Monday, April 21, 2025

ఉప ఎన్నికలొస్తున్నాయ్

- Advertisement -
- Advertisement -

 ఈ ఏడాదే జరగనున్న పోరు పార్టీ శ్రేణులంతా
సిద్ధంగా ఉండాలి ఓటర్లు కాంగ్రెస్‌ను గెలిపించి
తినే అన్నంలో మన్ను పోసుకున్నారు సిఎం మాటలన్నీ
బోగస్ కెసిఆర్ గెలుపు చారిత్రక అవసరం : కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే ఉప ఎన్నికలు వస్తాయని, అందరూ సిద్ధంగా ఉండాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయం అని పేర్కొన్నారు. త్వరలో జరిగే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారందరికి కెటిఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం మన కోసం కాదు అని, తెలంగాణ సమాజానికి మళ్లీ కెసిఆర్‌ను సిఎం చేసుకోవడం చారిత్రక అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంద వ్యాఖ్యానించారు. పదేండ్ల పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లాగా కెసిఆర్ పరుగులు పెట్టించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓడిపోవడంతో పార్టీకి జరిగిన నష్టం కంటే తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఎన్‌టిఆర్ పెట్టిన టిడిపి, కెసిఆర్ స్థాపించిన బిఆర్‌ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయని చెప్పారు. మతం పిచ్చి లేపుడు తప్ప బిజెపి చేసింది ఏం లేదని, బడే భాయ్ మోదీ నాయకత్వంలో దేశం… చోటే భాయ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం వెనక్కిపోతుందని విమర్శించారు. మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు అని, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా మోదీ ఇవ్వలేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మాయమాటలకు వివిధ వర్గాల ప్రజలు మోసపోయారు

కాంగ్రెస్ చెప్పిన మాయమాటలకు రాష్ట్రంలో ఆడబిడ్డలు, రైతులు,వృద్ధులు మోసపోయారని కెటిఆర్ అన్నారు. అశోక్ నగర్ వచ్చి రాహుల్ గాంధీ ఫోజులు కొట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే యువత మోసపోయిందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను ఎవరూ నమ్మడం లేదని ఖర్గే,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ, సిద్ధ రామయ్య, సోనియాగాంధీని పిలిచి హామీలు ఇప్పించారని విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపించి తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి మాటలన్నీ బోగస్ అని, 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందని పేర్కొన్నారు.

ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్న కాంగ్రెస్ నేతలను హైడ్రా ముట్టుకోలేదని ఆరోపించారు. కానీ హైడ్రా పేరుతో పేదల ఇండ్లు మాత్రం కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి సిఎం కాగానే ఎయిర్ పోర్టుకు మెట్రోను రద్దు చేశారని మండిపడ్డారు. తన భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు చేశారు అంట అని పేర్కొన్నారు. రాజేంద్ర నగర్‌లో తనకు భూములు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, తనకు ఎక్కడ భూములు ఉన్నాయో వారు చూపించాలని అడిగారు. ఇచ్చిన హామీలకు పైసలు లేవంట,కానీ మూసీకి మాత్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తారటా అని మండిపడ్డారు. ఫార్మా సిటీ రద్దు అన్నారు.. ఇప్పుడు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటున్నారు.. మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. ఫిబ్రవరి నెలలో 31 ఉండదని ఎంత నిజమో, రేవంత్ రెడ్డి మాటలు కూడ అంతే అని ఎద్దేవా చేశారు.

మంచి పనులను బిఆర్‌ఎస్ ఎప్పుడూ అడ్డుకోలేదు

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కెటిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంచి పనులు చేశారని అన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని తాము కొనసాగించామని చెప్పారు. వైఎస్ ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టారని అసెంబ్లీలో కెసిఆర్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంచి పనులను బిఆర్‌ఎస్ ఎప్పుడూ అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కెసిఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి

ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 27న ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేయాలని చెప్పారు. నియోజకవర్గాల్లో జెండా దిమ్మెలకు గులాబీ రంగు వేసుకోవాలని, దిమ్మె లేకపోతే గుంపు మేస్ట్రీతో కొత్తవి కట్టుకోవాలని తెలిపారు. గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు అని, రేవంత్‌రెడ్డి కూలగొట్టే గుంపు మేస్త్రీ అని పేర్కొన్నారు. మూసీ పేరుతో ఇళ్ళు కూలగొడుతుంటే అడ్డుకున్నది గులాబీ జెండా.. లగచర్ల గిరిజన రైతుల కోసం పోరాటం చేసింది గులాబీ జెండా అని చెప్పారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవశం గులాబి జెండా అని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది బిఆర్‌ఎస్‌నే అని పేర్కొన్నారు.బిజెపి, కాంగ్రెస్ పార్టీ కలిసి బిఆర్‌ఎస్‌ను లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు. ఈనెల 27 బహిరంగ సభతో కాంగ్రెస్,బిజెపి పార్టీల గుండెలు జారాలని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

హైడ్రా లాగా మేము కోబ్రా తీసుకువస్తాం : పటోళ్ల కార్తీక్‌రెడ్డి

కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకు వచ్చారో తాము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకురావడానికి కోబ్రా అని తీసుకువస్తామని బిఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని, సిఎం నుంచి మొదలుకొని వారి కుటుంబ సభ్యుల వరకు భూములు అగ్రిమెంట్ చేసుకుంటూ కబ్జాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. మూడేళ్ల తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News