Thursday, December 19, 2024

‘బుట్ట బొమ్మ’ సినిమాలో కథే హీరో: సిద్ధు జొన్నలగడ్డ

- Advertisement -
- Advertisement -

గతేడాది ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలతో ఘన విజయాలను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏడాదిని కూడా అంతే ఘనంగా ప్రారంభించబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘బుట్ట బొమ్మ’. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హైయత్ హోటల్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. యువ సంచలనం సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దర్శకులు మారుతి, సంపత్ నంది, శైలేశ్ కొలను, అనుదీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..”నన్ను ఈ వేడుకకు ఆహ్వానించిన వంశీ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. సితార అనేది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. వాళ్ళ సినిమా అంటే నా సినిమా లాంటిదే. బుట్టబొమ్మ గురించి చెప్పాలంటే కథే ఈ సినిమా హీరో. ఈ సినిమా ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, అంతే వైల్డ్ గా ఉంటుంది. అసలు ఈ సినిమా నేను చేయాలి.. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఈ సినిమా చూశాక ‘అట్లుంటది మనతోని’ అని ఈ సినిమా అంటుంది మీతో. ఈ సినిమా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి.. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే దర్శకుడు రమేష్ ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారని అర్థమవుతుంది. అనిఖా, సూర్య, అర్జున్ దాస్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సితార నుంచి వస్తున్న మరో మంచి సినిమా ఇది. డీజే టిల్లు చూసినవాళ్లు అందరూ ఈ సినిమా కూడా చూసి ఆదరించండి. చాలా బాగుంటుంది.” అన్నారు.

చిత్ర దర్శకుడు రమేష్ మాట్లాడుతూ.. “నాకు ఈ అవకాశమిచ్చిన చినబాబు గారికి, వంశీ గారికి ధన్యవాదాలు. అలాగే నన్ను చినబాబు గారికి, వంశీ గారికి పరిచయం చేసిన నవీన్ నూలి గారికి ధన్యవాదాలు. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. కథాకథనాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని తెలుగులో తీస్తే బాగుంటుంది అనిపించించింది. అదే సమయంలో సితార బ్యానర్ రైట్స్ తీసుకున్నారని తెలిసి.. నవీన్ గారి ద్వారా చినబాబు గారిని, వంశీ గారిని కలిశాను. నేను తీయగలనని నమ్మి వారు నాకు ఈ అవకాశమిచ్చారు. ఈ సినిమా కోసం వంశీ గారు నాకు మంచి నటీనటులను, గొప్ప టెక్నిషియన్స్ ని ఇచ్చారు. గోపిసుందర్ గారు, స్వీకర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. డీవోపీ వంశీ గారి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసి త్రివిక్రమ్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. సుకుమార్ గారితో కలిసి చాలాకాలం పనిచేశాను. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ అనుభవంతోనే ఈ సినిమా కోసం శాయశక్తులా కష్టపడ్డాను. థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది.” అన్నారు.

అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ.. “నాకు ఇంతమంచి అవకాశమిచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ కి, నాగవంశీ గారికి, దర్శకుడు రమేష్ గారికి ధన్యవాదాలు. సూర్య, అర్జున్ దాస్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

సూర్య మాట్లాడుతూ.. ” ఈ వేడుకకు హాజరైన సిద్ధు అన్నకు ధన్యవాదాలు. డీజే టిల్లు చూసి ఆయన అభిమానిగా మారిపోయాను. ఆయన ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ప్రేక్షకుడిగా ఇలాంటి సినిమా వేడుకలు చూడటం అలవాటు. అలాంటిది ఇప్పుడు నేను ఈ వేదిక మీద ఉండి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి కారణం మా నాన్నగారు సత్యం గారు. రెండున్నరేళ్ల క్రితం మా నాన్నగారు ఈ సినిమా మలయాళ వెర్షన్ చూపించి.. ఈ ఆటో డ్రైవర్ పాత్ర నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు.

