Monday, January 20, 2025

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. కాలువలోకి బస్సు దూసుకెళ్లి 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఆదివారం ఉదయం రోడ్డు పక్కన కాలువలోకి బస్సు దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడ్డారు. ఎమద్ పరిబహాన్ సంస్థకు చెందిన ఈ బస్సు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు బంగబంధు ఎక్స్‌ప్రెస్ మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మాదారిపూర్ లోని షిబ్‌చార్ ప్రాంతంలో ఉదయం 7.45 గంటల సమయంలో బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కాలువ లోకి దూసుకెళ్లిందని పోలీస్ సూపరింటెండెంట్ మహ్మద్ మసూద్ ఆలం చెప్పారు. 14 మంది మృతదేహాలను బయటకు తీసినట్టు మాదారిపూర్ డిప్యూటీ కమిషనర్ రహిమా ఖతూన్ తెలియజేశారు.

మరో ముగ్గురు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారని ఆమె చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని షిబ్‌చార్ ఉపాజిలా హెల్త్ కాంప్లెక్సుకు, ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించామని తెలిపారు. అక్కడ మరో ఇద్దరు చనిపోయారని డ్యూటీ డాక్టర్ వెల్లడించారు. బాధితుల్లో చాలామంది మాదారిపూర్ వారే. బస్సుటైర్లలో ఒకటి పంక్చర్ కావడంతో బస్సు అదుపు తప్పిందని భావిస్తున్నామని, బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిందని, ఫైర్‌సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ షిప్లు అహ్మద్ (ఫరీద్‌పూర్) వివరించారు. పద్మా వంతెన ప్రారంభించిన తరువాత ఘోరమైన ప్రమాదం ఇదేనని ఎస్‌పి మసూద్ ఆలం చెప్పారు.

మృతదేహాలను అప్పగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి కమిటీ ఏర్పాటైంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 టాకాలు వంతున అంత్యక్రియల కోసం ప్రభుత్వం నగదు అందిస్తోంది. డైలీస్టార్ పత్రిక కథనం ప్రకారం ఎలాంటి ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండా మూడు నెలల నుంచి నడుపుతున్నారని వివరించింది. ఈ బస్సుకు ఫిట్‌నెస్ క్లియరెన్స్ గడువు ఈ ఏడాది జనవరితో ముగిసిందని బంగ్లాదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ చెప్పినట్టు కథనం పేర్కొంది. ఇది కూడా బస్సు స్పీడుగా వెళ్లడానికి, ప్రమాదానికి ఒక కారణంగా హైవే పోలీస్ అనుమానిస్తున్నారు. మొత్తం 43 మంది ప్రయాణికులతో బస్సు ఢాకాకు బయలుదేరిందని షోనాడాంగా బస్సు కౌంటర్ కు చెందిన మహమ్మద్ సబుజ్ ఖాన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News