హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో నోట్లకట్టల కలకలం. విశాఖ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఆపి తనిఖీ చేసిన పోలీసులకు అందులో నోట్ల కట్టలు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు ఆటో డ్రైవర్ తెలిపాడు. అయితే, మెషిన్ లో మాత్రం గుట్టల కొద్దీ నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.1.30 కోట్లు అని పోలీసులు తెలిపారు. అందులోనే 30 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని వెల్లడించారు.
విశాఖపట్నంలోని ఎన్‌ఎడి జంక్షన్ వద్ద ఈ ఆటో పట్టు బడింది. వాషింగ్ మెషిన్లను విజయవాడకు తరలిస్తున్నట్లు ఆటోడ్రైవర్ వెల్లడించాడు. అయితే, నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ చూపించలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. విశాఖ నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు సమాచారం.