ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని కొండ కోరాపుట్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున బస్సు బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా, మరో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బోయిపరిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుప్తేశ్వర్ సమీపంలోని డోక్రిఘాట్ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు కటక్‌లోని నియాలీ నుండి దాదాపు 50 మంది భక్తులతో గుప్తేశ్వర్ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కొండ రహదారిపై మలుపులు తిరుగుతున్నప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే బస్సు బోల్తా పడినట్లు అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారని వారు తెలిపారు. వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం మాఝీ
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సిఎం చరణ్ మాఝీ.. 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.