సురక్షితంగా కాపాడిన పోలీసులు
వాగులో కొట్టుకుపోయిన వాహనాలను కాపాడిన స్థానికులు
కామారెడ్డి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం లోని కొండాపూర్ శివారు లో ఉన్న సంగమేశ్వర వాగు దగ్గర మెదక్ వైపు నుండి కామారెడ్డికి వెళ్తున్న ఆర్టిసి బస్సు కల్వర్టు దగ్గర చిక్కుకోవడం తో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు రెండు మెదక్ కు వెళ్లి తిరిగి వస్తుండగా వాగులో చిక్కుకున్నాయి దీంతో విషయాన్ని తెలుసుకున్న స్థానిక రాజంపేట ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
హుటాహుటిన సంబంధిత అధికారులు డిపో మేనేజర్ ఆనంద్ సిఐ మూర్తి, వారి సిబ్బంది స్థానిక తహసిల్దార్ జానకి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరొక బస్సు ను తీసుకువచ్చి 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అలాగే మండలంలోని అన్నారం గ్రామంలో ద్విచక్ర వాహనం కొట్టుకుపోగా ఇద్దరు వ్యక్తులను స్థానికులు తాళ్ల సహాయంతో కాపాడారు. అలాగే ద్విచక్రవాహనాన్ని జెసిబి తో బయటకు తీశారు. రాజంపేట దగ్గరలో గల మొండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జాలర్లు కొట్టుకుపోగా వారిని కాపాడారు. గురువారం వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులను శుక్రవారం ఉదయం 7 గంటలకు కామారెడ్డి డిపోకు తరలించారు. వాగు వరద ఉధృతిలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. వరదలు తగ్గుముఖం పట్టాక ఆయా రూట్లలో బస్సులు నడిపిస్తామని డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. మండలంలోని కొండాపూర్ గుండారం ఎల్లారెడ్డిపల్లి రాజంపేట గ్రామాలలోని చెరువులు నిండుకుండలా మారాయి