Thursday, January 23, 2025

ఫోన్‌కాల్స్ ద్వారా వ్యాపార వృద్ధి!

- Advertisement -
- Advertisement -

ఏదో బిజీ పనిలో ఉండ గా మొబైల్ మోగుతుంది. చూస్తే ఏదో నంబర్ నుంచి కాల్. ఎత్తితే మీకు కారు లోన్ కావా లా.. లేదా మీ కారుపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అని ఓ ఆడగొంతు నుంచి ప్రశ్నలు వినిపిస్తాయి. ముందు సంస్కారయుతంగా గుడ్ మార్నింగ్ సార్ లేదా గుడ్ ఈవెనింగ్ అన్నా ఆ తర్వాత అడిగే ప్రశ్న అదే. ఒక్క కార్ల విషయంలోనే కాకుండా బ్యాంకు అకౌంట్, రియల్ ఎస్టేట్, ఇన్స్యూరెన్స్ లాంటి ఎన్నో విషయాలపై ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. ఈ కాలంలో ఇలాంటి కాల్స్ రాని మొబైల్ ఉండదేమో అనేది అతిశయోక్తి కాదు. ఆ కాల్స్ చేసేవారికి ఆ ఫోన్ నంబర్ ఎవరిదో తెలియదు. తెలిసిందల్లా తమసంస్థ అందిస్తున్న వ్యాపార సదుపాయాల గురించి చెప్పడమే. తమ ఉత్పత్తుల, సేవల ప్రచారం కోసం వ్యాపార సంస్థలకు చౌకగా దొరుకుతున్న సదుపాయం ఇదే. దీని వల్ల వ్యాపార వృద్ధి జరుగుతోందని అన్ని సంస్థలు ఒప్పుకుంటున్నాయి.
ఫోన్ కాల్ వచ్చిన వారిలో 45% స్పందిస్తున్నారని, 65% కంపెనీలు కాల్స్ వల్ల ప్రయోజనం ఉందని అంటున్నాయి. చేసిన కాల్స్‌కి వచ్చిన జవాబులను బట్టి వాటిని విభజించే ఎవరెవరికి తిరిగి కాల్ చేయాలి అనేది నిర్ణయించబడుతుంది.

ఉదాహరణకు ఇన్సూరెన్స్ గురించి వచ్చిన కాల్‌కు ఇన్సూరెన్స్ అవసరం లేదు అని ఖచ్చితమైన బదులు వచ్చిన నంబర్‌కు తిరిగి ఆ సంస్థ నుండి కాల్ వెళ్ళదు. చాలా మంది షేర్లలో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతుంటారు. అయితే అందరికి సరైన గైడెన్స్ లభించదు. అలాంటివారు ఈ కాల్స్ పట్ల ఆసక్తి చూపుతూ వివరాలు తెలుసుకుంటుంటారు. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి గలవారు కూడా కాల్స్‌కి స్పందిస్తుంటారు. ఇలా అనుకూల స్పందన లభించిన కాల్స్‌ని వేరు చేసి తమ వ్యాపారాభివృద్ధికి తోడ్పడేలా సంస్థ లు మలుచుకొంటాయి.అయితే ఈ కాల్స్ అవసరం అనుకొనే వాళ్ల కన్నా వద్దనుకొనేవాళ్లే ఎక్కువ. వ్యక్తిగత అవసరాల, ప్రాముఖ్యత గల సందర్భాల్లో ఇలాంటి కాల్స్ వచ్చి చికాకు కలిగిస్తుంటాయి. మధ్యాహ్నం వేళల్లో అందరు కొంత ప్రశాంతంగా ఉంటారనే దృష్టిలో ఆ సమయాల్లో ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. వయసు పైబడినవారు చిన్న నిద్రతో విశ్రాంతి తీసుకునే వేళలో ఈ ఫోన్ మోతలు భంగకరంగా మారుతున్నాయి. ఆ సమయాల్లో రోజుకి ఒకటి లేదా రెండు కాల్స్ వస్తున్నాయని కొందరు అంటున్నారు. అవి కూడా వారికి వర్తించని, ఉపయోగం కాని విషయాలపై రావడం బాధాకరం.

అసలు ఇలాంటి అనవసరపు కాల్స్ రాకుండా ఉండేలా మార్గాలేమైనా ఉన్నాయా అనే ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటుంది. మొబైల్ సెట్టింగ్స్ పై కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఆ నెంబర్లను బ్లాక్ చేస్తుంటారు. అలా ఎన్ని బ్లాక్ చేసినా కొత్త నంబర్లతో కాల్స్ వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి ఇలా కాల్స్ చేయడం అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను భంగం కలిగించడమే. తమను ఇబ్బంది పెట్టే ఒక్క కాల్ విషయంలోనూ ఫిర్యాదు చేసే చట్టపర హక్కు వినియోగదారుడికి ఉంది. కాల్స్ ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టినట్లు రుజువైతే ఆ నంబర్లను బ్లాక్ చేసే అధికారం టెలికామ్‌కు ఉంది. విదేశాల విషయానికొస్తే చాలా దేశాల్లో ఒకరికి వ్యాపార సంబంధిత కాల్స్ చేసే ముందు వారి అనుమతి తీసుకుంటారు. ఫలానా విషయంపై మీకు మెసేజిలు, ఫోన్ కాల్స్ కాని చేయాలనుకుంటున్నాం. అవసరమైతే ఒకే చెప్పండి అని నంబరుకి ఓ మెసేజి పంపుతారు. నో చెప్పినా, అసలు జవాబే చెప్పుకున్నా ఆ సంస్థ నుండి కాల్స్, మెసేజిలు రావు. మళ్ళీ రెండు లేదా మూడేళ్ళ తరువాత మరోసారి ఆ సంస్థ సంప్రదించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మన దేశంలో ఇలాంటి చట్టాలు రాలేదు. వినియోగదారుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని జులై 2023లో ట్రాయ్ స్పందించింది.

