలిగించింది. కర్ణాటకలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారుల ఇళ్లల్లో ఏసిబి సోదాలు జరపగా ఈ భారీ అవినీతి తిమింగళం పట్టుబడింది.
కలబురిగి జిల్లా పీడబ్లుడి జాయింట్ ఇంజినీర్ శాంతా గౌడ్ బిరదర్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఆ ఇంజినీర్ అక్రమ సంపాదనకు హవాక్కయ్యారు. ఈ సోదాల్లో రూ.25 లక్షల నగదు, పెద్దమొత్తం బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. శాంతాగౌడ్ తన ఇంట్లో ఉన్న పైపులైన్‌లో నగదు దాచి ఉంచాడన్న సమాచారం అందుకున్న అధికారులు ఓ ప్లంబర్‌ను తీసుకొచ్చి వాటిని తీయించారు. దీంతో పైపులైన్ నుంచి కరెన్సీ నోట్లు కిందకు పడడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఆయన ఇంట్లో సోదాలను వీడియోలో చిత్రీకరించారు. నల్లధనం కోసమే ఈ పైపులను ఇంట్లో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది అధికారులకు పంబంధించి ఏసీబీ అధికారులు 60 చోట్ల సోదాలు చేశారు. ఇటీవలే బెంగళూరు డెవలప్‌మెంట్ అధారిటీ కార్యాలయం లోను సోదాలు జరిపారు. ఏ రూపంలో అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఇటీవలే సిఎం బసవరాజ బొమ్మై స్పష్టం చేశారు. దోషులను ఎవరినీ కాపాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఏసీబీ నివేదిక ఆదారంగా చర్యలు తీసుకుంటామన్నారు.