ఆంటిగ్వా పోలీసుల గాలింపు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 13,500 కోట్ల రుణాన్ని ఎగవేసి దేశం విడిచి పారిపోయి కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా-బార్బుడాలో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ గత ఆదివారం నుంచి కనపడడం లేదని ఆయన న్యాయవాది తెలిపారు. ఆదివారం కారులో కనిపించిన చోక్సీ ఆ తర్వాత నుంచి కనిపించడం లేదని, పోలీసులకు అతని కారు లభించిందని ఆంటిగ్వాన్ పోలీసులు సోమవారం తెలిపారు.
ఇదే విషయాన్ని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ కూడా ధ్రువీకరించారు. చోక్సీ కోసం ఆంటిగ్వా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, చోక్సీ భద్రతపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని న్యాయవాది తెలిపారు. కాగా..పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితులలో ఒకరైన చోక్సీపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న సిబిఐ చోక్సీ అదృశ్యానికి సంబంధించిన వార్తలను నిర్ధారించుకుంటున్నట్లు సిబిఐ అధికారి ఒకరు తెలిపారు. సిబిఐ అభ్యర్థన మేరకు చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసును ఇప్పటికే ఇంటర్‌పోల్ జారీచేసింది. తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,500 కోట్లు ముంచిన కేసులో చోక్సీ, అతని బంధువు నీరవ్ మోడీపై సిబిఐ కేసులు నమోదు చేసింది. నీరవ్ మోడీ లండన్‌కు పారిపోగా చోక్సీ కరేబియన్ దీవులలో తలదాచుకున్నాడు.