మన దేశంలో టెలికామ్ వ్యవస్థని నియంత్రించే ఈ సంస్థ ‘కాల్ లేదా మెసేజి పంపే ముందు మొబైల్ నంబర్ నుండి అనుమతి తీసుకోవాలి’ అనే నిబంధనను త్వరలో పెట్టనుందని సమాచారం. దీని ఆవశ్యకత ఎంతో ఉందని, తక్షణ నిర్ణయం అవసరమని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అయితే అంతకు ముందు కూడా వినియోగదారుడు స్వయంగా ఈ కాల్స్ ని కట్టడి చేసే మార్గం కూడా ఉంది. ‘డు నాట్ కాల్’ అనే అప్షన్‌ను వాడుకోవచ్చు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రతి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అంటే బి ఎస్ ఎన్ ఎల్, ఎయిర్ టెల్ , జియో లాంటి సంస్థలు ‘డు నాట్ డిస్టర్బ్ రిజిస్ట్రీ’ అనే సదుపాయాన్ని తమ వినియోగదారులకు అందించాలి. అన్ని సంస్థలు ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ 1909 కు మెసేజి లేదా ఫోన్ కాల్ ద్వారా అవసరం లేని ఫోన్ నంబర్లను తెలియజేస్తే ఆ సంస్థలు తక్షణమే చర్య తీసుకొని ఆ నంబర్ల నుండి కాల్స్‌ని నిర్బంధిస్తాయి. ప్రతి కంపెనీ డిఎన్‌డి నమోదు కోసం ఒక సైట్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇలా నో అని పేర్కొన్న నంబర్లకు తిరిగి వ్యాపార కాల్స్ వస్తే ట్రాయ్ ఆ నంబర్‌కు రూ. పది వేల జరిమానా విధించవచ్చు. అయినా వినకపోతే ఆ నంబరును బ్లాక్ చేసే అధికారం ఆ సంస్థకు ఉంది. అదే విధంగా కొన్ని వ్యాపార సంస్థలు కూడా తమ కాల్స్ అవసరం లేదనుకొనేవారు నంబరును తెలిపేలా డి ఎన్ డి అప్షన్‌ను తమ వెబ్ సైట్లో ఉంచుతున్నాయి.

బజాజ్ ఫైనాన్స్ సైట్లో దీన్ని చూడొచ్చు. వ్యాపార, సేవల అమ్మకాల కోసం ఇలా కాల్ చేసేందుకు ఇన్ని ఫోన్ నంబర్లు సంస్థలకు ఎలా లభిస్తాయి అనే సందేహం సహజమే. నిజానికి ప్రతి మొబైల్ నంబర్ ఎక్కడో ఓ చోట లేదా ఎన్నో చోట్ల రికార్డు అయి ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్, ఆర్డర్లు అన్ని మొబైల్ నంబర్ ద్వారానే జరుగుతాయి. హాస్పిటల్, మెడికల్ షాప్, క్లినికల్ ల్యాబ్‌కు వెళ్లగానే ముందు మొబైల్ నంబర్ అడుగుతారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తి తన పేరుతో కాకుండా మొబైల్ నంబర్‌తో గుర్తింపబడుతున్నాడు. ఇలా లక్షలాది నంబర్లు ఎన్నో కంపెనీల డేటా బేస్ లో నిక్షిప్తమై ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో ఎన్నో నంబర్లు ఉంటాయి. అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ కమిటీ వద్ద ఫ్లాట్ ఓనర్ల నంబర్లు ఉంటాయి. ఈ నంబర్లను ఆయా సంస్థలు సులువుగా సేకరించవచ్చు. అంతేకాకుండా విదేశాల్లో మొబైల్ నంబర్ల అమ్మకం ఓ వ్యాపారం. ప్రపంచంలోని ఏ దేశంలోని మొబైల్ నంబర్లనైనా అందజేసే వ్యవస్థ గల కంపెనీలున్నాయి. వృత్తిపరంగా, ఆదాయపరంగా విభజించి కూడా లభిస్తాయి. అప్ వర్క్ అనే సంస్థ ఒక్క రోజులో 50 వేల నంబర్లను అందించగలదు. మన దేశంలో ఎల్లో అంబ్రెల్లా లాంటి కంపెనీలు ఫోను నంబర్లను కొనుగోలు చేసి వివిధ సంస్థల వ్యాపార ప్రచారాలను మొబైళ్ల ద్వారా చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. 14 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ 500 ఉద్యోగులతో వేయి సంస్థలకు సేవలందిస్తోంది. రెండు నిమిషాల ముచ్చట వెనకాల ఇంత విశేషముంది మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News