Sunday, April 13, 2025

పేదలపై భరించలేని గ్యాస్‌బండ భారం

- Advertisement -
- Advertisement -

గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఏప్రిల్ 8 నుంచి రూ. 50 చొప్పున పెంచి వెంటనే అమలులోకి తెచ్చింది. దీని వలన దేశంలో 32.85 కోట్ల గృహ వినియోగదారులైన పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడింది. సిలిండర్ ధరను కడపటిసారి 2024లో పెంచారు. దాంతో పాటు పెట్రోలు, డీజిల్ ధరల భారం ప్రజలపై పడకుండా చమురు కంపెనీలే భరిస్తాయని లీటరుకు రెండు రూపాయలు పెంచింది. మండుతున్న వేసవిలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు తోడు గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో మూల్గే నక్కపై తాటిపండు పడినట్లయింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ హైదరాబాదులో రూ. 855 ఉండగా అది నేటి నుంచి రూ. 905 కానుంది. ముడిచమురు ధర తగ్గినా దేశంలో చమురు ఉత్పత్తుల ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించడం లేదు.

దీనికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. వంట గ్యాస్ ధరను పెంచడం వల్ల బడుగులపై పిడుగు పడినంత భారం పడుతుందనడంలో అతిశయోక్తి లేదు. గ్యాస్ వినియోగంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలు ఈ ఇంధనాన్నే ఎక్కువగా వాడుతున్నారు. ఇందుకు చవకగా లభించడం, ఆదా కావడం ముఖ్య కారణం. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిలిండర్ పై రూ. 50లు పెంచి పేద ప్రజల ఆశలను కరిగించేస్తుంది. కార్పొరేట్ పెట్టుబడిదారులు గ్యాస్ సిలిండర్లపై ధరలు పెంచాలని మోడీ ప్రభుత్వంపై గత కొంతకాలం నుండి ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాలుగు సంవత్సరాల వరకు ఎన్నికలు లేనందున కార్పొరేట్లకు తలవొగ్గి దేశజనాభాలో నాలుగో వంతు పేద మధ్యతరగతి ప్రజలపై ఒకేసారి రూ. 50 లు పెంచడానికి పూనుకున్నది. ఈ పెరుగుదల వలన కేంద్ర ప్రభుత్వానికి రూ. 36 వేల కోట్లు అదనంగా రాబట్టుకుంటుంది.

దీన్ని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,42,72,200. అందులో 42.90 లక్షల మందికి ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే సిలిండర్‌ను పంపిణీ చేస్తున్నది. ధరలు ఎంత పెరిగినా ఆయా లబ్ధిదారులకు ప్రభుత్వం అదే ధరకు సిలిండరును సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 21 కోట్ల ప్రతినెల అదనం భారం పడుతుంది. మహాలక్ష్మిలబ్ధిదారులు కాకుండా మిగిలిన వినియోగదారులు 99,82,200 మంది ఉన్నారు. వారికి ఎలాంటి రాయితీ లేనందున ఒక్కొక్క సిలిండర్‌పై రూ. 50లు చొప్పున వారు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రతినెల రూ. 50 కోట్ల భారం మోడీ ప్రభుత్వం మోపింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కలిపి ప్రతి నెల రూ. 71 కోట్లకు పైగా భారం పడుతుంది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు కూడా రూ. 50 లు చెల్లించాల్సి ఉంటుందని వారు ప్రస్తుతం రూ. 503 నుంచి రూ. 553 కు పెరిగింది.

పంపిణీ కేంద్రాలనుంచి దూరాన్ని బట్టి రవాణా చార్జీలను పరిగణనలోనికి తీసుకుంటే పలు జిల్లా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఇంకాస్త ఎక్కువ ధర పడుతుంది. ఉదాహరణకు నల్లగొండలో సిలిండర్ ధర రూ. 877 ఉండగా అది ఇప్పుడు రూ. 927 కు చేరింది. విజయవాడలో సిలిండర్ ధర రూ. 825.50 నుంచి రూ. 875.50 కి పెరిగింది. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతుంటే.. పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ధరలను పెంచుతున్న మోడీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఎదురైన నష్టాలను పూడ్చుకోవటంలో భాగంగా ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతికూల ఆర్థిక, వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో మోడీ సర్కారు ధరల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

– ఉజ్జిని రత్నాకర్ రావు, 90909 52646

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News