ఒకటి రెండు రోజుల్లో అధికారిక
ఉత్తర్వులు డిసెంబర్ 2న బాధ్యతల
స్వీకరణ 3తో ముగియనున్న ప్రస్తుత
చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం
స్పెషల్ సిఎస్‌గా వెంకటేశంకు
పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. బుర్రా వెంకటేశం నియామక ఫైల్‌పై గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సంతకం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుత టిజిపిఎస్‌సి ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఛైరమ్ నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 45 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కమిషన్ చైర్మన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఉన్నారు.
చివరికి బుర్రా వెంకటేశం పేరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపిక చేసి, నియామక ఫైల్‌ను గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బుర్రా వెంకటేశం ఐఏఎస్‌కు స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, రాజ్‌భవన్ సెక్రటరీ, బిసి సంక్షేమ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న అన్ని పోస్టులకు బుర్రా వెంకటేశం రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయడంతో దానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ప్రభుత్వం బుర్రా వెంకటేశం విఆర్‌ఎస్‌కు ఆమోదం తెలిపిన వెంటనే టిజిపిఎస్‌సి చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. డిసెంబర్ 2వ తేదీన బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.
సర్వేల్ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం
1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లాలో జన్మించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు కలెక్టర్లు అయ్యారంటూ సిఎం రేవంత్ రెడ్డి బుర్రా వెంకటేశం గురించి పలు వేదికలపై ప్రస్తావించారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బుర్రా వెంకటేశం సర్వీస్ 2028 ఏప్రిల్ 10 వరకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిజిపిఎస్‌సి ఛైర్మన్‌గా ఈ ఏడాది జనవరిలో మాజీ డిజిపి మహేందర్ రెడ్డిని నియమించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయగా, అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనున్న నేపథ్యంలో బుర్రా వెంకటేశంను నూతన ఛైర్మన్‌గా నియామకం కానున్నారు.