మాస్కో: ఉక్రెయిన్ లోని ఖర్కోవ్, సుమీ నగరాల నుంచి భారతీయ విద్యార్థులతోపాటు ఇతర దేశీయులను రష్యా సరిహద్దు బెల్గొరాడ్ రీజియన్‌కు తరలించడానికి 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని రష్యా ప్రకటించింది. రష్యా అగ్రస్థాయి మిలిటరీ జనరల్ గురువారం ఈ ప్రకటన చేశారు. ఉక్రెయిన్ లోని యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి క్షేమంగా భారతీయ విద్యార్థులను తరలించేలా చూడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడీ బుధవారం చర్చించిన దానికి స్పందనగా రష్యా నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ అధినేత కల్నల్ జనరల్ మైఖాయిల్ మిజింట్స్‌వ్ బస్సుల ఏర్పాట్లపై ప్రకటించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి బెల్గొరాడ్ రీజియన్ లోని నెఖొటెయెవ్‌కా, సుధ్జా చెక్‌పోస్టుల నుంచి ఖర్కోవ్, సుమీ లకు వెళ్లడానికి 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఈ స్థలాల్లో తాత్కాలిక వసతులు ఏర్పాటు చేయడమైందని, మిగిలినవి చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేయడమైందని తెలిపారు. శరణార్థులకు భోజనం, ఔషధాల నిల్వలతో మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటైనట్టు తెలిపారు. బెల్గొరాడ్ వరకు బస్సులపై వెళ్లినవారు అక్కడ నుంచి స్వదేశాలకు రష్యా మిలిటరీ విమానాలతో సహా విమానాల ద్వారా వెళ్లవచ్చని తెలిపారు.