Friday, December 20, 2024

కాంట్రాక్టు ఎఎన్‌ఎంలను రెచ్చగొట్టి ఈటెల లబ్దిపొందాలని ఎత్తులు

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎక్కడాలేని విధంగా వారికి వేతనాలు పెంపు: ఎర్రోళ్ల శ్రీనివాస్

మన తెలంగాణ/ హైదరాబాద్ : కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను టీఎస్ ఎం ఎస్ ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా అత్యధిక వేతనాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆశాలు, ఏఎన్‌ఎంల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నాటి ప్రభుత్వాలకు ఆశాలు, ఎన్‌ఎంలు అంటే చిన్న చూపు చూసేవని, చాలీ చాలని జీతాలు, అవి కూడా సకాలంలో చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడేవారన్నారు. నాటి ప్రభుత్వాల వెట్టి చాకిరితో ఎంతో మంది ఉద్యోగాలు మానేసిన పరిస్థితి ఉండేదన్నారు. జీతాలు పెంచాలని నిరసనలు, ధర్నాలు చేసిన అక్క చెల్లెల్లపై నాటి ప్రభుత్వాలు కఠినంగా ప్రవర్తించేవని, తీవ్ర అవమానలకు గురి చేసేవనీ, గుర్రాలతో తొక్కించిన చరిత్ర నాటి ప్రభుత్వాలదనీ మండిపడ్డారు. స్వరాష్ట్రంలో ఆశాలు, ఎఎన్‌ఎంలకు ఎలాంటి కష్టాలు, అవమానాలు లేకుండా సిఎం కెసిఆర్ చూసుకుంటున్నారన్నారు.

జీతాలు పెంచాలని రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ గౌరవంతో జీవిస్తూ, ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఆశాలు, ఎఎన్‌ఎంలకు అవకాశం కల్పించారన్నారు. నాడు మాకొద్దు ఈ ఉద్యోగాలు అని మానేసిన పరిస్థితి ఉంటే, ఇప్పుడు మాకు ఉద్యోగం కల్పించండి అంటూ నేడు ప్రభుత్వానికి వినతులు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. 2014-15లో ఏఎన్‌ఎంల వేతనం రూ. 10వేలు ఉంటే ఇప్పుడు రూ. 27,300 ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. అత్యధిక వేతనాలు అందిస్తూ అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గరిష్ఠంగా ఇస్తున్నది కేవలం రూ.17వేలు మాత్రమే అని, మన పక్క రాష్ట్రమైన ఏపీలో ఇస్తున్నది రూ. 23,393 కాగా, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇస్తున్నది కేవలం రూ. 18,523 మాత్రమేనని ఎద్దేవా చేశారు.

ఈటెల రాజేందర్‌కు నిజంగా ప్రేమ ఉంటే, ముందు బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్లుగా జీతాలు ఇచ్చేలా చూడాలన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలను గుర్తించి వారి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు అన్నారు. ప్రజల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు వీలుగా ఏఎన్‌ఎంలకు ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. మెడికల్ హెల్త్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్న1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎఎన్‌ఎంలకు ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు. వీరికి గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీని కల్పించిందన్నారు. పని చేసిన ప్రతి ఆరునెలల కాలానికి 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇవ్వగా, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి 2.5 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇచ్చిందన్నారు. ఏఎన్‌ఎంల సంఘాల సమస్యలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను ఇంగ్లీష్ తో పాటు, తెలుగులోనూ నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఆరోపణలకు అరోగ్య మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్ ఉపక్రమించడం బాధాకరం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News