ఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సంస్థ ఎండి సజ్జనార్
పండగ సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం
మన తెలంగాణ/హైదరాబాద్ : మంథని సమీపంలో కారు డ్రైవర్ అజాగ్రత్తగా, అతి వేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడం వలన బస్సు లోయలో పడిందని ఆర్‌సిటి ఎండి సజ్జనార్ తెలిపారు. జరిగిన ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. పండగ సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం, బాధాకరమని వ్యాఖ్యానించారు. బస్సు డ్రైవర్ చాకచక్యం వలన చిన్న గాయాలు అయినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలిగాడన్నారు.
రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు బాధ్యతగా వాహనాలు నడిపితే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావు అని ఈ సందర్భంగా సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి, గాయపడిన వారికి తన తరపున, ఆర్‌టిసి యాజమాన్యం తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ఎవరైనా రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
అలాగే హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని ఆయన వ్యాఖ్యానించారు. మన ప్రాణాలు మనకు ఎంత ముఖ్యమో ఇతర వాహనాదారుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. మనం చేసే తప్పువలన ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పాలవుతాయని గుర్తుంచుకోవాలన్నారు. ఈనేపథ్యంలో వాహనదారులందరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆర్‌టిసి సంస్థ యాజమాన్యం తరఫున తెలియజేస్తుస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.