డమాస్కస్ : సిరియా రాజధానిలో ఓ బస్సులోని రెండు బాంబులు పేలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. సిరియా సైనికులను తీసుకుని వెళ్లుతున్న బస్సులో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీనితో డమాస్కస్‌లో భయానకస్థితి నెలకొంది. పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నట్లు సైనికాధికారులు ప్రకటన వెలువరించారు. నగరంలోనే వివిధ ప్రాంతాలలో జరిగిన కాల్పులలో పది మంది దుర్మరణం చెందారు. దీనితో బుధవారం ఒక్కరోజే హింసాత్మక ఘటనలలో మృతుల సంఖ్య 24కు చేరింది.
ఉదయం పూట రద్దీగా ఉండే సమయంలో సైనికులను తీసుకుని బస్సు వెళ్లుతుండగా రెండు బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. దశాబ్దకాలంగా సిరియా ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటుదార్లకు పోరు పలు ప్రాంతాలలో జరుగుతూ ఉంది. ప్రత్యేకించి దేశపు వాయవ్య ప్రాంతం రెబెల్స్ అధీనంలో ఉంది. అయితే ప్రభుత్వ పూర్తి అధీనంలో ఉన్న రాజధాని డమాస్కస్‌లో ఇటువంటి పేలుళ్ల ఘటన జరగడం అసాధారణం అయింది. 2018లో ప్రెసిడెంట్ బస్హర్ అసాద్ సైనిక బలగాలు తిరుగుబాటుదార్లను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టాయి. అయితే ఇప్పటి ఘటన అధికారిక వర్గాలలో కలకలానికి దారితీసింది. ఇప్పటివరకూ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ కూడా ప్రకటన వెలువరించలేదు.