తర్వాత సితార బ్యానర్ ఈ రైట్స్ తీసుకొని సిద్ధు అన్న, విశ్వక్ అన్నతో తీయాలి అనుకుంటున్నారని తెలిసింది. కొంతకాలానికి అనుకోకుండా మా నాన్నగారు కోవిడ్ వల్ల చనిపోయారు. ఆయనతో నేను చివరి మాటలు మాట్లాడకపోయినా.. ఆయన నన్ను ఈ పాత్రలో చూడాలనుకున్నారు అనేది ఒక్కటి నాకు బాగా గుర్తుంది. ఆయన చనిపోయాక చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నన్ను చూసి నువ్వు ఈ పాత్రకు సరిపోతావు అనుకుంటాను, ఒకసారి వెళ్లి ఆడిషన్ ఇవ్వు అన్నారు. ఆడిషన్ ఇచ్చాక దర్శకుడు రమేష్ గారు నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారు. అలా మా నాన్న కోరిక నెరవేరింది. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు, వంశీ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. రమేష్ గారి దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా ఆయనకు ఎన్నో అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. అనిఖా, అర్జున్ దాస్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “ఈ సినిమాకు బుట్టబొమ్మ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుంది. నాకు బాగా నచ్చిన సినిమాల్లో కప్పేల ఒకటి. వంశీ గారు ఇంతమంచి టీమ్ తో తెలుగులో రూపొందించడం సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. గణేష్ రావూరి గారి సంభాషణలు ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు మరో మంచి రచయిత దొరికాడు అనిపించింది. మంచి సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కృషి చేశారు. నా ‘లవర్స్’ సినిమా సమయం నుంచి వంశీ గారిని గమనిస్తున్నాను. నిర్మాతగా ఆయన ఎదిరిగిన తీరు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఒక వైపు పెద్ద సినిమాలు తీస్తూ, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహించడం అభినందించదగ్గ విషయం. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో వచ్చే వరకు ఎదురుచూడకుండా.. ఇలాంటి మంచి సినిమాలకు థియేటర్లలో చూసి ఆదరించండి” అన్నారు.

దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. “బుట్టబొమ్మ విజువల్స్ చూసినప్పుడు ఉయ్యాల జంపాల లాంటి ఒక అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు సినిమా గుర్తొచ్చింది. ప్రేమమ్, భీమ్లా నాయక్, ఇప్పుడు బుట్టబొమ్మ.. ఏదైనా మంచి కంటెంట్ ఉంటేనే వంశీ గారు ఆ సినిమా మనకు అందిస్తారు. వంశీ గారికి ఇది మరో ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రమేష్ గారిని చాలారోజుల తర్వాత కలుస్తున్నాను. నేను చేసిన రచ్చ సినిమాకు ఆయన సహకారం చాలా ఉంది. అప్పుడు ఆయన దగ్గర నేను ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నాను. ఈ బుట్టబొమ్మ హిట్టుబొమ్మ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు శైలేశ్ కొలను మాట్లాడుతూ.. ” సితారతో, వంశీ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. నా ‘హిట్’ సినిమా విడుదల కాకముందే.. టీజర్, ట్రైలర్ చూసి నా మీద నమ్మకంతో నాకు అడ్వాన్స్ ఇచ్చారు. నన్ను అంతలా నమ్మిన వంశీ గారికి ధన్యవాదాలు. ఈ మూవీ ట్రైలర్ నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఈ సినిమా మలయాళంలో చూసినప్పటికీ, కథ తెలిసినప్పటికీ.. ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా మళ్ళీ చూడాలనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ లో కొత్తదనం కనిపించింది. ఈ కథ చాలా బాగుంటుంది. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు. దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. “నాగవంశీ గారి కథల ఎంపిక చాలా బాగుంటుంది. ఈ చిత్రంతో ఆయన మరో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News