Sunday, January 19, 2025

అన్నదాతల ఆక్రందన..12 ఎకరాల్లో వరి పంటకు నిప్పు

- Advertisement -
- Advertisement -

ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలకు సాగుకు నీరందక ఎండుతుండంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. పండించిన పంటలు చేతికిరావనే ఆక్రందనతో రైతులు తమ వరి పంటకు నిప్పంటించి నిరసన తెలుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు అరుకాల మల్లేశం (మూడెకరాలు), అమ్ముల మహేష్ (రెండెకరాలు), సలంద్రి పర్శరాములు (మూడెకరాలు), కోరం బుచ్చవ్వ (నాలుగెకరాలు) మొత్తం 12 ఎకరాల వరి పంటకు సమీప పొలాలకు చెందిన పది మంది రైతులతో కలసి సోమవారం నిప్పంటించారు.

తమ పంట ఎట్లాగూ చేతికి రాదని, కళ్లముందే ఎండిపోతుండడంతో చేసేదేమీలేక నిస్సహాయ స్థితిలో వరి పంటకు నిప్పంటించామని బోరుమని విలపించారు. రైతులు ఒక్కసారిగా తమ పంట పొలాలకు నిప్పంటించుకోవడంతో మండలంలోని పలు గ్రామాల రైతులలో ఆందోళన నెలకొంది.తలాపున మధ్యమానేరు, పక్కనే అన్నపూర్ణ (అనంతగిరి) రిజార్వాయర్లు ఉన్నా కనీసం పంట సాగు చేసుకునేందుకు నీరు అందివ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యమానేరు జలాశయం ద్వారా నీటిని విడుదల చేసి, అన్నపూర్ణ రిజార్వాయర్‌లో నీరు నింపి, కాలువ ద్వారా నీరందించాలని ఎన్నిసార్ల్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

సాగునీరు అందక ఎండుతున్న పంట పొలాలు
మండలంలోని ఆయా గ్రామాలలో వరి పంటలకు సాగునీరందక పోవడంతో పెద్ద ఎత్తున పంటపొలాలు ఎండిపోతున్నాయి. దీంతో పశువులకు మేతగా, మరికొంతమంది పంటకు నిప్పంటించి నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటివరకు సుమారుగా 300 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండినటు రైతులు చెబుతున్నారు. ఇలాగే నీరందివ్వక పోతే ఎక్కువ మొత్తంలో పంటలు ఎండి రైతులు రోడ్డున పడతారని వాపోతున్నారు.

రైతులను పరామర్శించిన బెంద్రం తిరుపతిరెడ్డి
ఆక్రందనతో పంట పొలాలకు నిప్పంటించిన రైతులను మండల యువజన సంఘాల నాయకుడు బెంద్రం తిరుపతిరెడ్డి, బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు పరామర్శించారు. రైతులు మనోధైర్యం కోల్పోవద్దని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక శాసనసభ్యుడు కవ్వంపెల్లి సత్యనారాయణ చొరవ తీసుకుని రైతుల పంట పొలాలకు కాలువ ద్వారా నీటిని అందివ్వాలని కోరారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. అమ్ముల అశోక్, రడం రజనీకాంత్, బండారి రవి, కదరరాజు, గంట మల్లేశ్, అరుకుటి మల్లేశం తదితరులు బాధిత రైతులను పరామర్శించిన వారిలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News