ట్రావెల్స్ బస్సు భీభత్సం సృష్టించిన సంఘటన ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి పాదచారులు, వాహనదారులపైకి దూసుకు రావడంతో రోడ్డుపై ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గో టూర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. శనివారం ఉదయం బస్సు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ వద్దకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ వద్ద అతివేగంతో దూసుకొస్తున్న బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అదే స్పీడ్‌లో కారును ట్రావెల్స్ బస్సు ఈడ్చుకెళ్లింది. బస్సు దూసుకురావడంతో వాహనదారులు, పాదాచారులు భయంతో పరుగులు పెట్టారు.
అయితే వెనక నుంచి బస్సు దూసుకొస్తున్న విషయం కారులో ఉన్న డ్రైవర్‌కు తెలియకపోవడంతో అక్కడ ఉన్న వారు అక్కడ ఉన్న వారు కేకలు వేశారు. వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా కారులో నుంచి బయటకు దూకాడు. నిమిషం వ్యవధిలో కారు డ్రైవర్ అందులో నుంచి దూకేసి తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఆ వెంటనే కారును బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అతివేగం.. అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రావెల్స్ బస్సును, కారును అక్కడి నుంచి తరలించారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అలాగే కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.