మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో కనీసం తొమ్మిది మంది మరణించారు. మరో 20 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని నదన్ దేహత్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
మైహర్ పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న డంపర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనాస్థలంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మైహార్, అమర్‌పతన్‌లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు.